.
Mohan Goteti …. భానుమతి గారిని మా వాడు అలా అడిగేసరికి..!
1998 ఫిబ్రవరి అనుకుంటాను..
ఆరోజు హైదరాబాదులో మహానటి భానుమతి గారు వున్నారని తెలిసింది.
కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో రూపొందుతున్న ‘పెళ్లి కానుక’ సినిమా షూటింగు కోసం ఆవిడ హైదరాబాదుకు వచ్చారు.
ఆ సినిమా నిర్మాణ సంస్థ వారిని అడిగితే.. అన్నపూర్ణా స్టూడియోలో షూటింగ్ జరుగుతోందని, ఆవిడ అక్కడ ఉన్నారనీ చెప్పారు.
చాలా రోజులైంది ఆవిడను కలిసి.. మళ్లీ ఓసారి చూడాలనిపించింది..
గతంలో పెద్దరికం.. చెంబరుతి (చామంతి) సినిమాల షూటింగుల్లో మద్రాసులో ఆమెను కలిసేవాడిని.
అసలు భానుమతి గారి పేరు వినపడగానే టక్కున మా నాన్నగారు గుర్తొచ్చేస్తారు.
మా చిన్నప్పుడు ఆయనే ఆవిడ గురించి చెప్పారు.
కన్నాంబ, కాంచనమాల, భానుమతి..
ఈ ముగ్గురు కథానాయికల గురించీ ఆయన ఎక్కువగా చెప్పేవారు.
Ads
“ఆవిడ అందమే అందం.. ఆవిడ అభినయమే అభినయం.. భానుమతి గారు ఆవిడ పాట ఆవిడే పాడుకుంటుంది .. మరొకరు పాడడానికి వీలులేదు.. ఆవిడ మరొకరికి పాడదు.. అంత నిక్కచ్చి మనిషావిడ” అంటూ ఆవిడ గురించి మా నాన్నగారు చెప్పిన మాటలు చిన్నతనంలోనే నాలో నాటుకుపోయాయి.
భానుమతి భానుమతే!
ఆమెకు ఎవరూ సాటిరారు.. బహుముఖ ప్రజ్ఞాశాలి!
తొలినాళ్లలోని కథానాయికలలో తను కూడా ఓ సూపర్ స్టార్!
ఆమె సౌందర్యం..
ఆమె అభినయం..
మధురమైన ఆమె గాత్రం..
ఆమె స్టయిల్..
ఎవరినీ కేర్ చేయని నిర్లక్ష్య ధోరణి..
కాస్త అతిశయం..
ఆ లక్షణాలన్నీ కలిపి ఆమెకు ఓ ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి.
కథానాయికలలో ఓ విభిన్నమైన స్థాయిని ఆపాదించాయి..
మహానటులు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వంటి వారే ఆమెకు చాలా గౌరవం ఇస్తూ.. ఆమె దగ్గర చాలా జాగ్రత్తగా వుండేవారంటే.. ఆమె తనకు తాను తెచ్చిపెట్టుకున్న స్థాయి ఎటువంటిదో మనం అర్థం చేసుకోవచ్చు!
వెండితెరపై నిండుగా కనిపించే సౌందర్యరాశి తను..
ఆ హావభావాలు..
ఆ విరుపులు..
ఆ అహంకారపు జాడలు..
ఆమెకు మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి.
- ‘మిస్సమ్మ’ సినిమాలో ముందుగా భానుమతి గారిని బుక్ చేసి.. కొంత షూటింగ్ జరిగాక.. అభిప్రాయ భేదాల కారణంగా నిర్మాత చక్రపాణి గారు ఆమెను ఆ చిత్రం నుంచి తొలగించి .. ఆ పాత్రకు సావిత్రిని తీసుకున్నప్పుడు ఆమె అధైర్యపడలేదు .. అవమానంగా భావించనూ లేదు.. ప్రతీకారం మాత్రం మరోలా తీర్చుకున్నారు..
అదే.. ఆ నిర్మాత పేరుతోనే ‘చక్రపాణి’ అనే చిత్రాన్ని నిర్మించి.. ఆయనపై సినిమా నిండా వ్యంగ్యోక్తులు వేశారట!
అలా వుంటుంది .. భానుమతి గారితో పెట్టుకుంటే!
ఆమె ఆత్మగౌరవానికి ప్రతీక!
ఎన్టీఆర్, ఏఎన్నార్.. వంటి హీరోలకే ఆమె సీనియర్ కావడంతో హీరోలని ఎవరినీ ఆమె లెక్క చేసేవారు కాదు.
షూటింగులో కూడా ఎవరినీ ఆమె విష్ చేయరు…
హీరోలే ఆమెను విష్ చేయాలి..
అది ఆమె స్టేచర్!
అలా.. తెలుగు చిత్రసీమని కొన్నాళ్ల పాటు ఏలేశారావిడ.
సీనియర్లు కూడా తమ కంటే జూనియర్లు అయిన దర్శకులను “ఏమండీ” అనీ, “సార్” అనీ సంబోధిస్తుంటారు ఇక్కడ..
ఆమె దగ్గర మాత్రం అలాంటివి పనిచేయవు..
పేరుపెట్టి ఏకవచనంలో పిలుస్తారావిడ.. అంతే .. అది ఆమె స్టయిల్!
ఆమెను ఎదిరించేవారు ఎవరూ లేరు..
ఎందుకంటే.. ఆ సౌందర్యం అలాంటిది..
ఆ అభినయ కౌశలం అలాంటిది..
కొన్ని పాత్రలకు తనే కావాలి మరి!
ఎన్ని సినిమాలు.. ఎన్ని విజయాలు?
ఆమె గురించి చెప్పడానికి?
అయినా.. ఒక ‘లైలా మజ్ను’ చాలదా?
ఒక ‘మల్లీశ్వరి’ సరిపోదా?
ఒక ‘చండీరాణి’ చెప్పచ్చుగా?
ఒక ‘చక్రపాణి’ ఉటంకించవచ్చు కదా?
ఇంకా ఒక ‘విప్రనారాయణ’ లేదా?
మర్చిపోయాను.. ఒక ‘బాటసారి’ ఆణిముత్యం కదా?
ఎన్నని చెప్పాలి.. ఆమె అభినయం ఇటువంటిది అని చెప్పడానికి?

అసలు ‘మల్లీశ్వరి’ ఎటువంటి కళాఖండం?
తరతరాలకూ తెలుగువారికి అదొక దృశ్య కావ్యం కదా?
అటు అందమైన రూపంతో.. లేలేత వయసుతో.. ఇట్టే ఆకట్టుకునే ఆరడుగుల అందగాడు ఎన్టీఆర్..
ఇటు ముగ్దమనోహర రూపంతో నవనవలాడే భానుమతి..
పల్లెటూరి పడుచుగా.. ఆ అమాయకత్వం.. ఆ చిలిపితనం ఒలకబోస్తూ మల్లీశ్వరి పాత్రలో ఆమె చూపిన అభినయం మరువగలమా?
ఇటు ప్రియుడిని వదిలి.. రాణివాసానికి వెళుతున్నప్పుడు.. ఆ వేదనను.. ఆమె నోరు మెదపకుండానే.. పలికించిన ఆ హావభావాలను ఎవరు మరచిపోతారు?
ఇక రాణివాసంలో విరహవేదనను.. ఎడబాటును కళ్లతోనే ఆమె పలికించిన అభినయం మామూలు అభినయమా?
ఎవరికీ అందని అత్యుత్తమ నటన అది!
ఇక అంతఃపుర నర్తకిగా మారాక.. అభినయం పరంగా ఆమెలో కనపడే ట్రాన్స్ఫర్ మేషన్ అద్భుతమనే చెప్పాలి.
అంతవరకూ పల్లెపడుచుగా కనిపించిన మల్లీశ్వరి ఒక్కసారిగా హుందాతనం ఒలకబోస్తుంది..
‘మనసున మల్లెల మాలలూగెనే..’ అంటూ బావ వెచ్చని ఒడిలో.. తన్మయత్వం చెందుతూ పాడుతూ.. ఆమె మరులు గొలుపుతున్నట్టు అభినయిస్తుంటే అప్పటి కుర్రాళ్ల (మా నాన్నగారి లాంటి వాళ్ల) మనసులు మల్లెల పరిమళాల మత్తులో తూలిపోయాయి.
ఆ అభినయం అనితరసాధ్యం!
అందుకే.. చిన్నప్పుడు సినిమాల ప్రస్తావన వచ్చినప్పుడు.. మా నాన్న గారు “మీరు కాస్త పెద్దయ్యాక మల్లీశ్వరి చూడండి.. సినిమా అంటే ఎలా ఉండాలో .. అభినయం అంటే ఎలా ఉండాలో.. సంగీతం అంటే ఎలా ఉండాలో తెలుస్తుంది..” అనే వారు.
భానుమతి గారు అంతలా మా మనసులలో ముద్రపడిపోయారు.
అందుకే.. అవకాశం కుదిరినప్పుడల్లా ఆమెను తప్పకుండా కలిసేవాడిని.
అలాగే ఆరోజు అన్నపూర్ణా స్టూడియోకి వెళ్లాను..
ఆమె ఫ్లోర్లో మధ్యలో కుర్చీలో కూర్చుని రిలాక్సవుతున్నారు.
దగ్గరకి వెళ్లి నమస్తే చెప్పా..
“ఆ.. ఏమ్మా.. బాగున్నావా?” అంటూ పలకరించారు.
కాసేపు ఆ సినిమాలోని పాత్ర గురించి చెప్పారు..
తర్వాత.. మెల్లగా ఒక ఇంటర్వ్యూ లాక్కోవచ్చన్న ఉద్దేశంతో సంభాషణని కాసింత పొడిగించాను..
పాత సినిమాల నాటి సంగతులు అడిగితే చెప్పారు..
తన రచనల గురించి కూడా చెప్పారు..
ఈలోగా ఆమధ్యే జర్నలిజంలోకి వచ్చిన ఓ జర్నలిస్టు వచ్చి మా పక్కనే కూర్చున్నాడు..
“ఏవైనా టీవీ సీరియల్స్ చేసే ఉద్దేశం ఉందా మీకు?” అనడిగాను.
ఉందన్నట్టు తలూపారు భానుమతిగారు..
“ఏమిటనుకుంటున్నారు?” అనడిగాను మళ్లీ.
“ఈమధ్య శరత్ నవల ఒకటి చదివాను.. అది తీయాలని ఉందమ్మా” అన్నారు.
సరిగ్గా అప్పుడే మా కొత్త జర్నలిస్టు కల్పించుకుని.. ఒక పిడుగు లాంటి ప్రశ్న వేశాడు..
“శరత్ అంటే.. మన క్యారెక్టర్ ఆర్టిస్టు శరత్ బాబు గారు రాసినదేనాండీ?” అంటూ టపీమని అడిగేశాడు.
ఆవిడ ఎవరు? భానుమతి గారు..!
ఆవిడ చెప్పింది ఏ శరత్ గురించి?
అంతే.. అతని ప్రశ్నకి ఆవిడ ఒక్కసారిగా అతని వైపు సీరియస్ గా చూశారారు..
తర్వాత నా వైపు చూసి .. “ఎవరయ్యా ఇతను?” అనడిగారు.
సిగ్గుపడిపోయాను..
జవాబుగా చిన్నగా నవ్వాను..
ఇంకా నయం.. ఆవిడ ఆ రోజు మంచి మూడ్ లో ఉన్నట్టున్నారు..
లేకపోతే ఆవిడ చేతిలో మనవాడు అయిపోయేవాడే!
పరిస్థితి అర్థం చేసుకున్నాడేమో.. ఈలోగా ఆ జర్నలిస్టు అక్కడి నుంచి మెల్లిగా ఉడాయించాడు.
“ఏమయ్యా.. జర్నలిస్టుగా తీసుకున్నాక మీకు ట్రైనింగూ గట్రా ఏమీ ఉండవా?” అనడిగారావిడ నన్ను.
ఏం చెబుతాను?
నా దగ్గర సమాధానం లేదు..
మా వాడు చేసిన నిర్వాకానికి..
ఏమీ మాట్లాడకుండా ఆ మహానటి వైపు అలాగే చూస్తూ ఉండిపోయాను..
మొత్తానికి మా వాడు ఒక మంచి సందర్భాన్ని పాడుచేశాడు..
నా ఇంటర్వ్యూ మధ్యలోనే ఆగిపోయింది!
-మోహన్ గోటేటి
#bhanumati
#malliswari
Share this Article