Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వాణిశ్రీ అనుకుని భానుమతి రూమ్ బెల్ కొట్టాను… ఆమె ఏమన్నారంటే!

September 17, 2025 by M S R

.
Mohammed Rafee .... వాణిశ్రీ అనుకుని భానుమతి రూమ్ బెల్ కొట్టాను… భానుమతి ఏమన్నారంటే!

బొమ్మరాజు భానుమతి..! హీరోయిన్ కాదు, అప్పట్లో హీరో ఆమె..! సినిమా ఇండస్ట్రీని హడలెత్తించిన ఏకైక మహిళా నటీమణి..! మిస్సమ్మ డేట్స్ కుదరక ఆవిడ వదిలేస్తే, ఇండస్ట్రీ కి సావిత్రి వచ్చి మహానటి అనిపించుకుంది..! మిస్సమ్మలో భానుమతి నటించి ఉంటే సావిత్రి అనే మహానటికి అవకాశం వచ్చి ఉండేదా..?

భానుమతి పుట్టింది ఒంగోలు దగ్గరలో దొడ్డవరం! తన 13వ యేట వర విక్రయం సినిమాలో నటించింది! అదే ఆవిడ తొలి సినిమా! ఆమె మీద చెయ్యి వెయ్యకూడదు, ఏ సన్నివేశంలోనూ ఆమెను తాకకూడదనే వారి నాన్న గారి కండిషన్ తో ఆ సినిమా చేసింది!

Ads

ఆ తరువాత వరస సినిమాలు చేసుకుంటూ వెళ్ళింది! ఒకానొక సమయంలో ఆమె ఉంటే మిగిలిన వాళ్ళు భయపడే స్థితి! ఆమె ప్రతిభ అలా ఉండేది! ఆమె డామినేటింగ్ క్యారెక్టర్! ఎదుట ఎవరు నటిస్తున్నా లెక్క చేయని ఆత్మ విశ్వాసం! సన్నివేశం ఏదైనా అమాంతం అందరినీ నటనలో మింగేసే తత్వం!

కానీ, భానుమతి మనసు చాలా మంచిది! ఆమె అంత కచ్చితంగా నిక్కచ్చిగా వున్నా మనసు చాలా సున్నితత్వం!

నేనొకసారి అడిగాను, “గయ్యాళి రాక్షసి అనుకుంటున్నారు అందరూ! మీరు గయ్యాళిగా నటిస్తున్నారా? నిజంగా గయ్యాళితనం లోపల వుందా?” అని! ఆమె బరస్ట్ అయింది! మౌనంగా మారిపోయింది! కన్నీళ్లు అలా రాలిపోయాయి!

  • కాసేపటికి తేరుకుని “నాయనా, ఇది సినీ పరిశ్రమ! హీరోయిన్లు ఇక్కడ అంగట్లో బొమ్మలు! హీరోలదే రాజ్యం! భయపడితే ఇంకా భయపెడతారు! అందుకే నేను ఇలా మారిపోయి వాళ్లకన్నా ముందే భయపెడుతున్న! నేనంటే దడ! నేనంటే హడల్!

పిచ్చి వేషాలు వేసే వారు నా దరిదాపులకు రారు! మా నాన్న నేర్పిన పాఠం! ఆచరించి ఇలా ముద్ర వేసుకున్నాను” అని జవాబిచ్చారు! ఆమె కన్నీళ్ళ ద్వారా ఆమె ఎంత సున్నిత మనస్తత్వమో తెలియచేసారు.

పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా భానుమతికి విశాఖపట్నంలో టి.సుబ్బరామిరెడ్డి సత్కార కార్యక్రమం ఏర్పాటు చేశారు. సినిమా నటులు దర్శకులు చాలామందిని ఆహ్వానించారు. అప్పట్లో సుబ్బరామిరెడ్డి కార్యక్రమాలు నిర్వహించే ఆర్.వి.రమణమూర్తి “సినిమా వాళ్ళు చాలామంది ఉంటారు ఇంటర్వ్యూ చేసుకోవచ్చు” అని నన్ను ఆహ్వానించారు.

భానుమతిని ఇంటర్వ్యూ చేయమన్నారు. కొంచెం భయపడి “అమ్మో నావల్ల కాదు” అన్నాను. పోనీ, వాణిశ్రీ ని ఇంటర్వ్యూ చేయమని సుబ్బరామిరెడ్డి గారు చెప్పారు. విశాఖపట్నంలో అప్పట్లో అందరం కాంటినెంటల్ హోటల్ లో ఉన్నాం. వాణిశ్రీ 111 రూమ్ లో ఉన్నారని ఆర్.వి.రమణమూర్తి చెబితే వెళ్లి బెల్ కొట్టాను!

డోర్ తీశారు! ఎదురుగా భానుమతి నిలబడి ఉన్నారు! బిత్తరపోయాను! భయపడిపోయాను! మెల్లగా “వాణిశ్రీ గారు” అన్నాను. “నా రూమ్ లో ఆవిడ గారు ఎందుకుంటారు?” అని గట్టిగా ప్రశ్నించారు భానుమతి. నేను పరిచయం చేసుకుని లోపలకు అడుగు పెట్టాను!

గతంలో హైదరాబాద్ తాజ్ బంజారాలో భానుమతిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లి ఒక్క ప్రశ్న కూడా అడగకుండా ఆమె చెప్పింది రాసుకుని వచ్చిన విషయం గుర్తుకొచ్చింది! అదే విషయం గుర్తు చేశాను.

  • “సరే ఇప్పుడేం అడుగుతావో అడుగు బడుద్ధాయ్” అంది భానుమతి. బిక్కచచ్చిపోయాను! అది ఆమె సహజ శైలి! నన్ను ఏం అడగనిస్తారు? ఆమె అన్నీ చెప్పుకుంటూ వెళ్లారు! నోట్ చేసుకుంటూ నేనూ! అలా అరగంట తరువాత “ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాయి, పిచ్చి పిచ్చివి కల్పించి రాయొద్దు” అని వార్నింగ్ ఇచ్చి, కాఫీ ఆర్డర్ ఇచ్చారు!

ఆమెను చూస్తే, ఆమెను వింటే ఆమె ప్రతిభ, ఆమె ఆత్మ విశ్వాసం, ఆమె ధైర్యం కళ్ళముందు కనిపిస్తుంది! ఆమె బహుముఖీన ప్రతిభ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది! రచయిత్రి, నటి, దర్శకురాలు, గాయని, భరణి స్టూడియో అధినేత్రి, నిర్మాత వెరసి భానుమతి! ఇండస్ట్రీలో అలా రాణించిన ఒకే ఒక మహిళ భానుమతి! 1925 సెప్టెంబర్ 7 ఆమె పుట్టినరోజు. ఈ ఏడాది ఆమె శత జయంతి! ఈ సందర్భంగా కాసిన్ని మాటలు గుర్తు చేసుకున్నాను.

50 ఏళ్ళు ఆమె ఇండస్ట్రీలో కొనసాగినా ఆమె నటించిన సినిమాలు 102 మాత్రమే! 1936 లో వర విక్రయంతో మొదలు పెట్టి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. మూడు జాతీయ అవార్డులు అందుకున్నారు. ఎడిటర్ నిర్మాత దర్శకుడు పి. ఎస్. రామకృష్ణారావును ప్రేమించి వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి భానుమతీ రామకృష్ణగా పిలుచుకున్నారు.

చదువుకోలేక పోయిన లోటును తన 40వ ఏట నుంచి చదివి డిగ్రీ, పిజి పూర్తి చేశారు. మద్రాస్ మ్యూజిక్ కాలేజీ లో ప్రిన్సిపాల్ గా మూడేళ్లు పని చేశారు! ఆమె రచించిన అత్తగారి కథలు పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు లభించింది. అప్పటి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి పురస్కారంతో గౌరవించింది. ఆంధ్ర యూనివర్సిటీ కళా ప్రపూర్ణ బిరుదుతో పాటు గౌరవ డాక్టరేట్ ఇచ్చింది.

శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ కూడా గౌరవ డాక్టరేట్ తో గౌరవించింది. రెండు యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న ఒకే ఒక్క మహిళా నటి భానుమతి! ఆనాటి తరంతో పాటు నిన్నటి తరానికి మంగమ్మ గారి మనవడు, బామ్మ మాట బంగారు బాట లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది! వున్నన్నాళ్ళు రాజసంగా బతికారు భానుమతి! – డా. మహ్మద్ రఫీ

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ది రాజా సాబ్..! ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్స్‌కూ మారుతి బలమైన దెబ్బ..!!
  • స్టార్ హీరో ఇమేజ్, డాన్సులు, ఫైట్లు, ఎలివేషన్లు ఉండగానే సరిపోదు..!!
  • కాంగ్రెస్‌తోపాటు బీజేపీ కూడా..! తెలంగాణకు కేసీయార్ జలద్రోహం- నిజాలు..!!
  • ‘ట్రంపరితనం’… ప్రపంచానికే వినాశకరం… ఏదో ముంచుకొస్తోంది…
  • వ్యాపిస్తున్న దుర్గంధం… తిట్ల పర్వంలో జాతీయ నేతలనూ వదలడం లేదు…
  • ఒకటి బాసట…! మరొకటి కబళింపు..! ఇదే అమెరికాకూ ఇండియాకూ తేడా..!!
  • శివశంకర ప్రసాద్ గారు… మీ ‘గెస్చర్’ మనసుని గెలుచుకుంది..!
  • సంక్రాంతి ఎప్పుడు..? ఎందుకు మీమాంస..? మళ్లీ సందిగ్ధత..!!
  • వాటిని గజల్స్ అంటారా..? నీ సారస్వత సేవ ఏమిటి శ్రీనివాసులూ…?
  • వెనెజులా..! ట్రంపుదే కాదు… మన చమురూ ఉంది అక్కడ… తవ్వాలి..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions