ఫాఫం, అనవసరంగా తెలుగుదేశం వాళ్లు ఏపీ డీజీపీని ఆడిపోసుకుంటారు… ఐపీఎస్ కాదు, వైపీఎస్ అని నిందిస్తారు… బోలెడు కేసులు పెడుతున్నాడు, మావాళ్లను వేధిస్తున్నాడు అని ఆక్షేపిస్తారు కానీ… ఆయన మాత్రం నిజానికి తెలుగుదేశానికి క్లీన్ చిట్ ఇచ్చిన విషయాన్ని మాత్రం గుర్తించలేకపోతున్నారు… కొద్దిరోజులుగా రాష్ట్రంలో ఏపీలో గుళ్లపై దాడి, విగ్రహాల ధ్వంసం సాగుతున్నయ్ కదా… రథాలు కాలబెట్టేవాళ్లే రథయాత్రలు చేస్తుంటారు అనే వ్యాఖ్యల ద్వారా సాక్షాత్తూ ముఖ్యమంత్రే… ఇది కావాలని ఇతర పార్టీలు చేస్తున్న కుట్ర అనే అర్థమొచ్చేలా మాట్లాడుతున్నాడు… విజయసాయిరెడ్డి వంటి నేతలు కూడా వీటి వెనుక చంద్రబాబు అండ్ కో హస్తం ఉందీ అంటున్నాడు… బట్, ఏ పార్టీ ఏ కుట్రా చేయడం లేదు అని సాక్షాత్తూ ఆ ప్రభుత్వంలోకి కీలకాధికారే తేల్చిపడేస్తున్నాడు…
నిజానికి డీజీపీ ప్రెస్ మీట్ మీద జరగాల్సినంత చర్చ జరగలేదేమో… ప్రతిపక్షాల కుట్ర ఉందన్న అధికార పార్టీ ప్రచారాన్ని ఆ డీజీపీయే కొట్టిపడేసినట్టు కదా…! జగన్ ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయడానికి ఏదైనా పెద్ద కుట్ర జరుగుతుందా అని ఏకంగా ఐబీ (ఇంటలిజెన్స్ బ్యూరో)ను కూడా అడిగారంటే ఈ వరుస సంఘటనలు రాష్ట్రంలో ఎంతటి కలకలాన్ని సృష్టిస్తున్నాయో అర్థం చేసుకోవాల్సిందే… ఈ స్థితిలో డీజీపీ ‘‘మొత్తం 44 సంఘటనలు… 29 కేసులు తేల్చేశాం… 80 మందిని పట్టుకున్నాం… జస్ట్, దొంగలు, పిచ్చోళ్లు, జంతువుల వల్లే ఇవన్నీ జరిగాయి…’’ అంటున్నాడు…
Ads
వోకే, జగన్ ప్రభుత్వం రాగానే జంతువులు ఎందుకు రెచ్చిపోతున్నయ్..? అవి ఏ జంతువులు..? అకస్మాత్తుగా విగ్రహాలపైనే ఎందుకు పడుతున్నయ్..? జగన్ ప్రభుత్వం రాగానే కొందరు ఎందుకు పిచ్చోళ్లయి రెచ్చిపోతున్నారు..? దొంగలకు ఎందుకు అంత ధైర్యం వచ్చింది..? ఇవన్నీ ఇప్పట్లో తేలే ప్రశ్నలు కాదు… కానీ..? ఏ ఆధారాలు లేకుండా అధికార పార్టీ నాయకులు ఈ విగ్రహాల ధ్వంసం వెనుక ప్రతిపక్షాల హస్తం ఉందని ఎలా ఆరోపించారు..? ఒక్కరంటే ఒక్క నిందితుడినీ మీడియా ముందో, కోర్టు ముందో … ఫలానా నాయకుడు చెబితేనే చేశాం అని చెప్పించలేదెందుకు..?
మా పని మేం చేస్తున్నాం, మాకు కులాన్ని, మతాన్ని అంటగట్టొద్దు ప్లీజ్ అని చెప్పడానికి డీజీపీ ప్రెస్మీట్ పెట్టినట్టున్నాడు బహుశా… పనిలోపనిగా ఈ వివరాలన్నీ చెప్పాడు… అంతకుముందు చంద్రబాబు సీఎం, ఏసీబీ డీజీ, డీజీపీ ఎట్సెట్రా అందరూ క్రిస్టియన్లే అని ఏదో కామెంటాడు కదా… అంటే వాళ్లంతా క్రిస్టియన్లే కాబట్టి హిందూ గుళ్లపై జరిగే దాడులపై సరైన దర్యాప్తు సాగదు అనేది ఆయన ఉద్దేశం… అంతటి సీనియర్ మోస్ట్ నేత ఏ ఆధారాలు లేకుండానే బురద జల్లడం వెనుక రాజకీయ ప్రయోజనాల ఆకాంక్ష ఉండవచ్చు గాక… తన హిందువుల వోటు బ్యాంకును బీజేపీ తన్నుకుపోతున్నదనే ఆందోళన ఉండవచ్చు గాక… కానీ మరీ ఇలాంటి వ్యాఖ్యలా..? అఫ్ కోర్స్, ఏపీ పాలిటిక్స్ అంటేనే అంత… ముఖ్యమంత్రే రాజ్యాంగ బాధ్యులకు కులం రంగు పూస్తాడు… మాజీ ముఖ్యమంత్రి ఉన్నతాధికారులకు మతం రంగు పూస్తాడు… ఇంతకీ జగన్ వచ్చాకే ఎందుకు ఈ వరుస దాడులు సాగుతున్నయ్..? నిజంగానే తన సర్కారును వ్యూహాత్మకంగా డిస్టర్బ్ చేసే కుట్ర పెద్ద స్థాయిలో సాగుతోందా..? అయితే ఎవరు వాళ్లు..? దాన్ని జగన్ చేధించలేకపోతున్నాడా..? లేక నిజాలు తెలిసీ బయటపెట్టలేకపోతున్నాడా..? జగన్ను భయపెట్టే కుట్రలు కూడా సాధ్యమేనా..?!
Share this Article