Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

లీగల్ లిటిగేషన్లతో కొట్టాలి బీఆర్ఎస్‌ను… రేవంత్‌కు ఆంధ్రజ్యోతి పిలుపు…

April 3, 2024 by M S R

గేట్లు తెరిచి, ఎడాపెడా చేరికలకు వోకే చెప్పేసిన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బ్యానర్ స్టోరీలో చెప్పిన ఓ సలహా పాటిస్తే బెటరేమో…! మన ఎమ్మెల్యేల సంఖ్య పెరగకపోతేనేం, ఎదుటోడి ఎమ్మెల్యేల సంఖ్య ఎలా తగ్గినా సుఖమే కదానేది ఈ స్టోరీ మార్మిక సారాంశం… ఆంధ్రజ్యోతికి రేవంత్ రెడ్డి ఎలాగూ నిత్యపాఠకుడే కాబట్టి తను సీరియస్‌గానే ఆలోచించే చాన్సయితే ఉంది…

విషయం ఏమిటంటే..? మెజారిటీకన్నా అయిదారు స్థానాలే ఎక్కువున్నయ్… ఒకవేళ కేసీయార్, బీజేపీ గనుక కలిస్తే… (అవకాశాలు తక్కువే, బట్ సపోజ్…) లోకసభ ఎన్నికల తరువాత కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలను లాగేసి ప్రభుత్వాన్ని కూలదోస్తే..? ఇదీ ప్రశ్న… కేసీయార్, బీజేపీ రెండూ ఇందులో సిద్ధహస్తులే కదా… అందుకే ఎందుకైనా మంచిదని రేవంత్ రెడ్డి కూడా గేట్లు తెరిచే ఉంచాడు… తప్పడం లేదు…

ఐతే… ఫోన్ ట్యాపింగ్ పేరిట కొన్నేళ్లపాటు తెలంగాణలో సాగిన నీచమైన కార్యక్రమం ఎలాగూ బయటికి వస్తోంది కదా… ఇంకా లోతుగా తవ్వుతూనే ఉన్నారు కదా… బీఆర్ఎస్ సుప్రీం సూచనల మేరకే ఈ అరాచకాన్ని కొనసాగించామని నిందితులు ఒప్పేసుకుంటున్నారు కదా… ఏమేం చట్టాలు పెడితే కేసు బిర్రుగా ఉంటుందో ఆలోచించి మరీ బిగించబోతున్నారు కదా… ప్రతిపక్షాల అభ్యర్తుల ఓటమి కోసం అధికార పార్టీ, అనగా ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి ఎన్నికల అక్రమాలకు పాల్పడినట్టు స్పష్టమవుతోంది కదా…

Ads

సో, దాన్నే అనుకూలంగా తీసుకుని, బీఆర్ఎస్ గెలిచిన ప్రతిచోటా ఓడిన కాంగ్రెస్ అభ్యర్థులతో ‘కరప్ష్ ప్రాక్టీస్’ కేసులు వేయిస్తే కథ వేరే ఉంటుందని రాధాకృష్ణ స్టోరీ సారాంశం… సరే, ఈ కేసులు నిలుస్తాయా గెలుస్తాయా అనేదీ పక్కన పెడితే బీఆర్ఎస్ ప్రభుత్వం సాగించిన ఫోన్ ట్యాపింగ్‌ యవ్వారాన్ని మరింతగా జనంలోకి తీసుకుపోవచ్చు, దేశవ్యాప్తంగా చర్చకూ తెరలేపొచ్చు… అంతేకదా డియర్ ఆర్కే గారూ…

అబ్బే, ఇదంతా జరిగే యవ్వారమేనా అని ఎవరూ సందేహించకుండా గతంలో ఇందిరాగాంధీ ఈ కేసులో భంగపడిన కథనూ ఉదహరించాడు… అదేమిటంటే సంక్షిప్తంగా…



1971లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 352 సీట్లతో అజేయశక్తిగా నిలిచింది. రాయ్‌బరేలీ నుంచి ఇందిరాగాంధీ లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో నెగ్గారు. ఆ సీటులో సంయుక్త సోషలిస్ట్‌ పార్టీ అభ్యర్థిగా ఆమెతో పోటీ పడ్డ రాజ్‌నారాయణ్‌.. తన గెలుపుపై చాలా విశ్వాసంతో ఉన్నారు. కానీ, ఫలితం అందుకు విరుద్ధంగా రావడం ఆయనకు షాక్‌.

ఇందిరాగాంధీ ప్రభుత్వ యంత్రాంగాన్ని దారుణంగా దుర్వినియోగం చేయడమే తన ఓటమికి కారణమని భావించిన ఆయన.. అలహాబాద్‌ హైకోర్టులో ‘ఎన్నికల పిటిషన్‌’ దాఖలు చేశారు. ఎన్నికల పిటిషన్‌ అంటే.. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 80 ప్రకారం.. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి అవినీతి విధానాలను అవలంబించినా, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడినా.. ఆ అభ్యర్థిని అనర్హుడిగా/అనర్హురాలిగా ప్రకటించాలంటూ సదరు అభ్యర్థితో పోటీపడిన ప్రత్యర్థిగానీ, ఆ నియోజకవర్గంలోని ఓటరుగానీ హైకోర్టును ఆశ్రయించి వేసే పిటిషన్‌.

1971 ఏప్రిల్‌ 24న రాజ్‌నారాయణ ఈ పిటిషన్‌ వేశారు. ఇందిరాగాంధీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని.. సాయుధ దళాలు సహా ఎన్నికల ప్రచారంలో ఆమెకు పలువురు ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, స్థానిక పోలీసులు సహకరించారని తన అప్పీలులో పేర్కొన్నారు. భారత వైమానిక దళం ఆమెకు విమానాలను, హెలికాప్టర్లను సమకూర్చిందని పేర్కొన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 123 (7) ప్రకారం అలా చేయడం ‘కరప్ట్‌ ప్రాక్టీసెస్‌’ కిందకు వస్తుందని.. అది అనర్హతకు తగిన కారణమని గుర్తుచేశారు.

అలాగే.. ఆమె తన ఎన్నికల ప్రచారానికి ప్రభుత్వ వాహనాలను వాడుకున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ కేసును విచారించిన అలహాబాద్‌ హైకోర్టు.. ఎన్నికల కోసం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినందున ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్‌ 123 (7) ప్రకారం ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదంటూ 1975 జూన్‌ 12న తీర్పునిచ్చింది. ఆ తీర్పుతో.. ఉన్న సీటును కోల్పోవడమే కాక, ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కూడా ఆమె కోల్పోయారు.

దీనిపై ఇందిర సుప్రీం కోర్టును ఆశ్రయించినప్పటికీ.. దేశ అత్యున్నత న్యాయస్థానం అలహాబాద్‌ హైకోర్టు తీర్పును కొట్టివేయలేదు. ఎగ్జిక్యూషనల్‌ స్టే మాత్రమే ఇచ్చింది. దరిమిలా ఆమె దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సంచనలం రేపుతున్న ట్యాపింగ్‌ వ్యవహారం సైతం అంతకుమించి అధికార దుర్వినియోగం కిందికి వస్తుందని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. ఈ కేసు తీవ్రత చూస్తే ఎమర్జెన్సీకి దారితీసిన నాటి వ్యవహారం కంటే ఎక్కువేనని అభిప్రాయపడుతున్నారు…



ఇదీ ఆంధ్రజ్యోతి వార్తలోని ఓ భాగం… అన్నట్టు కరప్ట్‌ ప్రాక్టీసెస్‌ అంటే…

ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 123వ సెక్షన్‌లో ఈ కరప్ట్‌ ప్రాక్టీసెస్‌ గురించి ఉంది. దాని ప్రకారం… ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు గానీ, వారి తరఫున పనిచేసే ఏజెంట్లుగానీ, అభ్యర్థుల అనుమతితో మరెవరైనాగానీ..

  • గెజిటెడ్‌ అధికారులు
  • స్టైపెండరీ జడ్జిలు, మేజిస్ట్రేట్‌లు
  • సాయుధ దళాల సభ్యులు
  • పోలీసులు
  • ఎక్సైజ్‌ అధికారులు
  • రెవెన్యూ అధికారులు, తదితరుల సహాయం తీసుకోవడం, తీసుకోవడానికి ప్రయత్నించడం, తీసుకోవడానికి ప్రేరేపించడం అవినీతి విధానాల కిందికే వస్తుంది. గత ప్రభుత్వం తన గెలుపు కోసం పోలీసుల ‘సేవ’లను అడ్డగోలుగా వాడుకున్న నేపథ్యంలో విపక్షాలు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది…

ఏతావాతా ఈ స్టోరీ చెప్పేదేమిటయ్యా అంటే… ప్రజాకోర్టులో ఎలాగూ బీఆర్ఎస్‌ను మట్టిగరిపించారు కదా… ఇక నిజమైన కోర్టుల్లోనూ ఈ పోరాటం స్టార్ట్ చేయండి అని ఆంధ్రజ్యోతి పిలుపు… అసలే జనం తిరస్కరించి కిందామీదా పడుతున్న బీఆర్ఎస్ మీద మరిన్ని వరుస పోట్లు వేయాలని సూచన…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జామ ఆకులు తెగ తింటున్నారు… పచ్చి, ఎండు, పొడి… అన్నీ…
  • ఆంధ్రాబాబు బుర్రలో బనకచర్ల పురుగు మెసులుతూనే ఉంది..!!
  • పొంగులేటి పొగ..! సిస్టం, పార్టీ, సర్కారు… అన్నింటికీ ఓ కొత్త థ్రెట్..!!
  • సార్, మా కరెంటు కనెక్షన్ తీసుకుంటారా..? బోలెడు ఆఫర్లున్నాయి..!!
  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls
  • భయాన్ని దహనం చేసిన మహిళ — 4 వేల శవాలకు అంత్యక్రియలు…
  • కొడుక్కి ఓ హిట్ కోసం… అల్లుడు నిర్మాతగా… అక్కినేని తెరప్రయత్నం…
  • శవాన్ని ఓవెన్‌లోకి తోశారు… ఏదో కాలుతున్న ధ్వని… ఖాళీ స్ట్రెచర్ బయటికి వచ్చింది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions