.
నిజం… సాక్షికి చేతకాలేదు… రాయడం తెలియలేదు… ఓ పథకాన్ని నిశితంగా విశ్లేషించి, తప్పొప్పులను జనం ముందు పెట్టలేక చేతులెత్తేస్తోంది… చంద్రబాబుకు అత్యంత సన్నిహితమే అయినా పీ-4 పథకం బట్టలిప్పింది ఆంధ్రజ్యోతి… సాక్షి చేయాల్సిన పనిని ఆంధ్రజ్యోతి చేసింది…
సరే, ఈనాడు ‘అన్నీ వదిలేసి’ చాన్నాళ్లయింది కాబట్టి, దాన్ని అలా వదిలేస్తే… నిజంగా రాధాకృష్ణ పీ-4 పథకం ఆలోచన, అమలు తీరుపై రాసిన వ్యాసం బాగుంది… అఫ్‌కోర్స్, ఆ పథకం తన చంద్రబాబుకే నష్టం కలిగించకుండా, మెత్తమెత్తగానే జాగ్రత్త బాసూ అని చెప్పినట్టుగానే ఉన్నా సరే, సరైన విశ్లేషణ సాగింది…
Ads
అసలు ఈ పీ4 హడావుడి ఏమిటో, దాని కథేమిటో ఎవరికీ ఇన్నాళ్లు అర్థం కాలేదు… రాధాకృష్ణ వ్యాసంతో అసలు ఆ పథకమేమిటో కాస్త తెలిసొచ్చింది…
- దాతృత్వం అనేది స్వచ్ఛందం… మనుషులు గానీ, కంపెనీలు గానీ సత్సంకల్పంతో స్వీయప్రేరణతో సమాజసేవకు ముందుకురావాలి… అంతేతప్ప అది నిర్బంధం కాకూడదు… ఈ సోయి చంద్రబాబుకు లేదు… ఏ తలకుమాసినోడో ఆయనకు ఈ సలహా ఇచ్చాడు… ఈ దిక్కుమాలిన పథకాన్ని ఊదరగొడుతున్నాడు… రాధాకృష్ణ వ్యాసం సారాంశం ఇదే… నిజమూ అదే…
ప్రజలు ఎప్పుడూ ప్రభుత్వ వైఫల్యాల గురించి, అక్రమాల గురించి చర్చించుకోకూడదు… ఎప్పుడూ ప్రజల్ని ఏదో ఓ విషయంపై డైవర్ట్ చేయాలి… పైకి స్థూలంగా మంచి కార్యక్రమం అనిపించేలా కొన్ని కొత్త విషయాల్ని జనం ముందుకు తీసుకురావడం చంద్రబాబు స్టయిల్… ప్రజలవద్దకుపాలన, జన్మభూమి… ఇప్పుడు పీ-4 …
మొదట్లో జన్మభూమి బాగానే ఉన్నా, తరువాత దాన్ని ఎలా భ్రష్టుపట్టించారో అందరమూ చూశాం… రియల్ టైమ్ గవర్నెన్స్.., ఎక్కడ మురికికాలువ క్లీన్ చేయకపోయినా ఇట్టే తెలుసుకుని శిక్షించేంత అద్భుత టెక్నాలజీ పథకాల్ని కూడా ఊదరగొట్టాడు చాలాసార్లు… ఆకస్మిక తనిఖీలతో వ్యవస్థలోని దిగువ స్థాయి ఉద్యోగులను వేధించిన రోజులూ ఉన్నయ్…
- అనగా ప్రైవేటు, ప్రభుత్వ, ప్రజల పార్టనర్‌షిప్… పెద్ద సంక్లిష్టత ఏమీలేదు… 2029 కల్లా ఈ స్కీమ్‌తో ఏపీలో అసలు దరిద్రమే లేకుండా చేస్తాడట చంద్రబాబు… జీరో పావర్టీ… అదయ్యేది కాదు, పొయ్యేది కాదని తనకూ తెలుసు… కానీ ఇలాంటివి ఇప్పుడు ఎందుకూ అంటే..?
అలవిమాలిన హామీలిచ్చాడు… అవి అసాధ్యమని తనకూ తెలుసు… ఏరు దాటే దాకా, అంటే మళ్లీ అధికారంలోకి వచ్చేదాకా అవి జనాన్ని మభ్యపెట్టడానికి కావాలి… తరువాత ఇప్పుడు జనం కళ్లకు గంతలు కట్టే ఆలోచనలు కావాలి… అప్పుడేమో సంపద సృష్టిస్తా, జనానికి పంచుతా, ఈ హామీలన్నీ నెరవేరుస్తా అన్నాడు… అదొక మాయ…
ఇప్పుడు జగన్ పెద్ద చిల్లు బొచ్చెను ఇచ్చిపోయాడు, సంపద లేదు, సంపాదన లేదు, జనాన్ని బాది జనానికే పంచుతా, దెబ్బకు దారిద్ర్యం పరార్ అంటున్నాడు… సరే, పీ-4 దగ్గరికే వద్దాం… విధానరచన నుంచి అన్నీ లోపాలే… పేదరికం నుంచి బయటపడేయాల్సిన జనం 11 లక్షలు (బంగారు కుటుంబాలు) అట… అంతేనట… మరి 90 శాతం తెల్ల రేషన్ కార్డులు ఎలా ఉన్నయ్ చంద్రబాబూ..?
ఈ 11 లక్షల మందిని ఉద్దరించాల్సిన బాధ్యత 1.67 లక్షల మందిదేనట (మార్గదర్శులు)… మరి ప్రభుత్వం ఏం చేస్తుంది..? ఏమీలేదు… కాస్త పచ్చగా బతుకుతున్నవాడిని బాది, ఈ బంగారు కుటుంబాలను ఉద్దరించేలా మధ్యవర్తి పాత్ర పోషిస్తుందట… తీరా చూస్తే ఈ బంగారు కుటుంబాల ఎంపికలో 26 శాతం అనర్హులని తేలుతోందట… పోనీ, ఈ సోకాల్డ్ మార్గదర్శకులకు ఫాయిదా ఏమిటి..? టాక్స్ రిబేట్ ఇప్పిస్తాడా చంద్రబాబు..?
- ఉద్యోగ వ్యవస్థను ప్రయోగించి, బెదిరించి, మార్గదర్శులను ఎంపిక చేస్తున్నారు… టార్గెట్లు పెడుతున్నారు… ఊళ్లల్లో జనం లబోదిబో… చిన్న చిన్న వ్యాపారులను కూడా బాదడం ఏమిటో చంద్రబాబుకే తెలియాలి… ఈ స్కీమ్‌తో అబ్రకదబ్ర అన్నట్టుగా జస్ట్, మరో నాలుగేళ్లలో, అంటే మళ్లీ ఎన్నికల నాటికి ఏపీలో పేద కుటుంబమే ఉండదట…
నిజమే… రాధాకృష్ణ చెప్పినట్టు… ఎమ్మెల్యేలకు ఫుల్లు అధికారాలు ఇప్పుడు… చీమచిటుక్కుమనాలన్నా ఎమ్మెల్యేల పర్మిషన్లు కావాలి… కేసీయార్ పదేళ్ల కాలంలో ఇలాగే ఎమ్మెల్యేలను, నియోజకవర్గాలను ‘సామంత రాజ్యాలు- రాజులు’గా చేశాడు… అనుభవించాడు… జనం అనుభవించారు… ఏపీలో ఇప్పుడే మొదలైంది…
తను అర్థం చేసుకోవల్సింది ఒకటే… జగన్ తీవ్ర పాలనా వైఫల్యాలే చంద్రబాబును మళ్లీ గద్దెనెక్కించాయి… మరో పార్టీ, మరో నాయకుడు ప్రత్యామ్నాయం లేని దురవస్థ కాబట్టి… చంద్రబాబు మారకపోతే మళ్లీ జగనేనా..? ఫాఫం తెలుగు ప్రజానీకం… వేరే దిక్కులేదని అనుకోవాల్సిందేనా..? అంతేనంటారా రాధాకృష్ణ గారూ..!?
ఏతావాతా రాధాకృష్ణ మొత్తం వ్యాసాన్ని చదివితే… అది పీ4 కాదు, పీ5 అని అర్థమవుతుంది పాఠకులకు… అనగా ప్రభుత్వ, ప్రజల, ప్రైవేటు, పిచ్చి, పార్టనర్ షిప్ …!! అవునూ, భారీగా వేతనాలు తీసుకుంటున్న ఉన్నతోద్యోగులు, ప్రజాప్రతినిధులు ఈ మార్గదర్శుల జాబితాలో ఉన్నారా చంద్రబాబు గారూ..!? చివరాఖరుగా… ఓ చిన్న డౌటనుమానం… ఇది మార్గదర్శి బ్రాండ్ ప్రమోషన్ కూడా అనుకోవాలా నాయకా..?!
Share this Article