.
12 గంటల్లో 8 లక్షలు… 24 గంటల్లో 14 లక్షలు… 2 రోజుల్లో 16 లక్షలు… ఏమిటివి అనుకుంటున్నారా..? కాక్రోచ్ జనతా పార్టీ ఆన్‌లైన్ ఫాలోయింగ్ సంఖ్యలని అంచనా వేస్తున్నారా..? కాదు, అన్నామలై స్టార్ట్ చేసిన wetheleaders పోర్టల్‌కు రిజిష్టరైన వారి సంఖ్య అది… నో, నో, అన్నామలై నాటెటాల్ ఏ కాక్రోచ్… డిజిటల్ సెటైర్ వేదిక అసలే కాదు…
ఎందుకు కాదు..? ఏమిటి తేడా అంటారా..? సీజేపీ గురించి పదే పదే మాట్లాడటమే వేస్ట్… అదొక తుక్‌డే తుక్‌డే జాతివ్యతిరేక ముఠాల సమూహం… ఇంకా వివరంగా అవసరం లేదు… కానీ అన్నామలై..?
Ads
తన ఐపీఎస్ కెరీర్‌ను వదిలిపెట్టి… తమిళనాడులో ఓ కొత్త దశ రాజకీయాల్ని నడపాలనుకుని, బీజేపీకి చేతకాక, పళనిస్వామి పిచ్చి కోరికలకు హైకమాండ్ బలిపెట్టిన ఓ కొత్తతరం నాయకుడు… ఒంటరివాడిని చేస్తే, ఒంటరిగానే ఫైట్ చేస్తానని స్థిరంగా నిలబడి, బీజేపీ ఆఫర్ చేసిన ఎంపీ సీటును ఎడమకాలితో తన్నేసి, జనంలోనే ఉంటానంటూ జనంలోకి వచ్చిన అరుదైన కేరక్టర్…
(ఒక్కసారి తెలంగాణలో ఐపీఎస్ వదిలేసి, పాపం, కేసీయార్ గడీస్వామ్యంలోకి ప్రవేశించిన ఆ వ్యక్తితో పోల్చండి… ఎంత తేడా..?)
అబ్బో, అన్నామలైలో ఏమిటంత స్పెషాలిటీ అంటారా..? తనకు డీఎంకే, అన్నాడీఎంకే ద్రవిడ రాజకీయాల బలాలు తెలుసు, బలహీనతలు తెలుసు… బీజేపీ భంగపడనుందనీ తెలుసు… పళని స్వామి కోసం… బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, వనతి శ్రీనివాసన్, గురుమూర్తి, తమిళిసైల కోసం తనను ఎలా బలిపెట్టారో తెలుసు…
ఆ పరాభావాల నుంచి పారిపోదలుచుకోలేదు… నిలబడి పోరాడటానికే నిశ్చయించాడు… గెలుపో ఓటమో జానదేవ్… ఏ ఫైటర్… సో, ఏ కోణం చూసినా ఆ బుర్రల్లేని బొద్దింకలన్నా, సొంత పార్టీల నిర్మాణాలు- ఉద్యమాలు మరిచి ఆ డిజిటల్ పొంగు వెనుక పరుగులు తీసే భ్రమాత్మక లెఫ్ట్, ఆప్ తదితర పార్టీలకన్నా అన్నామలై అనేకానేక రెట్లు బెటర్…
అన్నామలై ఏదో నిన్నమొన్న రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు కాదు… తమిళనాడు రాజకీయాల ప్రధాన ప్రవాహంలో ఏళ్లుగా ఢక్కామొక్కీలు తిన్నవాడు… విమర్శలు ఎదుర్కొన్నాడు… సొంత పార్టీలోనే అవమానాలు భరించాడు… ప్రత్యర్థుల దాడులు చూశాడు… మీడియా నిర్లక్ష్యాన్ని ఎదుర్కొన్నాడు… అయినా రాజకీయ రంగం నుంచి వెనక్కి తగ్గలేదు…

ఈ ఫోటో చూశారా… అన్నా మలైని బలిస్తున్నట్టుగా నడిరోడ్డు మీద నరికివేత… ఆ రేంజులో తన మీద వ్యతిరేకతను కనబరిచాయి ద్రవిడ పార్టీలు… తను భయపడలేదు… స్టిల్ హి ఈజ్ ఫరమ్ ఆన్ హిజ్ స్టాండ్…
విజయ్ ప్రభుత్వం మూడు నెలలు కూడా ఉండేట్టు లేదు అని స్టాలిన్ అంటున్నాడు… తన దయాదాక్షిణ్యాల మీదే విజయ్ ప్రభుత్వం మనుగడ అని తనకు తెలుసు… దాన్నెప్పుడు కూల్చేస్తారో తెలియదు… ఈలోపు తదుపరి పరిణామాలకు ఎలా ప్రిపేరై ఉండాలో బీజేపీకి తెలియదు… అసలు దానికి టిపికల్ సౌత్ పాలిటిక్స్ అర్థం కావు…
అన్నాడీఎంకే పళనిస్వామి నాయకత్వంలో నానాటికీ ఇక జనం నుంచి దూరమై, మనుగడ కోసం పోరాడే స్థితి వస్తుందనీ అన్నామలైకి తెలుసు… ఇప్పుడప్పుడే డీఎంకే బలం పుంజుకోదనీ తెలుసు… దానికి ఉదయనిధి వంటి కుర్ర కూతకారులే ప్రధాన శాపమనీ తెలుసు… అందుకే ఓ స్పేస్ క్రియేట్ చేసుకుంటున్నాడు అన్నామలై…
తను ఈ ప్రస్థానంలో గెలుస్తాడా లేదానేది వేరే సంగతి… తన పోరాటస్పూర్తిని ఇక్కడ చెప్పుకుంటున్నాం.,..

అందుకే ఈ 16 లక్షల సంఖ్యను ఎన్నికల ఫలితంగా కాకుండా, ఒక రాజకీయ సంకేతంగా చూడాలి… ఫలితం ఏమవుతుంది? ఎవరూ చెప్పలేరు… అసలు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, తమిళనాడులో ప్రస్తుతం రాజకీయ ఆశావహుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోవడం…
నటుడు రాఘవ లారెన్స్ రాజకీయ రంగప్రవేశం గురించి వార్తలు వస్తున్నాయి… ఆయన కుమార్తె రాజకీయ అరంగేట్రం గురించీ చర్చ నడుస్తోంది… మరోవైపు రజినీకాంత్ రాజకీయాలకు దూరమయ్యారని అనుకున్న సమయంలో ఆయన కుటుంబం చుట్టూ మళ్లీ రాజకీయ చర్చలు మొదలయ్యాయి… ఆయన సతీమణి ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది… ఎండిపోయిన ఆ పిరికి బట్టతల మీద మళ్లీ ఆశల వెంట్రుకలు మొలుస్తున్నాయి…
తమిళనాడు రాజకీయాలు మళ్లీ ఒక సంధికాలంలోకి ప్రవేశిస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి… అయితే ఇక్కడ ఒక వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి… అందరూ విజయ్‌లు కాలేరు… సినిమా స్టార్‌గా ఉన్న ప్రజాదరణను రాజకీయ మూలధనంగా మార్చుకోవడం అందరికీ సాధ్యం కాదు… రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి కేవలం అభిమానులు సరిపోరు… సంస్థ కావాలి… నాయకత్వం కావాలి… సహనం కావాలి… అదృష్టం కూడా కావాలి… కానీ అందరూ విజయ్‌లు కాలేరని చెప్పడం ఎంత నిజమో, కొత్త కలలు కనొద్దని చెప్పడం కూడా అంతే తప్పు…
రాజకీయాలు చివరికి ఆశల మీదే నడుస్తాయి… ఆ ఆశలే ఒకప్పుడు ఎంజీఆర్‌ను తీసుకొచ్చాయి… జయలలితను నిలబెట్టాయి… విజయ్‌కాంత్‌ను ఎదిగించాయి… ఇప్పుడు విజయ్‌ను రాజకీయాల కేంద్రబిందువుగా మార్చాయి… అదే ఆశ ఇప్పుడు అన్నామలైలో కనిపిస్తోంది… రాఘవ లారెన్స్‌లో కనిపిస్తోంది… ఇంకెవరిలోనో కనిపించొచ్చు…
వాళ్లలో ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో కాలమే చెబుతుంది… కానీ ఆశలను మాత్రం ఎవరూ చంపలేరు…
Share this Article