హిజ్‌బుల్ ముజాహిదీన్… పేరు ఎప్పుడైనా విన్నారా..? ది రోగ్ కంట్రీ పాకిస్థాన్‌కు పుట్టిన ఉగ్రవాద బిడ్డే ఇది కూడా…!! దీన్ని ప్రపంచం గ్లోబల్ టెర్రరిస్టు సంస్థగా గుర్తించింది… దీని చీఫ్ పేరు సయ్యద్ సలాహుద్దీన్… ఈయనకు ఏడుగురు పిల్లలు… కొందరు ఎంచక్కా కశ్మీర్ ప్రభుత్వ సర్వీసులో ఉన్నారు… తమకు చేతనైనకాడికి ఉగ్రవాదులకు షెల్టర్ ఇవ్వడం, డబ్బు సమకూర్చడం, లోకల్ గ్యాంగుల మద్దతును సమీకరించడం వంటి పనులు చేస్తూ ఉంటారన్నమాట… వాళ్లకు ఆల్ఇండియా టాక్స్ పేయర్స్ డబ్బును జీతాలుగా ఇచ్చేవాళ్లన్నమాట…
బోలెడు మంది… అక్కడి ప్రభుత్వంలో అలా ఏళ్లుగా పాతుకుపోయారు… హిందువుల్ని తన్ని తరిమేయాలి, చంపి పాతరేయాలి, సైన్యం మీద దాడులు చేయాలి, సైనిక కాన్వాయ్‌ల మీదే అటాక్స్ చేయాలి, ఉగ్రవాదులకు మద్దతునివ్వాలి… ఇదే పని… ఇదే సలాహుద్దీన్ ఇద్దరు కొడుకులను ఆమధ్య కొలువుల నుంచి పీకిపారేసింది అక్కడి యంత్రాంగం… జైలులోకి నెట్టేసింది… తాజాగా సయ్యద్ అబ్దుల్ ముఈద్ అనే మరో కొడుకును కూడా కొలువు నుంచి తీసేసింది… మరో ముగ్గురిని కూడా…
ఇప్పటికి దాదాపు 40 మందిని ఇలా డిస్మిస్ చేసింది కశ్మీర్ అధికార యంత్రాంగం… గతంలో ఎలా ఉండేది… టెర్రరిస్టులకు ఒకరు ఆశ్రయం ఇస్తారు… ఒకరు డబ్బు సాయం చేస్తారు… ఒకరు రవాణా సదుపాయం ఏర్పాటు చేస్తారు… ఒకరు ప్రభుత్వ వ్యవహారాలను చేరవేస్తారు… ఒకరు భద్రత బలగాల కదలికల్ని చెబుతారు… వాట్ నాట్..? పాకిస్థానీ ప్రేరిత టెర్రరిస్టులకు కశ్మీర్ లోయలో దొరకని సాయం ఏముంది..? అందులో ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగులు కూడా…!
Ads
వాళ్లకేమీ కాదు, వాళ్ల కొలువులు వాళ్లకుంటయ్… ఒకవేళ వాళ్లు దొరికిపోయినా, కేసులు పెట్టినా సరే, త్వరలోనే అవి కొట్టివేయబడతయ్… ఇదేకదా, మొన్నమొన్నటిదాకా కశ్మీర్‌లో సిట్యుయేషన్… కానీ ఎప్పుడైతే ఆర్టికల్ 370 ఎత్తిపారేసి, కశ్మీర్ ప్రత్యేకాధికారాల్ని కత్తిరించేసి, భారత రాజ్యాంగమే అక్కడా అమలయ్యేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో… అప్పటి నుంచీ ఉగ్రవాదుల రెక్కలు కత్తిరించే పని కూడా మొదలైంది… సహజంగానే పీడీపీ, ఎన్‌సీ, సీపీఎం దీన్ని వ్యతిరేకిస్తున్నయ్… వాటి జెనెటిక్ కేరక్టర్ అది… ఆ పార్టీల ధోరణులు తెలిసిందే కదా… యాంటీ-మోడీ, యాంటీ-బీజేపీ వైఖరి అంటే ఉగ్రవాదానికి మద్దతు పలకడం… అదీ మన రాజకీయ దరిద్రం…
ఇంతకీ ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా చేస్తున్నదేమిటి..? ఆర్టికల్ 311 ప్రయోగిస్తోంది… ఆర్టికల్ 370 ఎత్తిపారేశారు, 35ఏ తీసేశారు… మరి ఈ ఆర్టికల్ 311 ఏమిటి..? ఈ ఆర్టికల్‌లోని సెక్షన్ 2 (సి) ప్రకారం ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి గనుక జాతి వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఎలాంటి విచారణలూ అవసరం లేకుండా డిస్మిస్ చేయవచ్చు… సస్పెన్షన్ కాదు, నేరుగా డిస్మిసల్..!
నిజానికి ఇది కశ్మీర్‌కు గతంలో వర్తించేది కాదు, కానీ ఆర్టికల్ 370 ఎత్తిపారేశాక, దేశంలో మిగతా ప్రాంతాలకు వర్తించే చట్టాలే కశ్మీర్‌కూ వర్తిస్తాయి ఇప్పుడు… ఏడాది క్రితం లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తీసుకున్న నిర్ణయం మేరకు ప్రత్యేకంగా ఒక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటయింది… దీనికి బాస్ స్వెయిన్… ఈయన పదేళ్లపాటు భారత గూఢచార సంస్థలో పనిచేశాడు… తన పనేమిటయ్యా అంటే..? ఎవరెవరిపై కేసులున్నయ్, ఏ దశలో ఉన్నయ్, తీవ్రత ఎంత..? గుర్తించడం, క్రోడీకరించడం, లెఫ్టినెంట్ గవర్నర్‌కు రిపోర్ట్ చేయడం, ఆయన డిస్మిస్ చేసేయడం…
దీనికితోడు టెర్రర్ మానిటరింగ్ గ్రూపు ఒకటి ఏర్పాటు చేశారు… టీచర్లు, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల్లో టెర్రరిస్టు సంస్థల సానుభూతిపరుల్ని గుర్తించడం దీని పని… గత ఏడాది ఫిబ్రవరిలో సైబర్ వాలంటీర్స్ అనే వ్యవస్థ ఏర్పాటు చేశారు… ప్రభుత్వ కొలువుల్లో ఉన్నవాళ్ల సోషల్ మీడియా ఖాతాల్ని అది మానిటర్ చేస్తుంటుంది…
గత ఏడాది మార్చిలోనే మరో నిర్ణయం తీసుకున్నారు, దాని ప్రకారం ప్రతి ఉద్యోగి తన సోషల్ మీడియా ఖాతా వివరాల్ని సమర్పించాల్సి ఉంటుంది… దేశవ్యతిరేక, ఉగ్రవాద మద్దతు పోస్టులు నిఘా రాడార్ కిందకు వస్తాయి… దీన్ని కూడా సహజంగానే పీడీపీ, ఎన్‌సీ, సీపీఎం వ్యతిరేకించాయి… హక్కుల పోరాటాలు, రాజకీయ సంస్థలను అణగదొక్కేందుకు ఉద్దేశించిన అప్రజాస్వామిక, అరాచక, అక్రమ, అనుచిత, అవాంఛనీయ నిర్ణయమని తిట్టిపోశాయి… అవి తిడుతున్నాయీ అంటే, అక్కడి ప్రభుత్వం సరైన దిశలో పనిచేస్తున్నట్టు కదా… అందుకే ఇంకాస్త దూకుడు ప్రదర్శిస్తోంది… అదే జరుగుతోంది ఇప్పుడు…! సీఐడీ వెరిఫికేషన్, జీతాల నిలిపివేత వంటివీ తెరమీదకు వస్తున్నయ్…!!
సలాహుద్దీన్ కొడుకుతో పాటు మరో ముగ్గురి కొలువుల్నీ పీకేశారని చెప్పుకున్నాం కదా… ఎవరు వాళ్లు..? జేకేఎల్ఎఫ్ లీడర్ ఫరూక్ అహ్మద్ దార్ అలియాస్ బిట్టా కరాటే భార్య అస్సబ కొలువును కూడా తీసేశారు… బిట్టా ఆల్‌రెడీ టెర్రర్ ఫండింగ్ కేసులతో జైలులో ఉన్నాడు… మరొకాయన పేరు ముహీత్ అహ్మద్… ఈయన కశ్మీర్ యూనివర్శిటీలో సైంటిస్టు… ఇంకొకాయన మజీద్ హుస్సేన్, ఈయనేమో సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్… ఇంకా ఎందరున్నారో…!!
Share this Article