ఆంధ్రజ్యోతి పాత్రికేయంలో మరోసారి మిగతా పత్రికలను ఓడించింది… ఈనాడు రన్నరప్ స్థానంలో నిలవగా, సాక్షి కొట్టుకుపోయింది పోటీలోె… నిజానికి ఇది పోటీ కాదు… పాత్రికేయులకు ఉండాల్సిన బేసిక్ లక్షణాలు కనిపించని దురవస్థ… తెలుగు సినిమాకు గౌరవాన్ని తీసుకొచ్చిన విశ్వనాథ్ చనిపోతే తెలుగు ప్రధాన పత్రికలు స్పందించిన తీరు ఓసారి పరిశీలించాలి…
ఒక సెలబ్రిటీ చాన్నాళ్లుగా హాస్పిటల్‌లో ఉంటే, చావుబతుకుల్లో ఉంటే… పత్రికలు ముందే తనకు సంబంధించిన వివరాలతో కథనాలు రెడీ చేసుకుంటారు… ఎప్పుడు, ఏ అర్ధరాత్రి సదరు సెలబ్రిటీ మరణించినా వెంటనే ఆ ముందస్తు కథనాలు పేజీలకెక్కుతాయి అర్జెంటుగా… కానీ అనుకోకుండా అర్ధరాత్రి మరణిస్తే… అప్పటికప్పుడు సదరు సెలబ్రిటీకి సంబంధించిన స్మరణ కథనాలు ప్రిపేర్ చేసి, పేజీల్లో పెట్టేయడం పెద్ద టాస్క్… అదుగో అక్కడే పాత్రికేయ ప్రతిభ కనబడేది… సందర్భాన్ని బట్టి అప్పటికప్పుడు రెయిజ్ కావడం ఏమిటో, దమ్ము ఏమిటో బయటపడేది…
విశ్వనాథ్ మరణవార్త కాస్త లేటుగా వచ్చింది… అఫ్‌కోర్స్ పత్రికల డెడ్‌లైన్లకు చాలాముందుగానే… సో, అప్పటికప్పుడు ఆసక్తిని కలిగించే, కనెక్టయ్యే కథనాలు ఎవరు ఇవ్వగలిగితే వాళ్లు పాత్రికేయ పోటీలో నిలబడ్డట్టు…! అలాగే ఓ మంచి హెడింగ్ కూడా ముఖ్యమే… అది సదరు సెలబ్రిటీకి ఆప్ట్‌గా ఉండాలి, తనేమిటో చెప్పగలగాలి… అదేసమయంలో ఒక నివాళి అర్పిస్తున్నట్టుగా ఉండాలి… విశ్వనాథ్ కన్నుమూత, కళాతపస్వి ఇకలేరు అని ఎవడైనా రాయగలడు… కానీ పాఠకుడిని కనెక్ట్ కావాలి…
Ads
ఆంధ్రజ్యోతి హెడింగ్ ‘‘నటరాజ పాదాన తలవాల్చనా’’ అని… సూపర్… తను తీసిన సాగరసంగమం సినిమాలో చివరిపాట అజరామరం… అందులోని ఒక పాదాన్ని అలాగే విశ్వనాథ్ మరణానికి వర్తింపజేస్తూ… అదేసమయంలో తను శివైక్యం చెందాడనే భావనతో… మంచి హెడింగ్ పెట్టారు… తను శివ భక్తుడు కూడా… (తెలిసి పెట్టారో, తెలియక పెట్టారో గానీ విశ్వనాథ్ వీర శైవుడు…) ఈమధ్య ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీ హెడింగ్స్ బాగుంటున్నాయి… ఆ అభిరుచి ఈనాడులో పూర్తిగా కరిగిపోయింది, సాక్షిలో మొదటి నుంచే ఆ అలవాటు లేదు… అదొక రొడ్డకొట్టుడు జర్నలిజం…
ఈనాడు కళాతపస్వి కన్నుమూత ఓ సాదాసీదా హెడింగ్ అని పెట్టారు… ఈనాడులో జీతాలెక్కువ, రాతలు తక్కువ అన్నట్టుగా రోజురోజుకూ నాసిరకం ప్రబలుతోంది… ఎవడికి పుట్టిన బిడ్డరా, ఎక్కెక్కి ఏడుస్తున్నది అన్నట్టుగా ఉంది దాని దుర్గతి… Epaper లో ఫుల్ పేజ్, ప్రింట్ లో హాఫ్ పేజ్ (Hyderabad edition)… సాక్షి హెడింగ్ ఇంకాస్త నయం వినువీథికి విశ్వనాథుడు… కానీ ఆంధ్రజ్యోతి ఆ పీకవర్స్‌లో కూడా ఫస్ట్ పేజీలో సగం, లోపల ఒకటిన్నర పేజీల కథనాలను ప్రచురించింది… మంచి ప్రయారిటీ, మంచి ప్రయాస… వాటికి పెట్టిన హెడింగులు కూడా బాగున్నాయి… దొరకునా ఇటువంటి సేవ, ఆ ఉచ్ఛ్వాసం కవనం, ఆ నిశ్వాసం గానం, దృశ్యాలనంతాలు నీ వేయిరూపాలు… ఇవన్నీ విశ్వనాథ్ పాటల నుంచి తీసుకున్నవే…
ఈనాడులో కూడా ఒక పేజీ కథనాలు ఇచ్చారు… కానీ ఎందుకో వాటిల్లో డెప్త్ లేదు, ఏదో మమ అనిపించినట్టుగా రాసినట్టున్నాయి… ఓ ఫీల్ లేదు… ముందే చెప్పుకున్నాం కదా, నాసిరకం… కాకపోతే విశ్వనాథ్ పాటల్లోని గొట్టు భాషలాగే ప్రత్యేక పేజీకి దర్శక రుషి అసమాన యశస్వి అని హెడింగ్ పెట్టారు… బాగుంది… సాక్షిలో ఒకే ఒక ప్రత్యేక కథనం, దానికి హెడింగ్ తెలుగు సినిమా ఆత్మగౌరవం… అత్యంత పేలవమైన కవరేజీ…
ఈ నాసిరకం జర్నలిజం కాబట్టే మా పత్రికలు కొనండహో అంటూ తమ సర్కిళ్లలో సాక్షి ఉన్నతోద్యోగుల నుంచి డైరెక్టర్ల దాకా కాపీలు అమ్ముకునే ప్రయాసలో పడాల్సి వచ్చింది… మొహమాటపు అమ్మకాలు, అంటగట్టడాలు కాదు… కంటెంటు చందాదారుడిని తీసుకురావాలి… ఈ మూడు తప్ప మిగతా వాటిని ఈ పరిశీలనకు అసలు పరిగణనలోకే తీసుకోలేదు… వాటికి పత్రికల లక్షణాలు లేవు కాబట్టి…!! మాదీ పత్రికే అని చెప్పుకునే కేసీయార్ భజనపుత్రిక నమస్తే తెలంగాణతోసహా..!!
Share this Article