How Many Tirupathis: మనమేదయినా కొత్త తీర్థానికో, క్షేత్రానికో వెళితే అక్కడ ఎక్కడ ఉండాలో, ఎన్నాళ్ళుండాలో లెక్కలు వేసుకుని ఏర్పాట్లు చేసుకుంటాం. ఆ ఊరికి ఎప్పుడు బయలుదేరి ఎలా వెళ్లాలో ముందే నిర్ణయించు కుంటాం. అక్కడికెళ్లాక ప్రధానమయిన ప్రదేశాలేవీ వదిలేయకుండా చూడడానికి ప్రయత్నిస్తాం. తిరుమల- తిరుపతి క్షేత్రాలను వందల, వేల సార్లు చూసినవారు; అక్కడే పుట్టి పెరిగినవారు కూడా చెప్పలేనంత కచ్చితత్వంతో తన పదకవితలో బంధించాడు అన్నమయ్య.
పల్లవి:-
అదెచూడు తిరువేంకటాద్రి నాలుగు యుగము
లందు వెలుగొందీ ప్రభమీరగాను
చరణం-1
తగ నూటయిరువై యెనిమిది తిరుపతుల గల స్థానికులును చక్రవర్తిపీఠకమలములును
అగణితంబైన దేశాంత్రుల మఠంబులును నధికమై చెలువొందగాను
మిగులనున్నతములగుమేడలును మాడుగులు మితిలేనిదివ్యతపస్సులున్న గృహములును
వొగి నొరగు బెరుమాళ్ళ వునికిపట్టయి వెలయు దిగువ తిరుపతి గడవగాను
Ads
చరణం-2
పొదలి యరయోజనము పొడవునను బొలుపొంది
పదినొండు యోజనంబులపరపునను బరగి
చెదర కేవంకచూచిన మహాభూజములు
సింహశార్దూలములును
కదిసి సురవరులు కిన్నరులు కింపురుషులును
గరుడగంధర్వయక్షులును విద్యాధరులు
విదితమై విహరించు విశ్రాంతదేశముల
వేడుకలు దైవారగాను
చరణం-3
యెక్కువలకెక్కువై యెసగి వెలసినపెద్ద
యెక్కు డతిశయముగా నెక్కినంతటిమీద
అక్కజంబైన పల్లవరాయనిమటము
అల్లయేట్ల పేడ గడవన్
చక్కనేగుచు నవ్వచరి గడచి హరి దలచి
మ్రొక్కుచును మోకాళ్ళముడుగు గడచినమీద
నక్కడక్కడ వేంకటాద్రీశుసంపదలు
అంతంత గానరాగాను
చరణం-4
బుగులుకొనుపరిమళంబుల పూవుదోటలును
పొందైన నానావిధంబుల వనంబులును
నిగడి కిక్కిరిసి పండినమహావృక్షముల
నీడలను నిలిచి నిలిచి
గగనంబుదాకి శృంగార రసభరితమై
కనకమయమైన గోపురములను జెలువొంది
జగతీధరుని దివ్యసంపదలు గలనగరు
సరుగనను గానరాగాను
చరణం-5
ప్రాకటంబైన పాపవినాశనములోని
భరితమగు దురితములు పగిలి పారుచునుండ
ఆకాశగంగతోయములు సోకిన భవము
లంతంత వీడి పారగను
యీకడను గోనేట యతులు బాశుపతుల్ మును
లెన్న నగ్గలమైవున్న వైష్ణవులలో
యేకమై తిరువేంకటాద్రీశు డాదరిని
యేప్రొద్దు విహరించగాను
సాధారణంగా అన్నమయ్య కీర్తనలు ఒక పల్లవి; మూడు చరణాలతోనే ఉంటాయి. ఇది అయిదు చరణాల పెద్ద కీర్తన. పల్లవి ఎత్తుకోవడంలోనే నాలుగు యుగాలుగా వెలుగుతున్న వేంకటాద్రిగా తేల్చి చెప్పాడు.
ముందు దిగువన తిరుపతి వర్ణనతో మొదలు పెట్టాడు మొదటి చరణాన్ని. మనమిప్పుడు కొండ కింద చూస్తున్నది ఒక తిరుపతే. అన్నమయ్య 128 తిరుపతులు అని స్పష్టంగా చెబుతున్నాడు. అందులో పీఠాలు, ఆశ్రమాలు, తపస్సంపన్నుల ఇళ్లు, మేడలు ఉన్నాయి. ఇవన్నీ దాటుకుని తిరుమలకు వెళ్ళాలి.
ఒక యోజనం అంటే ఎనిమిది మైళ్ళ దూరం అని కొందరు, పదిన్నర మైళ్లు అని కొందరు అంటారు. దాదాపు ఆరు మైళ్ళ పొడవు, 115 మైళ్ళ వెడల్పుతో ఈ 128 తిరపతులు ఉన్నట్లు అనుకోవాలి. బహుశా తిరుమల కొండ భాగం కూడా ఈ వైశాల్యంలో ఉందో! లేక అన్నమయ్య కాలానికి కింద తిరుపతి విస్తీర్ణమే అంత పెద్దదిగా ఉండేదో! విద్యాధర కిన్నెర కింపురుష యక్షులతో ఉన్నట్లు అంటున్నాడు కాబట్టి పురాణ కాలం నాటి ప్రమాణాలేవో అయి ఉంటాయని కొందరి ఊహ. పల్లవిలో నాలుగు యుగాలుగా వెలుగుతున్న వేంకటాద్రి అని అన్నాడు కాబట్టి బహుశా ఈ లెక్కలు ఏ పురాణ ప్రమాణాలకు సంబంధించినవో అయి ఉండాలి. ఇవన్నీ దాటుకుని తిరుమల వెళ్ళాలి.
పల్లవరాయుని మంటపం, మోకాళ్ళ మంటపం దాటుకుని వెళ్ళాలి. పరిమళభరితమయిన పూల తోటలు, మహా వృక్షాలు దాటి వెళ్ళాలి. ఆకాశాన్ని తాకే గోపురాలు అల్లంత దూరాన కనపడుతుండగా నడిచి వెళ్ళాలి.
పాపవినాశనం దాటి వెళ్ళాలి. ఆకాశగంగను చూస్తూ వెళ్ళాలి. స్వామి పుష్కరిణిలో మునిగి వెళ్ళాలి. అప్పుడక్కడ వైష్ణవుల్లో ఒకడిగా తిరిగే వెంకన్నను పట్టుకోవాలి.
ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడికి తీసుకొచ్చాడో చూడండి అన్నమయ్య. నడిచిన దారిలో అన్నిటినీ ఫోటోలు తీసినట్లు, వీడియోలు తీసినట్లు, టేపులు పెట్టి కొలిచినట్లు ఎన్నెన్ని వర్ణాలు! ఎన్నెన్ని అందాలు! ఎన్నెన్ని పొడుగు- వెడల్పుల చదరపు లెక్కలు!
వేదాంత పరిభాషలో హంస, చిలుకలకు ఇతరేతర అర్థాలుంటాయి. యుక్తాయుక్త వివేచన ఉన్నది హంస. వైరాగ్యానికి ప్రతీక హంస. నీళ్ళల్లో తేలే స్వామి హంస వాహనాన్ని గొప్పగా ఆవిష్కరించాడు అన్నమయ్య ఇందులో.
పల్లవి:-
దిబ్బలు వెట్టుచు దేలిన దిదివో
ఉబ్బు నీటిపై నొక హంస
చరణం-1
అనువున గమల విహారమె నెలవై
ఒనరియున్న దిదె ఒక హంస
మనియెడి జీవుల మానస సరసుల
వునికి నున్న దిదె ఒక హంస
చరణం-2
పాలు నీరు నేర్పరచి పాలలో
నోలలాడె నిదె యొక హంస
పాలుపడిన యీ పరమహంసముల
ఓలి నున్న దిదె యొక హంస
చరణం-3
తడవి రోమరంధ్రంబుల గ్రుడ్ల
నుడుగక పొదిగీ నొక హంస
కడు వేడుక వేంకటగిరి మీదట
నొడలు పెంచెనిదె యొక హంస
ఆ తేలిపోతున్న హంస మన మనస్సరోవరాల్లోకి వస్తోందట. పాలను- నీళ్లను వేరు చేసే ఆ హంస పాలసముద్రంలో పవళిస్తోందట. అంటే విష్ణువు. పరమహంసల వైపు వెళ్ళింది ఈ హంస. గుడ్లు పెట్టకుండానే పిల్లలను పొదిగే ఈ హంస- వేంకటేశ్వరుడి రూపంలో తిరుమలలో ఏపుగా పెరిగి ఉంది.మన మనస్సీమల్లోకి వెంకన్నను హంసను చేసి తీసుకొచ్చాడు అన్నమయ్య.
ఈ కీర్తనలో ప్రత్యక్షంగా హంస వాహనాన్ని అన్నమయ్య ప్రస్తావించకపోయినా… స్వామినే హంసను చేసి మన దగ్గరికి తీసుకురావడంతో స్వామివారి హంస వాహనం ప్రస్తావనలో ఈ కీర్తనను పండితులు వర్ణిస్తూ ఉంటారు…. – పమిడికాల్వ మధుసూదన్ 9989090018
Share this Article