జగన్‌రెడ్డి సినీ పరిశ్రమపై కత్తి దూస్తున్నప్పటికీ పరిశ్రమ పెద్దలు చేతులు కట్టుకుని వినయంగా వేడుకోవడానికే పరిమితం అవుతున్నారు. వేరే హీరో సినిమా ఫ్లాపయితే సంబరాలు చేసుకునే అభిమానులు కూడా ఎక్కడున్నారో కనబడడం లేదు. పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అని సినిమాల్లో డైలాగులు చెప్పే మహానుభావులు ప్రభుత్వం తమపై కత్తి దూస్తున్నా మౌనంగా ఉండటం క్షంతవ్యం కాదు. మీ టైం వచ్చే వరకు పారితోషికాన్ని తగ్గించుకోండి, అంతేగానీ జగన్‌రెడ్డి వంటి వారికి తలవంచితే మీరు హీరోలుగా కాదు జీరోలుగా మిగిలిపోతారు…
…. ఒక మెయిన్ స్ట్రీమ్ పత్రిక, ఒక చానెల్ అధినేత వ్యాఖ్యలు ఇవీ… బాధ్యతారహితమైన పాత్రికేయం అని దీనికి పేరు… ఎంతసేపూ జగన్‌రెడ్డి మీద జనం తిరగబడాలి, వైసీపీ నాయకులు ఎక్కడ కనిపించినా కసితీరా దంచి కొట్టాలి అన్నట్టుగా సాగుతోంది ఈ రాతల తీరు… ఇప్పుడు టాలీవుడ్ హీరోలు, హీరోల ఫ్యాన్స్ బజార్లలోకొచ్చి ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయాలా..? మొత్తం రాష్ట్రాన్ని రోజుల తరబడీ బంద్ పెట్టించాలా..? అసలే రాజకీయాల్ని కులం కుళ్లుతో, బూతులతో ఇప్పటికే భ్రష్టుపట్టించారు… ఇంకా ఇదుగో ఇలా సైకోఫ్యానిజాన్ని కూడా రెచ్చగొట్టాలా..? ఏ సమాజం కోసం మీ తహతహ ఆర్కే గారూ..? తిరగబడాలి సరే, రేప్పొద్దున ఆంధ్రజ్యోతిలో ఏదో వార్త తమకు నచ్చకపోతే జగన్ ఫ్యాన్స్ ఏం చేయాలి..? ఇదేం పోకడ..? ఎంత చేసినా, ఏం రాసినా జగన్ ఇంకా కుర్చీ దిగడం లేదు, ఇంకేం చేయాల్రా బాబోయ్ అనే ఫ్రస్ట్రేషన్ లెవల్స్ బాగా పెరిగిపోతున్నట్టు కనిపిస్తోంది సుమీ… (టికెట్ ధరల తగ్గింపు, ఇండస్ట్రీ స్పందన, హీరోల పారితోషికాలు గట్రా అంశాల జోలికి ఇక్కడ నేను వెళ్లడం లేదు… ఫ్యానిజాన్ని రెచ్చగొట్టే పాత్రికేయాన్ని మాత్రమే ప్రస్తావిస్తున్నాను…)
ఫాఫం, షర్మిల మీద బోలెడన్ని కన్నీళ్లు గుమ్మరించాడు గానీ ఆర్కేకు జగన్ రాజకీయాల తీరు ఇంకా అంతుచిక్కినట్టు లేదు… తల్లి దూరం, చెల్లి దూరం, ఇక జగన్ మీద చెల్లి తిరుగుబాటే, జగన్‌కు చుక్కలే, చిక్కులే అంటూ ఏదేదో రాసుకుంటూ పోయాడు గానీ… రాజన్నరాజ్యం కావాలని కోరుకునే ఆమె తెలంగాణ రాజకీయాల్లో ఎందుకు కాలుపెట్టిందో, ఆమె వెనుక ఎవరున్నారో ఆర్కే తెలుసుకునే ప్రయత్నం చేస్తే గానీ, ఇలాంటి ‘కొత్త పలుకు’లు రావు… రాయబడవు… (లేదా తెలిసీ జనం కళ్లకు గంతలు కడుతున్నారో తెలియదు)… సరే గానీ, తను రాసిన మరికొన్ని అణిముత్యాలు ఓసారి చూడండి…
Ads
జగన్‌రెడ్డికి చెందిన రోత పత్రిక శుక్రవారం నాటి సంచికలో ఒక వింత జరిగింది. జస్టిస్ ఎన్వీ రమణ భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైనప్పుడు కూడా ఇవ్వనంత ప్రాధాన్యాన్ని ఆయన తన స్వగ్రామం పొన్నవరంలో పర్యటించిన సందర్భంగా ఇచ్చారు. విచిత్రంగా తెలంగాణ ఎడిషన్‌లో కూడా జస్టిస్ రమణ ఫొటోను మొదటి పేజీలో ప్రచురించారు. ఈ మార్పు ఏ మార్పునకు సంకేతమో ఎవరికైనా తెలిస్తే చెప్పండి ప్లీజ్!
జస్టిస్ రమణ గురించి ఏం రాసినా, ఎంత రాసినా మేం రాయాలి తప్ప సాక్షి రాయడం ఏమిటి అని ఎద్దేవా చేస్తున్నాడా ఇక్కడ..? మంచిగైంది, నేల మీదకు దిగివచ్చారు గదా, మార్పు తప్పలేదు చూశారా అని వెక్కిరిస్తున్నాడా ఇక్కడ..? అసలే జగన్‌రెడ్డి మారడం ఏమిటని ఆశ్చర్యపోతున్నాడా..? అయ్యయ్యో, జగన్ తన ధోరణిలోనే తను ఉండిపోవాలి తప్ప ఇలా మారిపోతే ఎలా అని ఆందోళన పడుతున్నాడా..? ఇక తనపై విచారణలు వేగవంతమయ్యే స్థితిలో సీజేతో అవసరార్థం సత్సంబంధాల్ని కోరుకుంటున్నాడని, అందుకే ఇలా నటిస్తున్నాడని ఆర్కే సందేహిస్తున్నాడా..? అసలేమిటి ఆర్కే భావన..? నిజమే, సుప్రీం చీఫ్ జస్టిస్‌ను రమణను ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి కలిసి, తగు మర్యాదతో సత్కరించడం జగన్ తత్వం, ధోరణి తెలిసినవాళ్లను ఆశ్చర్యంలో ముంచెత్తింది తప్ప రాజకీయాల్లో, ప్రజాజీవితంలో ఇదేమీ అసాధారణం కాదు… ఆశ్చర్యం దేనికో అందరికీ తెలుసు…
మార్పు అనివార్యం… అది నటన అయినా సరే, సహజమైనా సరే, తాత్కాలికమైనా సరే, అవసరార్థం అయినా సరే, తప్పనిసరైనా సరే… రాజకీయాలు, ప్రజాజీవితం బహుచంచలం, అదేమీ స్థిరబిందువు కాదు… (politics are dynamic, not constant)… ఆర్కేకు, టీడీపీ క్యాంపుకి ఈ మార్పు ఒక్కటే కనిపించిందా..? ఉదాహరణకు శాసనమండలి రద్దు మీద జగన్ ఎన్ని చెప్పాడు..? ఇప్పుడు ఏం జరిగింది..? త్రిరాజధాని బిల్లుల సంగతేమైంది..? సీఆర్డీఏ ఏమైంది..? గత ఏడాదిలో తీసుకున్న యూటర్నులెన్ని..? అనివార్యం… మారకతప్పని స్థితి వచ్చినప్పుడు ఎవరైనా మారతారు..? మారాలి… డెస్టినీ చాలా మందికి చాలా పాఠాలు నేర్పిస్తుంది, జగన్‌దేముంది..? నో, నో, ఇది నిజమైన మార్పు కాదు అంటారా..? కాలం ఆ నిజాన్ని కూడా బయటపెడుతుంది కదా… అదీ చూద్దాం…!!
Share this Article