చాలా ఏళ్ల క్రితం… థియేటర్లో ఓ తెలుగు సినిమా… కథ సీరియస్గా ఉంది… ఓవైపు తల్లి, మరోవైపు అన్నయ్య… తల్లి బిడ్డను కొడుతూ ఉంటుంది… అన్న ఆపుతాడు… ఏమైంది అంటాడు… చెల్లి మీద విపరీతమైన ప్రేమ… చెల్లి నోరు విప్పుతుంది… ‘‘నేను గోపిని ప్రేమించాను అన్నయ్యా… తొందరపడ్డాం… తల్లిని కాబోతున్నాను… గోపి తండ్రి ఒప్పుకోవడం లేదు…’’ అని ఏడుస్తూ ఉంటుంది… గోపి ఫాదర్ అత్యంత సహజంగా హీరోకు పడని విలన్ అయి ఉంటాడు కదా తెలుగు సినిమా కథ ప్రొటోకాల్స్ మేరకు… థియేటర్లో ఓ అబ్బాయి గట్టిగా అరిచాడు…‘‘వరలక్ష్మీ, నీకు వేరే పనేం ఉంది..? అన్ని సినిమాల్లోనూ ఇంతే కదా…’’ నాలుగైదు వరుసల్లోని ప్రేక్షకులంతా గొల్లుమన్నారు… నిజానికి అందరి మనస్సుల్లోనూ అదే అభిప్రాయం… ఆ చెల్లి పాత్రధారి పేరు వరలక్ష్మి… హహహ…
అప్పట్లో చాలా సినిమాల్లో ఇదే కథ… తను చెల్లి… ఎవరో హీరో… ఒక విలన్ కొడుకు… కొడుకుతో చెల్లి ప్రేమ, కడుపు… తలబాదుకునే తల్లి… లేదంటే రేప్, కడుపు… హీరో కసికసిగా రగిలిపోవడం… మధ్యలో ఈ పాత్రను చంపేసేవాళ్లు… కాస్త పొడవైన నాసికతో ఆమె కనిపించగానే సగం కథ అర్థమైపోయేది జనానికి…! ఆంధ్రా సిస్టర్ లేదా రేపుల వరలక్ష్మి అనేవాళ్లు తనను… చెల్లి పాత్రల్లో కనీసం వంద సినిమాలు చేసిందట… తనే చెప్పింది ఓసారి… అప్పట్లో రోహిణి, తులసి తదితరులు కూడా బాలనటులుగా ఉన్నా ఈ వరలక్ష్మే కాస్త పాపులర్… ఇంతకీ ఈ చెల్లి వరలక్ష్మి ఎందుకు గుర్తొచ్చిందంటారా..? ఆలీతో సరదాగా షో తాజా ప్రోమోలో వ్యాంప్ వేషాలు ఎక్కువగా వేసిన జయలలితతో కలిసి కనిపించింది… వీళ్లిద్దరి కాంబినేషన్ ఏమిటో ఆలీకే తెలియాలి… ఆ ప్రోమోలోనే జయలలిత ఏడుస్తోంది… ‘‘నమ్మినందుకు కోట్లు మోసపోయాను, ఒకప్పుడు కార్లలో తిరిగిన దాన్ని క్యాబుల్లో తిరుగుతున్నాను’’ అంటూ… అయితే వరలక్ష్మి విషయానికి వస్తే… ఈ తరానికి ఆ వరలక్ష్మి తెలియదు… ఓ బాలనటి నుంచి హీరోల చెల్లెళ్ల కేరక్టర్ల వరకూ చాలా సినిమాల్లో చేసింది… ఆమెను మళ్లీ ప్రేక్షకులకు చూపించి ముచ్చట్లు పెట్టడం వరకూ ఆలీ ప్రయత్నం గుడ్… నిజానికి ఆలీ షో బ్యూటీయే అది…
Ads
మీరు ఒక్కసారి నెట్లో గనుక వెళ్లి వరలక్ష్మి అని సెర్చితే… పీఆర్ వరలక్ష్మి, జి.వరలక్ష్మి, ఎస్.వరలక్ష్మి వంటి పలు సినిమా సెలబ్రిటీల పేర్లు కనిపిస్తాయి… పాత తరం నటుల పేర్లు అవి… ఈమెనేమో బేబీ వరలక్ష్మి… కాకపోతే ఇప్పటి తరానికి వరలక్ష్మి శరత్కుమారే బాగా తెలుసు… ఈ బేబీ వరలక్ష్మి నాలుగు దక్షిణ భాషల్లోనూ నటించింది… వెండితెర అవకాశాలు తగ్గాక టీవీ సీరియళ్లలోకి కూడా వచ్చింది… ఇప్పుడు నిజజీవితంలో తను అమ్మమ్మ… జస్ట్, రెండేళ్ల క్రితమే ఇదే ఆలీ తన షోకు గెస్టుగా తీసుకొచ్చి బోలెడు ముచ్చట్లు చెప్పించిన ఆలీ మళ్లీ ఇప్పుడు జయలలితతో కలిపి ఈ సగం సగం షో దేనికో…! గెస్టులు దొరకడం లేదా ఆలీ..?!
Share this Article