వరి కొనకపోతే దేశంలో అగ్గి పెడతా అని కేసీయార్ బెదిరిస్తున్నాడు కదా… ధర్నాలు, యుద్ధాలకు రెడీ అంటున్నాడు కదా… మెడలు వంచైనా సరే కేసీయార్‌తో ధాన్యం కొనిపిస్తామని బండ సంజయ్ హెచ్చరిస్తున్నాడు కదా… సవాళ్లు, ప్రతిసవాళ్లు సాగుతున్నాయి కదా… నిజానికి పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణ రైతుల్ని వరి నుంచి ఇతర పంటల వైపు మళ్లించడంలో కేసీయార్ ప్రభుత్వం వైఫల్యం బట్టబయలవుతోంది… దీన్ని పూర్తిగా కేంద్రంపైకి నెట్టేసి, బీజేపీని బదనాం చేసేసి తప్పించుకునే ఎత్తుగడ ఇప్పుడు… ఆవేశకావేశాలు పెరుగుతున్నయ్… కావాలనే ఒకరిపైఒకరు బురద జల్లుకుంటున్నారు, నిందించుకుంటున్నారు… ఈ స్థితిలో ఆంధ్రజ్యోతి ఓ మంచి ట్విస్ట్ ఇచ్చింది… అసలు కథేమిటో బయటపెట్టింది…
బాయిల్డ్ రైస్ ఇవ్వబోమనీ, ఫోర్టిఫైడ్ రైస్ ఇస్తామని కేసీయార్ ప్రభుత్వం కొద్దిరోజుల క్రితమే ఎఫ్సీఐతో ఒప్పందం కుదుర్చుకుందని ఓ కథనం రాసింది… ఇప్పుడు మాటమార్చి రచ్చ చేస్తోందని ఆ పత్రిక ఆరోపణ… బండి సంజయ్‌కు తెలియదా ఈ సంగతి..? తెలిస్తే… ఏమయ్యా, నువ్వే ఎఫ్సీఐతో ఈ ఒప్పందం కుదుర్చుకుని, మళ్లీ ఇప్పుడెందుకు మాటతప్పినవ్ అని అడిగేవాడేమో… కేసీయార్ డిఫెన్స్‌లో పడేవాడేమో… ఇప్పుడు ఆంధ్రజ్యోతి చెప్పిన ఒప్పందం మీద కేసీయార్ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందో..?! (బండి సంజయ్ పీఆర్ టీం చాలా సబ్జెక్టుల్లో వీక్…)
Ads
దేశంలోని ప్రతి రాష్ట్రమూ తమ అవసరాలకు సరిపడా వరి పండించుకుంటున్నాయి… క్లియర్… అసలు బాయిల్డ్ రైస్ తినేవాళ్లే లేరు… క్లియర్… రా రైస్ వినియోగమే అందరికీ అలవాటైంది… క్లియర్… గతంలోలాగా ఏపీ, తెలంగాణల నుంచి బియ్యం ఏ రాష్ట్రానికీ వెళ్లే పరిస్థితి లేదు… క్లియర్… ఎఫ్సీఐ వద్ద నాలుగేళ్లకు సరిపడా నిల్వలున్నయ్, స్టేట్ పూల్ కూడా కలిపితే ఇంకా ఎక్కువ… ఆహారధాన్యాలు వృథా అవుతున్నయ్, బాయిల్డ్ రైస్ ఎగుమతి చేయాలన్నా ధరలు సరిగ్గా లేవు… మరి ఎందుకు బాయిల్డ్ రైస్ మీద తెలంగాణ ప్రభుత్వం పట్టుపడుతోంది..? తనకు నిజాలు తెలియవా..? తెలుసు… తెలిసే రచ్చ… కేంద్రం దగ్గర అన్నీ అంగీకరించి కూడా రచ్చ…
బాయిల్డ్ రైస్ బదులు రా రైస్ ఇవ్వాలని అంటోంది కేంద్రం, అదీ ఫోర్టిఫైడ్ రైస్ (వివిధ పోషకాలను బియ్యంలో కలుపుతారు) రూపంలో… ఆమేరకు తెలంగాణ మిల్లుల్లో బ్లెండింగ్ కెపాసిటీ పెరగాలి… రా రైస్ అయితే ఇతర దేశాలకూ ఎగుమతి చేసేందుకు కొంత చాన్సుంది… నిజాలు ఇలా ఉంటే బీజేపీ నిజాలు చెప్పదు, టీఆర్ఎస్ నిజాలు చెప్పదు… మధ్యలో వరి రైతుతో చెలగాటం… (చాలామందికి నచ్చకపోయినా సరే, రాష్ట్రంలో కాస్త ఆంధ్రజ్యోతి మాత్రమే పత్రిక అని చెప్పుకోగలిగేలా కనిపిస్తోంది ఈమధ్య…) బీజేపీని వదిలేసేయండి, దానికి కౌంటర్ వాదన చేతకాదు, కేంద్ర విధానానికి సరైన ఆధారసహిత సమర్థన కూడా చేతకాదు, కానీ ప్రజల పట్ల బాధ్యత చూపాల్సిన ప్రభుత్వానికి మాత్రం వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి… బాయిల్డ్ రైస్ బదులు మిల్లుల్లో కేవలం రా రైస్ మిల్లింగ్ చేయించి, అదే న్యూట్రియెంట్స్ బ్లెండింగ్ చేయించి ఫోర్టిఫైడ్ రైస్‌గా ఎఫ్సీఐకి ఇస్తే సరిపోతుంది కదా… వరినే నిషేధించడం దేనికి..? ఐనా ఇంకా టైముంది కదా… మరెందుకు ఇప్పుడు ఈ రచ్చ..? ఎవరి కోసం..?!
Share this Article