సింపుల్… ఆంధ్రజ్యోతి తలుపులు మూసేయడానికి సుబ్రహ్మణ్యస్వామి వంటి మోస్ట్ లిటిగెంట్ అక్కర్లేదు… తిరుమల వెంకన్న నిధులను అప్పనంగా ఆయన జేబుల్లో పోయాల్సిన పని కూడా లేదు… 2435 వంటి నల్ల జీవోలు కూడా అవసరం లేదు… జస్ట్, జగన్ ఒక చిన్న పని చేస్తే చాలు… దాంతో ఆంధ్రజ్యోతి నోరు మూతపడిపోయి, ఇక ఆ అవకాశాన్ని వాడుకుని, తన సొంత పత్రిక సాక్షిఎకాఎకిన దేశంలోనే నెంబర్ వన్ రేంజ్‌కు ఎదిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు… జగన్ చేయాల్సింది ఏమిటయ్యా అంటే..? చంద్రబాబు హయాంలో ఏ పత్రికకు, ఏ టీవీకి నీతి, రీతి, రివాజు లేకుండా ఎన్ని యాడ్స్ ఇచ్చారు..? ఎన్ని కోట్లు దోచిపెట్టారు..? రూల్స్ ఎలా తుంగలో తొక్కారు..? సిట్టింగ్ జడ్జి విచారణ ద్వారా తేల్చేయాలి… పనిలోపనిగా తను ఎలాగూ ధర్మవర్తనుడు కాబట్టి, తన చేతికి ఏ మట్టీ అంటదు కాబట్టి, తళతళ మెరిసే ధవళ చరిత కాబట్టి, తన హయాంలో యాడ్స్ ఇచ్చిన తీరును కూడా విచారణ పరిధిలోకి చేర్చాలి… చంద్రబాబు అడ్డగోలుగా రాధాకృష్ణకు కోట్లు దోచిపెట్టినట్టు తేలుతుంది… ఆంధ్రజ్యోతిని రాధాకృష్ణ ప్రభుత్వానికి అప్పగించేస్తాడు… ఎలా అంటారా..?
రాధాకృష్ణ ప్రస్తుతం జగన్‌కు ఓ సవాల్ విసిరాడు… ‘‘జగన్ తన సొంత పత్రిక, చానల్‌కు వందల కోట్లు ప్రకటనల రూపంలో దోచిపెట్టినట్టు బయటపడింది… ఒకప్పుడు ఇలా అధికార దుర్వినియోగానికి పాల్పడితే రాజీనామా చేయవలసి వచ్చేది… వైద్య కళాశాలలపై నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, బస్సు రూట్ల ప్రైవేటీకరణపై నీలం సంజీవరెడ్డి, పదిహేను బస్తాల సిమెంటు కేటాయింపుపై బాగారెడ్డి, ఒక బిల్డింగ్‌కు అనుమతులపై కోనేరు రంగారావు రాజీనామాలు చేయాల్సి వచ్చింది… అది నైతికత… (మరి పొలిటికల్ కరెప్షన్‌కు కొత్త ఎత్తులు చూపించిన చంద్రబాబు ఎందుకు రాజీనామా చేయలేదు అనేది వేరే విషయం)… అప్పట్లో ‘ఆంధ్రజ్యోతి’ పత్రికకు అప్పనంగా రూ.700 కోట్లు దోచిపెట్టారని దుష్ప్రచారం చేశారు కదా… నిబంధనలకు విరుద్ధంగా ‘ఆంధ్రజ్యోతి’కి అదనంగా ఒక్క రూపాయి ఇచ్చి ఉంటే జగన్ రెడ్డి ఇంతకాలం మౌనంగా ఉండేవారా? ఆనాడు రూ.700 కోట్లు అని గాలి ప్రచారం చేసినవాళ్లు అది నిజమని ఇప్పుడు నిరూపించినా ‘ఆంధ్రజ్యోతి’ పత్రికను వదులుకోవడానికి నేను సిద్థం… వైసీపీ నాయకులు గానీ, వారితో గొంతు కలిపినవారు గానీ ఈ సవాల్‌ను స్వీకరిస్తారా..? ఇప్పుడు ముఖ్యమంత్రి సొంత పత్రిక, చానల్‌కు అనుచితంగా 200 కోట్ల రూపాయలకు పైగా ఈ 20 నెలల్లోనే దోచిపెట్టినందుకు ఏం సమాధానం చెబుతారు..? ఈ స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి రాజీనామా చేస్తారా..? సర్క్యులేషన్‌ను పరిగణనలోకి తీసుకుని ‘ఆంధ్రజ్యోతి’కి ప్రకటనలు ఇవ్వాల్సింది పోయి, అతి తక్కువ సర్క్యులేషన్‌తో నడుస్తున్న పత్రికలకు కోట్లాది రూపాయలు పంచిపెట్టడాన్ని ఎలా సమర్థించుకుంటారు..? భారీ స్థాయిలో జరిగిన ఈ అధికార దుర్వినియోగానికి ఇవాళ కాకపోయినా రేపయినా న్యాయస్థానంలో సంజాయిషీ ఇవ్వక తప్పదు…’’
వాస్తవమే… రాధాకృష్ణ ఆరోపణలో కొన్ని నిజాలున్నయ్… తెలంగాణ, ఏపీ… రెండు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీ పత్రికలకు, చానెళ్లకు, ముఖ్యమంత్రి సొంత మీడియాకు కోట్లకుకోట్లు అడ్డగోలు టారిఫ్‌తో దోచిపెడుతున్నారనే ఆరోపణలు ఈనాటివి కావు… ప్రభుత్వ యాడ్స్ అనేవే పెద్ద స్కాములు… ఆ ఫీల్డులో ఉన్నవాళ్లకు తెలియని రహస్యమేమీ కాదు ఇది… విచారణ జరగాల్సిందే… రాధాకృష్ణ సవాల్ జగన్ స్వీకరించాలి… జగన్ క్యాంపు అప్పట్లో ఆరోపించినట్టు 700 కోట్లు కాదు గానీ, నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రజ్యోతికి ఎక్కువ యాడ్స్ ఇచ్చారని తేలితే, రాధాకృష్ణ తన పత్రికను వదిలిపెట్టేలా ఓ ఒప్పందపత్రం మీద ముందుగానే సంతకాలు తీసుకుని, జగన్ న్యాయవిచారణ జరిపించాలి… ఎలాగూ అది నిజమని తేలుతుంది… ఆంధ్రజ్యోతిని స్వాధీనం చేసుకుని, ప్రభుత్వ గెజిట్లా మార్చేస్తే సరి… అదేసమయంలో జగన్ సాక్షి విషయంలో తన చేతులు, తన చేతలు సూపర్ క్లీన్ అని నిరూపించుకున్నట్టూ అవుతుంది… అసలు ప్రభుత్వ ప్రకటనల్లోని కుంభకోణాలూ, అప్పనపు ధారబోతలూ బయటికొస్తాయి… ఏటా వందల కోట్ల ప్రజాధన దుర్వినియోగం మీద చర్చ జరుగుతుంది… జరగాలి… జగన్ ఆ చాన్స్ అందిపుచ్చుకోవాలి… రాధాకృష్ణ నోరు మూయించాలి… జగన్ ఇలాంటి సవాళ్లకు ఎప్పుడూ రెడీ… వదిలేసే రకం కాదు… కాదు..!!
Ads
Share this Article