.
Yaseen Shaikh
….. ఉప్మా ప్రాశస్త్యం… విత్ స్పెషల్ రిఫరెన్స్ టు పోకిరి మూవీ
ఉప్మాను చిన్నచూపు చూస్తూ… దాని మీద సెటైర్లు వేస్తూ ఈమధ్య సోషల్ మీడియాలో చాలా పోస్టులు చూస్తున్నా. ఎందుకోగానీ… సిన్మా ఫస్ట్ హాఫ్‌లో హీరోను హీరోయిన్ సరిగా అర్థం చేసుకోనట్టుగానే… అందరూ ఉప్మాను అపార్థం చేసుకుంటున్నారేమో అనిపిస్తోంది.
ఉప్మా అంటే నాకూ పెద్దగా ఇష్టం ఉండకపోవచ్చు. అయితే… నేను దేన్నైనా తట్టుకుంటా గానీ వివక్షను తట్టుకోలేను. అందుకే ఈ విశ్లేషణాత్మక వ్యాసం రాయాల్సి వస్తోంది.
Ads
ఎక్కడో ఓ కోట్ చదివా. ‘ఓ టెరికాట్ ప్యాంటువాడూ, ఓ కాటన్ పంట్లాంవాడూ ఉన్నప్పుడు నువ్వు కాటన్‌కు అండగా ఉండాలి. ఓ కాటన్ పంట్లాంవాడూ, ఓ లాగూవాలా ఉన్నప్పుడు నువ్వు లాగూవాలాకు దన్నుగా నిలవాలి.
ఆ లాగు కాస్తా జారిపోతున్న వేళ… ఒకడు బెల్టు కడుతుంటే… మరొకడు పురికోసతో దాన్ని నిలుప యత్నించే టైములో నువ్వు పురికోస వాడి కొసన నిలబడాలి. అలాంటి అనేకానేక వ్యక్తిత్వ వికాస వీడియోలు చూశాక మనమెప్పుడూ ఎప్పుడూ బలహీనుల పక్షాన నిలబడాలనే జ్ఞానోదయమయ్యింది. అందుకే అసలు నాకెలాంటి వ్యక్తిత్వమూ లేకపోయినప్పటికీ… జోరు జోరుగా జారే ఉపమా వెనకాల కరుడు కట్టిన ఉప్మాలా వెన్నుదన్నుగా ఉండాలని సంకల్పించుకున్నా.
(నిజానికి తెలంగాణలోని చాలాచోట్ల అది ఉప్మా కాదు, ఉక్మా… సోకాల్డ్, వేల యూట్యూబర్లకు, వందల సైట్లకు, లక్షల ఫాలోయర్లకు పట్టని నిజం ఇది…)
ఎవరైనా ఉప్మా పట్ల నాలుగు మంచి వాక్యాలు ఎవరైనా రాస్తే బాగుండు అని మునుపు చాలాసార్లు అనిపించింది. కానీ వేరెవ్వరూ ఆ ప్రయత్నం చేయకపోవడంతో… పాపం… ఆ పుణ్యకార్యానికి మనమే ఎందుకు పూనుకోకూడదనే సదుద్దేశంతో, ఉప్మా పట్ల వివక్షను ఖండించాలనే సంకల్పంతో ఈ నాలుగు ముక్కలూ గెలుకుతున్నా… సరే, మీ భాషలోనే ఉప్మా అనే వ్యవహరిద్దాం కాసేపు…
అసలు ఉప్మా అంటే ఎవరు? సినిమా నవరసాల్లో కామిడీ… రసఫలాల్లో మామిడీ అని చెప్పదగ్గది.
టిఫిన్లలో ఉప్మా ఒకానొక టాప్ హీరో లాంటిది. మల్టీస్టారర్ సిన్మా తీస్తే… ఏ సూపర్‌స్టారు తాలూకు ప్రాధాన్యాలూ తగ్గకుండా తీయాలి. కత్తి మీద సాములా… వాగు మీద డ్యాములా… రీలు అంచున యాక్టింగులా ఓ తపస్సులా చేయాలి. అలా ఎంతో జాగ్రత్తగా తీస్తేగానీ… అది ప్రేక్షకుల్ని ఒప్పించలేనంత రిస్కీ ప్రాజెక్టు అన్నది సినిమా మేకర్స్‌కు తెలియంది కాదు.
అలాగే… ఉప్మా అనేది టాప్ సూపర్ స్టార్లలో ఒకటి… మూవీస్‌లో మల్టీస్టారర్ ఎలాంటిదో, పలారాల్లో (అల్పాహారాల్లో లేదా ఫలహారాల్లో…) ఉప్మాపెసరట్ అలాంటిదే అని నొక్కివక్కాణించడానికి నేనెంతో ధైర్యం చిక్కబట్టుకున్నా. ఇందుకు ఎంతో మంది పెద్దపెద్ద ఆహార ప్రియులు చెప్పిన ఎన్నో తార్కాణాలన్నాయని చెప్పడానికి నేను వెనుదీయడం లేదు.
నేనెప్పుడూ పెద్దగా ఇష్టంగా తినకపోయినప్పటికీ… ఉప్మా పెసరట్ అనేది ఆ రోజుల్లో శోభన్‌బాబూ, కృష్ణ… మరి ఈరోజుల్లోనైతే రామ్‌చరణ్, జూ. ఎన్టీఆర్; మరి అలాగే వెంకటేశ్, మహేశ్‌బాబు లాంటి క్రేజీ మల్టీస్టారర్ కాంబినేషన్ లాంటిదని ఆహార ప్రియులు వాక్రుచ్చిన విషయాల వల్ల నాకు తేటతెల్లమైంది. (కొన్ని ఉప్మాలు ఎల్లోగా ఉన్నప్పటికీ… చాలా రకాల స్టాండర్డ్ ఉప్మాలు తెల్లగా ఉండటం వల్లనే ఈ విషయం నాకు తేట‘తెల్ల’మైంది)…
‘‘పులి ఉప్మా తిందేమిటి చెప్మా!’’ అంటూ అడవిరాముడు నాటి క్రీ.పూ. సమయాల్లో రాజబాబు సాయంతో జంధ్యాల గారు కొంత ప్రయత్నించినప్పటికీ దానికి రావాల్సినంత గుర్తింపు రాలేదు. కానీ ఉప్మా ప్రాశస్త్యాన్ని ఈ లోకానికి తెలపడం కోసం ఇటీవలి మోడరన్ హిస్టారిక్ మూవీ టైమ్స్‌లో పోకిరి సినిమా ద్వారా పూరీ జగన్నాథ్ ఇతోధికంగా ప్రయత్నించారని చెప్పవచ్చు.
ఇంకా చెప్పాలంటే… ఆయన ఇంటి పేరు పూరీ అయినప్పటికీ… ఉప్మా ప్రాధాన్యాన్ని తెలపడం కోసం ఆయన పడిన తపన కారణంగా ఉప్మా ప్రాధాన్యమేమిటో పోకిరీ సినిమాతో మనకు తెరగతమవుతుంది. అసలు ఉప్మా కారణంగానే పోకిరి బ్లాక్‌బస్టర్ అయ్యిందని చెప్పడం అతిశయోక్తి కాదు. ఆ సినిమాలోని అనేక సన్నివేశాల కారణంగానే నాలో ఈ అభిప్రాయం బలపడిపోయింది. ఇందుకుగాను… శాంపిలుగా కొన్ని దృశ్యాలను (రుచి) చూద్దాం.
‘‘ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఉప్మా తిని బతికేస్తున్నారా’’ అని అడుగుతాడు మహేశ్‌బాబు. అంటే ఉప్మా అనేది వైద్యుల్లో ఫ్యామిలీ డాక్టరులా, సిన్మాలలో ఫ్యామిలీ ఆడియెన్సు కోరుకునే ఓ కుటుంబ కథా చిత్రంలా, ప్రతి కుటుంబానికీ ఓ ఫ్యామిలీ దెయ్యం ఉండాలనే ఆస్కారు వైల్డు కోరికలా… ఉప్మా అనేది ఓ ఫ్యామిలీ టిఫిను అని తెలిసిపోవడం లేదూ…?! అందుకే ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఉప్మా తినే ఆ కుటుంబం… ఓ ఉపమైక కుటుంబం!
‘‘ఏమిటదీ… రంగు డబ్బాలో?’’ అని మరో చోట హీరో ప్రశ్నిస్తాడు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటీ? అది ఏదో ఆర్డినరీ ప్లెయిను డబ్బాలో లేదు. ప్రశస్తమైన, నాణ్యమైన, ఆకర్షణీయమైన రంగు డబ్బాలో ఉంది. ఇలా దాన్ని ఓ కలరు బాక్సులో ఉంచడం ద్వారా ఈస్ట్‌మన్‌కలరూ, గేవా కలరులా దానికో ప్రత్యేకతను ఆపాదించాడు డవిరెట్టరు.
సినిమాలో ఓ చోట హీరో కళ్లు తన వీపుకు గుచ్చుకుంటున్నాయని అంటుంది హీరోయిన్. ఆమెకా అతీంద్రియ శక్తి ఎలా సంక్రమించింది? ఉప్మాతో!! మరోచోట లోకల్ ట్రైనులో ‘ఏంటదీ డబ్బాలో’ అని హీరో అడిగితే… ‘ఉప్మా’ అని జవాబిస్తాడు హీరోయిన్ తమ్ముడు.
‘బాగున్నవురా’.. అంటూ కాస్త బొద్దుగా ఉన్న బామ్మర్దిని మెచ్చుకుంటూనే… ‘రేపు మీ అక్క కూడా నీలా అయిపోతే ఎలారా?’ అంటూ సందేహం వ్యక్తం చేస్తాడు హీరో. అంటే… రివటలా చవటలా ఉన్న ఓ వ్యక్తి కాస్తా… ముద్దుగా, బొద్దుగా అయ్యేంతగా బలవర్ధకమైన పోషకపదార్థాలూ, విటమిన్లూ, మినరళ్లూ… ఇవన్నీ ఉప్మాలో ఉన్నాయంటూ సాక్షాత్తూ సూపర్‌స్టార్ మహేశ్‌బాబూ ఉప్మాకు కితాబిచ్చినట్టేగా? ఆలోచించి చూడండి. తత్వం మీకు సెవెంటీ ఎమ్మెము ఐమాక్స్ తెరమీద సాక్షాత్కారమవుతుంది.
ఇలా పరిశీలించాక నాక్కొన్ని సంగతులూ, సూక్తులూ స్ఫురించాయి. అందులో ఒకటి… వంట ద్వారా ఉప్మాను నువ్వు రక్షిస్తే… దాన్ని తినడం ద్వారా అది నీ ప్రాణాల్ని రక్షిస్తుందని అర్థమవుతుంది కాబట్టి… ఉప్మో ‘మింగ’తి రక్షితహా!! – యాసీన్
Share this Article