Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నిజం చెప్పాలంటే., కొన్నిసీన్లలో మమ్ముట్టి ముందు రజనీ తేలిపోయాడు..!

July 20, 2026 by M S R

.

Mohan Goteti … ‘పొట్టి’ పాత్రతో మరోసారి అవార్డు కొట్టిన మమ్ముట్టి.
మన సినిమా ఫీల్డు చెన్నైలో వున్నప్పుడు ప్రతి సినిమా విడుదలకి ముందు మా జర్నలిస్టులకి ప్రత్యేకంగా ప్రివ్యూ వేసేవారు. ఫ్యామిలీలతోను, స్నేహితులతోను కలిసి వెళ్లి చూసేవాళ్లం.
థియేటర్లో అంతా మా జర్నలిస్టులమే వుండే వాళ్లం కాబట్టి అదో సరదాగా వుండేది.. బాగా ఎంజాయ్ చేసేవాళ్లం.
అలా 1991లో చూసిన ప్రివ్యూలలో ఒకటి ‘దళపతి’ సినిమా!

రజనీకాంత్, మమ్ముట్టి హీరోలు.. అరవింద్ స్వామి ఇంట్రడక్షన్.. అన్నిటికీ మించి మణిరత్నం దర్శకత్వం..
సాధారణంగా మణిరత్నం తన సినిమాలకు సంబంధించిన కథ కానీ, సీన్లు కానీ బయటకు రాకుండా చూసుకుంటారు.
అయితే, అప్పటికే ఆ సినిమా గురించి మాకు కొన్ని లీకులు వచ్చాయి.
దాంతో ఈ సినిమా పట్ల మాకు మరింత ఉత్సుకత ఏర్పడి, ఆసక్తి కలిగింది.
ఇక సినిమా మొదలయ్యాక రజనీ మాట ఎలా వున్నా మమ్ముట్టి అందర్నీ కట్టిపారేశాడు!

Ads

క్లాసిక్ వైట్ అండ్ వైట్ డ్రెస్సింగ్..
అంటే తెల్లని లుంగీ.. తెల్లని కాటన్ షర్ట్ లు..
అప్పటి నాయకులని తలపించే డ్రెస్సింగ్ అది.
అతని క్యారెక్టర్ పేరు దేవరాజ్..
అవడానికి గ్యాంగ్ స్టర్..

డ్రెస్సింగ్ కి తగ్గట్టే మనిషిలో గంభీరత.. హుందాతనం.. ఆ నడక.. ఆ హావభావాలు.. ఆ సహజ సిద్ధమైన మాటల తీరు.. ఓహ్.. అనిపించాడు.
పైకి సింపుల్ గా కనిపిస్తున్నా.. ఆ మనిషిలో ఏదో ఆకర్షణ.. స్క్రీన్ ప్రెజన్స్ అదిరిపోయింది!
మహాభారత కథలోని దుర్యోధన (మమ్ముట్టి), కర్ణ (రజనీకాంత్) పాత్రలను అన్వయిస్తూ.. స్నేహం ప్రధానంగా.. గ్యాంగ్ స్టర్ కథ నేపథ్యంలో సాగింది సినిమా.

నిజం చెప్పాలంటే, కొన్ని సన్నివేశాలలో మమ్ముట్టి ముందు రజనీ తేలిపోయాడు..
అంతలా ఆ సినిమాలో మమ్ముట్టి తన అభినయాన్ని ఆవిష్కరించాడు.
ఫక్తు కమర్షియల్ ఎలిమెంట్స్ తో రూపొందిన సినిమానే అయినా.. సినిమా చూసిన తర్వాత మమ్ముట్టి మనకు చాలా కాలం గుర్తుండిపోతాడు.
అంతటి సహజ సిద్ధంగా ఆయన నటన వుంటుంది.

ఆ సినిమా చూశాక మమ్ముట్టిని ఇంటర్వ్యూ చేయాలనిపించింది..
ఆ అవకాశం కూడా త్వరలోనే వచ్చింది ..
బయట మనిషి ఎంత సింపుల్ అనుకున్నారు?
నో ఎక్స్ ట్రాస్..
డాంబికాలు లేవు .. దర్పాలూ లేవు..
మలయాళ సూపర్ స్టార్ ఇలా ఉంటాడా? అంటే అస్సలు నమ్మలేం.

“తెలుగు సినిమాతో పోల్చితే మా మలయాళ సినిమా బడ్జెట్ చాలా చిన్నది.. ఎక్కువగా అవుట్ డోర్ లో నిర్మాణం చేస్తాం. మీ సినిమాలలో భారీ సెట్స్ వుంటాయి.. రిచ్ నెస్ ఎక్కువ వుంటుంది” అన్నారు మమ్ముట్టి ఆ సందర్భంగా.
ఒక సినిమా చేసే ముందు ఎలా ప్రిపేర్ అవుతారు? అనడిగితే..
“ప్రతి సినిమానూ నాకు కొత్త సినిమానే.. అలాగే భావిస్తాను.. అలాగే ప్రతి సినిమా కూడా రిస్కే.. అసలు అలా భావించినప్పుడే మనం ఒళ్లు దగ్గర పెట్టుకుని, ఓ బాధ్యతగా పనిచేయగలుగుతాం” అన్నారాయన.

ఒక సూపర్ స్టార్ తనను తాను ఒక కొత్త నటుడిగా భావించుకోగలుగుతున్నారంటే.. ఆయనలోని నటుడి తృష్ణ ఏ స్థాయిలో వుందో మనం అర్థం చేసుకోవచ్చు.
అందుకే.. ముప్పై ఐదేళ్లయినా.. ఆయన చెప్పిన ఆ మాట నాకింకా గుర్తుండిపోయింది.
అందుకే.. 75 ఏళ్ల వయసులో కూడా ఇప్పటికీ ఆయన అద్భుతమైన సినిమాలు చేయగలుగుతున్నారు.



నిన్ననే ఆయనకు నాలుగోసారి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును ప్రకటించారు.
అన్ని సార్లు నేషనల్ అవార్డు పొందడం అంటే మాటలా?
ఆయనది మామూలు నటనా?
మామూలు కమర్షియల్ యాక్టరా ఆయన?
2024లో వచ్చిన ‘భ్రమయుగం’ సినిమాలోని నటనకు గాను మమ్ముట్టిని ఈ అవార్డు వరించింది (మమ్ముట్టితో పాటు ‘చందూ ఛాంపియన్’ సినిమాలోని నటనకు గాను కార్తిక్ ఆర్యన్ కి కూడా ఉత్తమ నటుడిగా అవార్డు ప్రకటించారు).

ఇక ‘భ్రమయుగం’ ఓ అద్భుతమైన సినిమాగా పేరు తెచ్చుకుంది.
అది బ్లాక్ అండ్ వైట్ సినిమా..
మన పాత కాలం నాటి సినిమాలు గుర్తొస్తాయి.
సినిమా సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత కాలంలో ఈ చిత్రాన్ని బ్లాక్ అండ్ వైట్ లో నిర్మించడం అనేది పెద్ద సాహసమనే చెప్పాలి!
కథను బట్టి కలర్ కాకుండా ఆ నలుపు తెలుపు నేపథ్యాన్ని ఎంచుకున్నారు.
ఆ బ్లాక్ అండ్ వైట్ లో చెబితేనే ఆ కథకు నిండుదనం!

హారర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో మమ్ముట్టి పాత్ర పేరు కొడుమన్ పొట్టి..
సినిమాలో ఎక్కడా ఆయన షర్ట్ అన్నది ధరించడు..
క్యారెక్టర్ పరంగా అదొక విశేషం..
అసలు ఒక సూపర్ స్టార్ ఇమేజ్ వున్న నటుడు ఎవరైనా అలా చొక్కా తొడుక్కోకుండా నటించమంటే నటిస్తాడా?
అంత ధైర్యం ఎవరైనా చేస్తారా?
అదే.. మమ్ముట్టి స్పెషాలిటీ!

అలాంటి పాత్రలనే ఆయన ఛాలెంజ్ గా తీసుకుంటాడు..
ఇక ఆ సినిమాలో లంకంత ఇంటిలో ఓ పురాతన చెక్క కుర్చీలో కూర్చుని..
మెడలో ఓ దండ వేసుకుని కనిపిస్తాడు..
పాత్రకు సంభాషణలు తక్కువ..
వికటాట్టహాసం..
భంకరమైన నవ్వు అది!
మమ్ముట్టి ఒక క్యారెక్టర్ లో పరకాయ ప్రవేశం చేశాడంటే.. ఇంక తినేస్తాడు..
ఇక్కడా అదే జరిగింది!

మామూలు పాత్ర కాదు..
మామూలు అభినయం అసలే కాదు..
పాత్ర అంటే అది..
నటన అంటే అది..
అందుకే నాలుగోసారి నేషనల్ అవార్డు కొట్టాడు!
అందుకే.. ఆ అద్భుత అభినయానికి మనం కూడా కంగ్రాట్స్ చెబుదాం!  -మోహన్ గోటేటి
#mammootty
#bhramayugam

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రాజకీయులు అర్జెంటీనా ఫుట్‌బాల్ టీమ్ నుంచి ఏం నేర్చుకోవచ్చు..?
  • ఓ చేతిలో మొబైల్, మరో చేతిలో మైక్ ఉంటే… జర్నలిస్టేనా..?!
  • సత్యశ్రీ సోదరి ! నటి కాదు… నిన్నటి విక్రమ్ రాకెట్ ప్రాజెక్టులో సైంటిస్టు !!
  • బాలీవుడ్ పొగరు vs దక్షిణాది ప్రతిభ … సాయిపల్లవిపై వివక్ష వ్యాఖ్యలు
  • కదిలే రైలులో కంట్రాక్ట్ కిిల్లర్ ! ఢాం ఢాం ! మరో ‘మొగుడు’ ఖతం !!
  • వరల్డ్ కప్ ఫైనల్ కవరేజీలో… ఆ పత్రికలు అర్జెంటీనాలాగే ఓటమిపాలు!!
  • ఈ తేజస్విని మరణం – సమాజం ఎదుట కొన్ని కీలక ప్రశ్నలు !!
  • వాంగ్‌చుక్ ప్రతి అడుగు వెనుక ఆమె… నిజమైన సహచరి !!
  • నిజం చెప్పాలంటే., కొన్నిసీన్లలో మమ్ముట్టి ముందు రజనీ తేలిపోయాడు..!
  • పెళ్లి లేకపోతేనే శాంతి ! అవివాహిత తారల్లో ఈ ‘పంచదార’ చిలక కూడా !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions