ఈనాడు… రామోజీరావు శ్వాస అది… దాన్ని ప్రథమ స్థానంలో నిలబెట్టడానికి ఏ ప్రయోగమైనా, ఏ సాహసమైనా తను ఆల్వేస్ రెడీ… తరువాత కాలంలో చాలా బిజీ అయిపోయి, వేరే వ్యాపారాలు, వ్యాపకాల్లో నిమగ్నమై ఈనాడు బాధ్యతల్ని చాలావరకూ నమ్మకస్తులకు అప్పగించినా… మొదట్లో ప్రతి యూనిట్ తనే స్వయంగా తిరిగేవాడు… రెండుమూడు రోజులు అక్కడే…
ప్రతిరోజూ పేపర్ అమూలాగ్రం చదవడం, రెడ్ స్కెచ్‌తో కామెంట్స్ రాయడం… ఆ కామెంట్స్ ఒకరకంగా సిబ్బందికి స్ట్రిక్ట్ ఆర్డర్స్… స్టోరీ బాగుంటే గుడ్ అని రాసి అభినందిస్తే అది సంబంధిత సిబ్బందికి సర్టిఫికెట్… ప్రతి మూడు నెలలకూ ప్రతి యూనిట్ ఆఫీసులో మీటింగ్స్… జిల్లాల వారీగా… ఆయా జిల్లాల రాజకీయ పరిస్థితులు, తాజా పరిణామాలపై కూడా చర్చ… కొన్ని నిర్ణయాలు అక్కడికక్కడే…
ఓసారి వరంగల్ జిల్లా మీటింగుకు యాక్టివ్ కంట్రిబ్యూటర్లను కూడా రమ్మన్నారు… అలా తొలిసారి ఆయన్ని చూసింది… అప్పుడు నేను చేర్యాల కంట్రిబ్యూటర్‌ను… డిస్కషన్ జరుగుతుంటే సమ్మక్క- సారలమ్మ జాతర ప్రస్తావన వచ్చింది… లక్షల జనం వస్తారనీ, దేవుళ్ల విగ్రహాలు ఉండవనీ, దేవతలను వనం లోపల నుంచి కుంకుమ భరిణెల్లో తీసుకొస్తారనీ, గిరిజనం మొక్కులు, పుట్టువెంట్రుకలు, శివాలు, సంస్కృతి, పండుగలన్నీ ఆ దేవతలతోనే ముడిపడి ఉంటాయనీ, వేలాదిగా జనం ఎడ్లబళ్లల్లో, నడిచి వస్తారనీ డెస్క్ ఆయనకు వివరించింది…
Ads
వనమేడారం జనగుడారం అవుతుందనే మాట వినగానే ఆయన హెలికాప్టర్ పెట్టి ఏరియల్ ఫోటో తీయిద్దామా అనడిగాడు… డెస్క్ షాక్… ఈనాడు క్వాలిటీ పట్ల తన నిబద్ధత అలా ఉండేది… జాతరకు అమిత ప్రాచుర్యం కల్పించింది ఈనాడు… ఇప్పుడు కోటి మంది దాకా వస్తున్నారు జాతరకు…
ఇది చిన్న ఉదాహరణ… ఇలాంటివి కోకొల్లలు… ఉదయం, వార్త పత్రికల నుంచి బలమైన పోటీ ఎదురైంది ఆయనకు ఈనాడు విషయంలో… కొన్ని జిల్లాల్లో ఈనాడు సర్క్యులేషన్ దాటేశాయి… తొణకలేదు… కారణాలు అనేకం ఉండవచ్చుగాక, అవి వాటంతటవే ఆత్మహత్య చేసుకున్నాయి, ఈనాడు అప్రతిహతంగా సాగిపోయింది… సాక్షికి ఉదయం, వార్త దినపత్రికల లక్షణాల్లో, టెంపర్‌మెంట్‌లో వీసమెత్తు కూడా అబ్బలేదు కాబట్టి సాక్షిని ఇక్కడ ప్రస్తావించడం లేదు…
నా గురించీ చెప్పుకోవాల్సిన సందర్భం ఇది… స్మరణ నా నైతిక బాధ్యత కాబట్టి… ఈనాడు కంట్రిబ్యూటర్‌గానే ఓ కేసులో ఇరికించబడినప్పుడు… గమనం అగమ్యగోచరంగా ఉన్నప్పుడు… ఈ కేసుపై ఎక్కడివరకైనా పోరాడుదాం, తనకు అండగా ఉందాం అన్నాడు నా ప్రస్తావన రాగానే…! తరువాత మూణ్నాలుగు పేజీల్లో ఓ లేఖ రాస్తే, అదంతా చదివి, వెంటనే తనను ఎడిటోరియల్ స్టాఫ్‌లోకి తీసుకొమ్మని ఆదేశించాడు… అనూహ్యం… తరువాత ఏడాదిన్నర ఎన్ఎంఆర్‌గా అబ్జర్వేషన్‌లో పెట్టుకుని, తరువాత అపాయింట్‌మెంట్ ఇచ్చారు… దటీజ్ రామోజీరావు…
ఇలాంటి విషయాల్లో ఆయన స్పీడ్‌ను, ఆయన నిర్ణయాల్ని అస్సలు అంచనా వేయలేం… నా లేఖలో నిజాయితీ ఉందా లేదా, పనికొస్తాడా లేడా… చటుక్కున డెసిషన్ వెలువరించాడు… ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రారంభమయ్యాక ఎవరైనా సరే టీవీ, పత్రిక ఎడిటోరియల్ స్టాఫ్‌లోకి ఆ స్కూల్ ద్వారా శిక్షణ పొందాక రావల్సిందే… అవేవీ లేకుండా నేరుగా చోటు కల్పించింది నా ఒక్కడికే… ఎన్ఎంఆర్ ఉపసంపాదకుడిగా చేసిన నేను ఏకంగా ఓ చీఫ్ రిపోర్టర్ సెంటర్‌లోకి (వరంగల్) వచ్చాను… అదీ నా సొంత జిల్లా కేంద్రంలోకి… అదీ విశేషమే ఈనాడు కోణంలో… చివరకు చీఫ్ రిపోర్టర్ హోదాలోనే బయటికి వచ్చేశాను… అందుకే దటీజ్ అవర్ రామోజీరావు అని గుండె లోపల నుంచి అనగలుగుతున్నాను నేను…
ఒకసారి ఈనాడులో పనిచేసే ప్రతి ఒక్కరూ పాల్గొనే ఒక పరీక్ష నిర్వహించారు… ఎన్ఎంఆర్ దగ్గర నుంచి సబ్ ఎడిటర్లు, రిపోర్టర్లు అందరికీ… ఎండీ కిరణ్ కూడా రాశాడు ఆ పరీక్ష… ఏ స్కూల్‌లోనూ ఏ జర్నలిజం పాఠమూ నేర్వని నేను అన్ని వందల మంది సీనియర్లు పాల్గొన్న పరీక్షలో మూడో ప్లేసులో నిల్చున్నా… మరి రామోజీరావు స్వయంగా నన్ను పూనితే ఫలితం భిన్నంగా ఎలా ఉంటుంది… ఆ అభినందన కూడా రామోజీ ఫిలిమ్ సిటీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన చేతుల మీదుగా స్వీకరించాను… అదీ అసలు సిసలు నా మెమురీ..!…. (శ్రీనివాసరావు మంచాల)….
నాకు జీతాన్ని, అనేక ఏళ్ళు జీవితాన్ని ఇచ్చిన సంస్ధ ఈనాడు సారధి రామోజీరావు పట్ల నాకు ఎప్పటికీ కృతజ్ఞతా భావం వుంటుంది… అదే సమయంలో ఆయన ప్రతీ చేతకూ నా బేషరతు మద్ధతు వుంటుందని కాదు… అలాగని రంధ్రాన్వేషణతో ఆయన ప్రతీ పనిని విమర్శిస్తానని కూడా కాదు… రామోజీరావు పట్ల నాకు కృతజ్ఞత, గౌరవమూ, మర్యాద, విమర్శ, ప్రశంస… అన్నీ వున్నాయి. ఇంతటి భిన్నత్వాన్ని దేనికి అదేగా చూడలేకపోతే, చూపించకపోతే రామోజీరావు సంస్ధ నుంచి నేను నేర్చుకున్న జర్నలిజానికి అర్ధమే లేదు…..
Share this Article