Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి… శ్రీవారి వివాహపొంతన…

March 23, 2023 by M S R

Raasi-Vaasi:

పల్లవి:-
ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి
కన్నె నీ రాశి కూటమి గలిగిన రాశి

చరణం-1
కలికి బొమ విండ్లుగల కాంతకును ధనురాశి
మెలయు మీనాక్షికిని మీనరాశి
కులుకు కుచకుంభముల కొమ్మకును కుంభరాశి
చెలగు హరిమధ్యకును సింహరాశి

Ads

చరణం-2
చిన్ని మకరంకపు బయ్యెద చేడెకు మకరరాశి
కన్నె పాయపు సతికి కన్నెరాశి
వన్నెమైపైడి తులదూగు వనితకు తులరాశి తి
న్నని వాడి గోళ్ళ సతికి వృశ్చికరాశి

చరణం-3
ఆముకొని మొరపుల మెరయు నతివకు వృషభరాశి
జామిలి గుట్టుమాటల సతికి కర్కాటక రాశి
కోమలపు చిగురుమోవి కోమలికి మేషరాశి
ప్రేమ వేంకటపతి గలిసె ప్రియ మిధున రాశి

అన్నమయ్య అమ్మవారిలో లక్షణాలన్నింటినీ జ్యోతిశ్చక్రంలో ఉన్న రాశులతో పోలుస్తున్నాడు. అమ్మ జగన్మాత. అందుకే ఈ పన్నెండు రాశులు ఆమెలోనే ఉన్నాయి. అంతర్లీనంగా ఆలోచిస్తే అన్నమయ్య అమ్మవారికి-అయ్యవారికీ రాశి మైత్రి కుదిరిందని నిరూపిస్తున్నాడు. అమ్మవారిలో అన్ని రాశులూ ఉన్నాయి కాబట్టి స్వామి ఏ రాశిలో పుట్టినా (జననకాలంలో చంద్రుడు ఏ రాశిలో ఉంటే అది మన జన్మరాశి అవుతుంది) వారిద్దరికీ రాశిమైత్రి అద్భుతంగా కలుస్తుందన్నమాట. ఈ విధంగా ఈ సృష్టిలో ఇంకెవ్వరికీ జరగదు. అన్నమయ్య కేవలం ఆధ్యాత్మిక తత్వవేత్త మాత్రమే కాదు. పరిపూర్ణ శాస్త్రజ్ఞుడు.

“శ్రుతులై శాస్త్రములై పురాణకథలై సుజ్ఞానసారంబులై
యతిలోకాగమ వీధులై విపుల మంత్రార్థంబులై నీతులై
కృతులై వేంకటశైల వల్లభ రతిక్రీడా రహస్యంబులై
నుతులై తాళులపాక అన్నయవచోనూత్న క్రియల్ చెన్నగున్”

అని అన్నమయ్య మనవడు చిన తిరుమలాచార్యులు చెప్పినట్లు ఒక్కో అన్నమయ్య కీర్తన ఒక్కో కావ్యంతో సమానం. వేదసారం. పురాణ కథ. సుజ్ఞానసారం. మంత్రార్థం. సామాన్యుల స్తోత్రాలు. భజనలు. మాటలకందని నూత్న పద చిత్రాలు.

తాళ్లపాక కవుల్లో అన్నమయ్యతో సమానమయిన కవులు చాలామందే ఉన్నారు. స్వయంగా అన్నమయ్య భార్య గొప్ప కవయిత్రి. పెద్ద కొడుకు పెద తిరుమలాచార్యులు, ఆయన కొడుకు అంటే అన్నమయ్య మనవడు చిన తిరుమలాచార్యులు అనన్యసామాన్యమయిన కవులు. వీరి కీర్తనలు కూడా అన్నమయ్య కీర్తనలుగానే లోకంలో ప్రచారంలో ఉన్నాయి. తాళ్ళపాక వంశం వారు తెలుగు ప్రపంచానికి ఇచ్చిన సాహిత్యంలో మనకు దొరికి…మిగిలింది ఆవగింజంత. తాళపత్ర గ్రంథాల్లో కాలగర్భంలో కలిసిపోయింది సముద్రమంత.

ఉగాది రాగానే ఏ రాశి వారికి ఎలా ఉందో?మొత్తం లోకానికి ఎలా ఉందో? చెప్పే పంచాంగ శ్రవణం అనాదిగా వింటున్నాం. ఈరోజు కంటే రేపు, రేపటి కంటే ఎల్లుండి బాగుంటుందన్న ఆశతో, బాగుండాలన్న ప్రయత్నంతో బతుకుతూ ఉంటాం.

అన్నమయ్య పన్నెండు రాశులను సౌందర్యరాశి అలమేలు మంగలో ఆవిష్కరించి…చివరికి ఆ సౌందర్య రాశిని వెంకన్నలో కలిపేసి…అద్వైత సిద్ధిని సాధించాడు. ఆయన మనవడు అన్నట్లు అందుకే అవి- “వేంకట శైల వల్లభ రతిక్రీడా రహస్యాలు”.

మనల్ను మనం అద్దంలో చూసుకుంటే ఎంత అందంగా ఉంటాం? అలాంటిది మన రాశులేమిటి ఇలా…
మేష రాశి(మేక)
వృషభ రాశి(ఎద్దు)
మిథున రాశి
కర్కాటక రాశి(ఎండ్రకాయ)
సింహ రాశి
కన్యా రాశి
తులా రాశి(తక్కెడ)
వృశ్చిక రాశి(తేలు)
ధనస్సు రాశి(విల్లు)
మకర రాశి(మొసలి)
కుంభ రాశి(కుండ)
మీన రాశి(చేప)
రాశుల్లో ఉన్నాయి? ఎవరయినా ఈ పన్నెండు రాశుల్లో పుట్టి తీరాల్సిందే.

వీటి అసలయిన అర్థాలు, దేనికి ప్రతికలో కాస్త పక్కన పెట్టి…సరదాకు కొన్ని ప్రశ్నలు వేసుకుందాం.

మేక, ఎద్దు, ఎండ్రకాయ, తేలు రాశుల వారిలో మేకపోతు గాంభీర్యం, ఎద్దులా మొద్దుగా ఉండడం, ఎండ్రకాయ, తేళ్లలా కరవడం లాంటి ఏ దుర్లక్షణాలయినా చూడగలమా? లేదే!

ఎద్దు రాశి వారు మేకలా పీలగా ఉండవచ్చు. మేకరాశి వారు ఎద్దు కన్నా బలంగా ఉండవచ్చు. సింహ రాశి వారు గ్రామసింహాల్లా అన్నిటికీ భయపడవచ్చు. ఎండ్రకాయ, తేలు రాశి వారికి గోళ్లు గిల్లడం కూడా రాకపోవచ్చు. మొసలి రాశివారికి నీళ్లంటే చచ్చేంత భయం ఉండవచ్చు. తులారాశి వారు దేన్నీ సరిగ్గా కొలవలేక త్రాసు ఎటు మొగ్గుతోందో తెలియక గందరగోళంలో పడవచ్చు. మిధున రాశివారు పెళ్లి కుదరక ఇబ్బంది పడుతూ ఉండవచ్చు.

అయినా-
“ఇన్ని రాశుల ఉనికి
ఇంత చెలువపు రాశులే…”
అని మనం కూడా అన్నమయ్య స్ఫూర్తితో అన్ని రాశులను మన బతుకులో అడుగడుగునా ఎంతో కొంత ఆవిష్కరించుకుంటూ…అనుభవిస్తూ…ముందుకు కదలడమే తరుణోపాయం.

-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com  [    99890 90018   ]  

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • డ్రోన్ల యుద్ధమే కాదు… భీకరమైన సైబర్ యుద్ధానికీ దిగిన పాకిస్థాన్…
  • ఆట నుంచి క్రమేపీ దూరమవుతూ… ఆధ్యాత్మిక అంశాలకు దగ్గరగా…
  • ఓ చిన్న గుడి… కృష్ణా నదిలో ఓ ద్వీపంలో… పూర్తిగా చదవండి ఓసారి…
  • ఔరా అక్కినేనీ… నాసిరకం ఉత్పత్తుల్లో నువ్వూ తక్కువేమీ కాదు….
  • పాక్ పీచమణిచిన S-400 కాదు… దాని తాత S-500 కూడా వస్తుంది…
  • ఇది నిజంగా బాపు తీసిన పాటేనా..?! ఆమె అసలు ఆ జయప్రదేనా..?!
  • వేలాడదలుచుకోలేదు… క్లియర్ ప్లానింగ్… జస్ట్, అలా వదిలేశాడు…
  • మోడీజీ… అన్నీ బాగానే చెప్పావు… కానీ ఆ ఒక్క ప్రశ్నకు జవాబు..?!
  • ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!
  • నీకోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో… ఇదో వింత కథ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions