……… By…. Bharadwaja Rangavajhala……………… సినీరంగంలో ఎస్వీఆర్ ఓ ప్రత్యేకమైన వ్యక్తి. ఆయనకి ప్రధమకోపం …
తనకు అనిపించినదేదో మాట్లాడేస్తారు తప్ప మనసులో ఒకటీ బైటకి ఇంకోటీ రకం కాదు. ఎవర్నైనా తిట్టాలనుకున్నా పొగడాలనుకున్నా … అది ముఖం మీదే తప్ప పరోక్షంగా కాదు.
ఆయనతో ఏం చెప్పాలన్నా …
చాలా జాగ్రత్తగా ఎలా చెప్తే వింటారో అలానే చెప్పి కన్విన్స్ చేసేవారు ఇండస్ట్రీ పెద్దలు.
భక్త ప్రహ్లాద లో క్లైమాక్స్ రీషూట్ చేయాలనుకున్నప్పుడు …
నిర్మాతలు డి.వి.నరసరాజుగారిని ప్రయోగించారు. నిన్న రాత్రి ప్రివ్యూ చూశానండీ … ఎందుకో ఆ క్లైమాక్స్ కాస్త డల్ అయినట్టనిపించింది.
నా ఉద్దేశ్యమైతే మీరు రీషూట్ చేయమని డిమాండ్ చేయండి …
ఎందుకంటే రేపు మంచి పేరొచ్చినా చెడ్డ పేరొచ్చినా మీకేగా అనడంతో ఎస్వీఆర్ కన్విన్స్ అయిపోయి రీషూట్ చేయమని ఆదేశించి మరీ నటించి మెప్పించారు.
అలాంటిదే ఇంకో సంఘటన …
1967 ఎస్వీఆర్ స్వీయ దర్శకత్వంలో చదరంగం అనే చిత్రాన్ని నిర్మించారు.
దర్శకుడుగా ఎస్వీఆర్ మీద బిఎన్ ప్రభావం ఉండేది. ఆయన తీసిన సినిమాలు రెండు మూడూ కూడా ఆ ధోరణిలో నడిచేవే …
ఉదాత్తమైన కథలతోనే సినిమాలు తీశారాయన.
చదరంగం, బాంధవ్యాలు కాస్త అతి అనిపించినా … సినిమా అనేది జనాలకు ఏదో చెప్పాలనే తపన ఉండేదాయనకి.
చదరంగం సినిమాకి క్రిటిక్స్ నుంచీ మంచి రెస్పాన్సే వచ్చింది.
ఆడియన్స్ నుంచీ కూడా పర్వాలేదనిపించే వసూళ్లు వచ్చాయి.
ఓ మంచి సినిమా తీశాననే తృప్తి ఆయనకి మిగిలింది.
అయితే …
ఆ సంవత్సరం ఉత్తమ చిత్రంగా చదరంగమే అవార్డు గెలుస్తుందని ఎస్వీఆర్ బలంగా అనుకున్నారు.
తీరా పురస్కారాల ప్రకటన వెలుడింది …
ఉత్తమ చిత్రంగా సుడిగుండాలు అనే సరికి ఎస్వీఆర్ కు చిర్రెత్తుకొచ్చింది.
ధిక్ అన్నాడాయన.
ఇదంతా రాజకీయం … ఆ నాగేశ్వర్రావు తెల్లారి లేస్తే కాంగ్రెస్ మంత్రులతోనూ ముఖ్యమంత్రితోనూ తిరుగుతూంటాడు …
అందుకే ఎపి ప్రభుత్వం ఇచ్చే అవార్డులు ఎవరికివ్వాలో తనే డిసైడ్ చేసేస్తున్నాడు …
అలా రాజకీయం చేసి నా సినిమాకు రావాల్సిన అవార్డును తన సినిమాకు వేయించుకున్నాడు ..
అని బహిరంగంగానే వ్యాఖ్యానించడం ప్రారంభించారాయన..
ఎస్వీఆర్ కామెంట్స్ ఆ నోటా ఈనోటా దర్శకుడు ఆదుర్తికి చేరాయి.
ఆయన వెంటనే ఎస్వీఆర్ ను కల్సి …
ఒక్క సారి సుడిగుండాలు సినిమా చూడు … ఆ తర్వాత మాట్లాడదాం అనడంతో సరే అన్నారు ఎస్వీఆర్ …
సినిమా వేశారు.
ఆయన చూశారు … బైటకు వచ్చారు …
సారీ బ్రదర్ … బాగా తీశారు. నా సినిమా కన్నా కూడా ఇదే బాగుంది. అవార్డు విషయంలో ప్రభుత్వం సవ్యంగానే ఆలోచించింది … నేను చేసిన కామెంట్స్ కు సారీ అన్జెప్పి ఆదుర్తిని కౌగలించుకుని వెళ్లిపోయారట.
Share this Article