భలే రాస్తాడబ్బా రాధాకృష్ణ… పాత్రికేయంలో తనది ఎవరివల్లా కాని ఓ ప్రత్యేకమైన స్టయిల్… దీనికి పాత్రికేయ ప్రక్రియలకు సంబంధించి ఓ కొత్త పేరు అర్జెంటుగా వెతకాలి… అవునా అంటూ పాఠకులు తెగ హాశ్చర్యపడిపోయి, తమ చుట్టూ ఉన్న వాతావరణానికి పూర్తి భిన్నమైన స్థితులను ఆర్కే చెబుతుంటే ఏది నిజమో తెలియక జుత్తు పీక్కునేలా చేయగలగడం ఖచ్చితంగా ఓ కొత్త పాత్రికేయ ధోరణే… ఆద్యుడు, నిపుణుడు ఆర్కేయే…
చాన్నాళ్ల తరువాత ఆర్కే తన కొత్త పలుకులో కొన్ని విషయాలు చెప్పాడు… ముఖ్యమైనవి ఏమిటంటే..? ఈమధ్య రేవంత్, భట్టి ప్రధాని మోడీని కలిసినప్పుడు ‘మనం ముందుగా కేసీయార్ కుటుంబాన్ని, పార్టీని తొక్కేద్దాం బ్రదర్స్, మనిద్దరికీ కామన్ శత్రువు తను, రేప్పొద్దున నువ్వూనేను మాత్రమే పోటీలో ఉండాలి, ఛలో హమ్ లడేంగే’ అన్నాడట, ఆ దిశలో వెంటనే కవితకు ఈడీ నోటీసులు వచ్చాయట, కాగ్ రిపోర్ట్ కాలేశ్వరంపై రెడీ అయిపోయిందట, ఇన్నాళ్లూ కన్నూమిన్నూ కానకుండా ఎగిరిన కేసీయార్‌కు ఇక రాబోయే రోజుల్లో జింతాకజితజితే అన్నట్టుగా ఆర్కే కథనం… ఓహో, తన ప్లాన్ వివరించడానికే అర్జెంటుగా రేవంత్, భట్టిలను ఢిల్లీ రమ్మన్నాడా..?
Ads
ఎందుకిది అబ్బుర పాత్రికేయం అనాలంటే… తొలిసారి తన దగ్గరకు వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రితో బీజేపీ ప్రధాని ఆ పొలిటికల్ ఒప్పందం చేసేసుకున్నాడా..? ఇంకా నయం, మోడీ మాటలు ఆల్‌రెడీ రేవంత్ మీద ప్రభావం చూపిస్తున్నాయి, రాహుల్ ఎంతగా ఆదానీని తిడుతున్నా సరే, అదే ఆదానీతో దావోస్‌లో పెట్టుబడుల ఒప్పందాలపై రేవంత్ సంతకాలు చేయడానికి, తెలంగాణలో ఆదానీ ప్రాజెక్టులకు రేవంత్ క్లియరెన్స్ ఇవ్వడానికి ఇదే కారణం అని తేల్చిపారేయలేదు… పులి బయటికి వచ్చి విర్రవీగితే బోనులో వేసి, చెట్టుకు కట్టి తాటతీస్తాం అని పరోక్షంగా కేసీయార్‌ను ఉద్దేశించి రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు చేయడానికి కూడా మోడీ ఇచ్చిన మాటసాయమే కారణమని కూడా రాసేస్తే ఓ పనైపోయేది…
ఆర్కే రాయడం మరిచిపోయిన మరో సంగతి కూడా ఉంది… ఇలా రాసి ఉండాల్సిందేమో… ‘మామూలుగా షర్మిల కాంగ్రెస్‌లోకి రావడం రేవంత్‌కు ఇష్టం లేదు, తను బేసిక్‌గా చంద్రబాబు మనిషి, అందుకని వైఎస్ కుటుంబమంటే విముఖత, అందుకే తెలంగాణ కాంగ్రెస్ వైపు రానివ్వలేదు, కానీ మోడీ తెలివిగా షర్మిలను ఏపీ రాజకీయాల్లోకి కేవీపీ, ఆదానీల మార్గంలో ఏపీ కాంగ్రెస్‌లోకి ప్రవేశపెట్టడంతో ఇక రేవంత్ సైలెంట్ అయిపోయాడు… ఆమె ఏపీ పాలిటిక్స్ ఎంట్రీ టీడీపీకీ, జగన్‌కూ తలనొప్పి కావాలనేది మోడీ ప్లాన్… రాబోయే రోజుల్లో అయితే గియితే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉండాలి అక్కడ కూడా… నో టీడీపీ, నో వైసీపీ… వావ్, మోడీకి ఎంత చాణక్యం..?’
నవ్వొచ్చిందా..? ఇంకా ఉన్నయ్… ‘ప్రస్తుతం చంద్రబాబు, కేసీయార్ దగ్గర డబ్బు లేదు, ఎవరు నమ్మకపోయినా నిజం…’ అంటాడు ఆర్కే… నిజమే, తనే చెప్పినట్టు దీన్ని ఎవడూ నమ్మడు… ఫాఫం, కేసీయార్ దగ్గర డబ్బుల్లేకనే మొత్తం ప్రతిపక్షాల ప్రచారానికి డబ్బు ఖర్చు పెట్టుకుంటాను అన్నాడా..? నమస్తే తెలంగాణ, టీన్యూస్, తెలంగాణభవన్ ఖర్చును పావువంతు తగ్గించాల్సిందే అని ఆర్డర్లు వేసింది అందుకేనా..? ఫాఫం, చంద్రబాబు తన వ్యూహకర్త రాబిన్ శర్మకు కూడా సరిగ్గా పేమెంట్స్ ఇవ్వడం లేదా..? హేమిటో ఆర్కే మార్క్ రాతలు…
మల్కాజగిరి నుంచి సుప్రీం మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను బీఆర్ఎస్ నుంచి పోటీ చేయాలని కేసీయార్ అడిగాడుట… కవితను పోటీచేయవద్దని చెప్పేశాడట… కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేద్దాం బాపూ అని కేటీయార్ చెబితే వద్దన్నాడట… బీజేపీయే కర్నాటక, తెలంగాణల్లో షిండే రాజకీయం ప్రయోగించబోతున్నదట… బీజేపీతో చేతులు కలుపుదాం అని కేసీయార్ కోరుకుంటున్నా బీజేపీ పెద్దలు ససేమిరా అంటున్నారట… ఇలా చాలా రాశాడు ఈరోజు… సరే, అవన్నీ మనం విశ్లేషించుకుంటూ వెళ్తే ఒక్కొక్కటీ అదే స్థాయి సుదీర్ఘ కథనాలు అవుతాయి గానీ, చివరలో అయిష్టంగానైనా సరే, రాబోయే ప్రధాని ఎవరో తేల్చిపారేశాడు… రాహుల్ 2029 మీద ఆశ పెట్టుకోవడమే శరణ్యం అనేశాడు… ఇలా…
స్టాలిన్ భయపడుతున్నాడు… చెప్పినట్టు జగన్ ఆడుతున్నాడు… చంద్రబాబు రాజీపడిపోతున్నాడు… కేసీయార్ భయపడుతున్నాడు… నితిశ్ ఎప్పుడు ప్లేటు ఫిరాయిస్తాడో తెలియదు… మమత చల్లబడిపోయింది… నవీన్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడు… మోడీ ఎన్ని కుట్రలు చేసినా మా చంద్రబాబు తట్టుకుని నిలబడ్డాడు, కానీ కేసీయార్ నిలబడతాడా..? అసలే రాజకీయాల్లో తనను ఎవడూ నమ్మడు, పైగా డబ్బు కూడా లేదు పాపం అని ఆర్కే సందేహపడుతున్నాడు… భలే రాస్తావు ఆర్కే సాబ్..!!
Share this Article