ఒక పాపులర్ టీవీ షోలోని ఒక కంటెస్టెంటుకు కరోనా సోకితే… అది జాతీయ స్థాయి ప్రముఖ మీడియా సైట్లన్నింటిలోనూ వార్త అయ్యింది..! నిజానికి అది వార్తే… ఎందుకంటే ఆ వ్యక్తి సంపాదించిన పాపులారిటీ అది… ఎగిసిపడుతున్నఓ నవ సంగీత కెరటం తను… పేరు పవన్‌దీప్ రాజన్… వయస్సు పాతికేళ్లు… ఊరు ఉత్తరాఖండ్‌లోని చంపావత్… పవన్ సోనీటీవీ ప్రిస్టేజియస్ మ్యూజిక్ కాంపిటీషన్ షో ఇండియన్ ఐడల్‌కు ఎంపికయ్యాక తన పేరు తెరపైకి ప్రముఖంగా వచ్చింది… ఉత్తరాఖండ్ అప్పటి ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ నేరుగా సోనీ తెర మీదకు వచ్చి ‘మా ఉత్తరాఖండ్ ముద్దుబిడ్డకు గెలుపు శుభాకాంక్షలు’ అని ప్రకటించడంతో అందరి దృష్టీ పవన్ మీదకు మళ్లింది… ఒక టీవీషో కంటెస్టెంటుకు తన సొంత రాష్ట్ర ముఖ్యమంత్రి విజయాశీస్సులు ఇవ్వడం అంటే ఆ పోటీదారుకు ఎంత ఆనందం, దాంతో వచ్చే ఉత్సాహం వెలకట్టలేనివి కదా…
క్రీడలు గానీ, ఇతర పోటీలు గానీ… ఎవరైనా విజేతగా నిలిస్తే… అప్పుడు రాజకీయ నాయకులు తెర మీదకు వచ్చి చప్పట్లు కొట్టి ఓన్ చేసుకుంటారు… బహుమతులు ప్రకటిస్తారు… కానీ తొలి దశలో గ్రీటింగ్స్ చెప్పరు… ఆ నాయకుల చుట్టూ ఉండే సాంస్కృతిక సలహాదారులకు తెలిస్తే కదా ముందు..? ఏపీకి కాబోయే రాజధాని విశాఖపట్టణానికి చెందిన ఇద్దరు గాయకులు ఈసారి ఇండియన్ ఐడల్ పోటీకి వెళ్లారు… ఒకరు శిరీష భాగవతుల… ఈమధ్యే పోటీ నుంచి ఎలిమినేట్ అయ్యింది… మరొకరు షణ్ముఖప్రియ… బలమైన పోటీ ఇస్తోంది… షణ్ముఖప్రియకు బలమైన పోటీ పవన్దీపే… నిజానికి ఆన్లైన్ వోటింగులో పవన్‌దీప్ చాలా ముందంజలో ఉన్నాడు… దుమ్ము రేపుతున్నారు ఇద్దరూ… ఇప్పుడు పవన్‌కు కరోనా సోకింది… ప్రస్తుతం ముంబై హోటల్ క్వారంటైన్లో ఉన్నాడు… (కంటెస్టెంట్లలో ఇంకెవరికైనా ఇన్ఫెక్షన్ సోకిందేమో ఇంకా తెలియదు…)
Ads
ఎందుకు పవన్‌దీప్‌కు అంత పాపులారిటీ వచ్చిందంటే… తను ఆడిషన్‌కు వచ్చినప్పుడు పియానో వాయించాడు… తరువాత ఓ ఎపిసోడ్లో డోలక్… ఇంకోసారి గిటార్… మరోసారి డ్రమ్స్… అదీ తన పాట తాను పాడుకుంటూనే… సాదాసీదాగా కాదు, ఆ సంగీత పరికరాలకు సంబంధించి ఒక ప్రొఫెషనల్ ప్లేయర్‌లాగే… అల్లాటప్పా ప్లేయర్ అయితే అసలు ఆ షోకు అధికారికంగా ఆర్కెస్ట్రా అగ్రిమెంటు ఉన్న ఏజెన్సీ అంగీకరించదు కదా… బహుముఖ ప్రజ్ఞ… ఈసారి పోటీ టాప్ రేటెడ్… కంటెస్టెంట్లు కూడా భలే సింగర్స్ దొరికారు… ఒక్కొక్కరూ ఈ షో పాపులారిటీని ఈసారి భలే పైకి లేపుతున్నారు… దీనికితోడు సోనీ కూడా ప్రముఖుల్ని గెస్టులుగా తీసుకొచ్చి, ప్రతి ఎపిసోడ్‌నూ నభూతో అన్నట్టుగా రక్తికట్టిస్తోంది… అందుకే పవన్‌దీప్‌కు కరోనా అనేది జాతీయ సైట్లకు కూడా వార్త అయ్యింది…
అసలు ఎవరు ఈ పవన్‌దీప్..? చంపావత్ ఏరియాలో కుమౌని జానపదాలు చాలా ఫేమస్… పవన్ తండ్రి సురేష్ రాజన్ కూడా కుమౌని ఫోక్ సింగర్… పవన్ సోదరి జ్యోతిదీప్ కూడా గాయకురాలే… పవన్ రెండుమూడేళ్ల వయస్సు నుంచే తబలా పట్టుకుని అందరినీ అబ్బురపరుస్తూ వాయించేవాడు… పిడుగు… చిన్న వయస్సులో తబలాలో అవార్డులు కొట్టేసేవాడు… తరువాత పలు సంగీత పరికరాలతో పరిచయం పెంచుకుని, సంగీత సాధన చేస్తూ… (రక్తంలో ఉంది కదా గానం)… 2015 ది వాయిస్ ఇండియా కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ కొట్టేశాడు… తరువాత అయిదారు దేశాల్లో కచేరీలు ఇచ్చేదాకా వెళ్లిపోయాడు, ఒకటీరెండు సినిమాలు… ఆ అనుభవం ప్లస్ ప్రతిభ తనను ఇండియన్ ఐడల్ ఫేవరెట్ చేశాయి… మరి కరోనా సోకింది కదా, బ్రేక్ పడినట్టేనా..? కాదట… నేను ఈ హోటల్ రూం నుంచే పార్టిసిపేట్ చేస్తాను, అనుమతించండి అనడిగాడు పవన్… జడ్జిలు, షో నిర్మాతలు వోకే అన్నారు… కానీ వేదిక మీద పాడేంత జోష్ ఉంటుందా..? చూడాలిక…!!
Share this Article