అనేక రకాల టీవీ షోలలో, ఓటీటీ షోలలో అట్టర్ ఫ్లాప్ షోలు ఏమిటో తెలుసా..? మాస్టర్ చెఫ్ వంటి వంటలపోటీల షోలు… కానీ యూట్యూబ్‌లో మాత్రం వంటల పోటీల వీడియోలు సూపర్ హిట్… మనం గతంలో కూడా చెప్పుకున్నాం, పచ్చిపులుసు కాయడం ఎలా అనే వీడియోకు కూడా ఒకటీరెండు మిలియన్ల వ్యూస్… మన దేశంలో ఇలాంటి వీడియోల్లో, అంటే స్ట్రీట్ ఫుడ్, హోటల్ టూర్స్ వీడియోల్లో షార్ట్ వీడియోస్ దగ్గర నుంచి లెంతీ వీడియోస్ దాకా… అన్నీ హిట్లే… దోశెలు, బిర్యానీల వీడియోలు టాప్…
ఆ వీడియోలు చేసేవాళ్లకు కూడా డబ్బే డబ్బు… కానీ సినిమాలు, టీవీ షోలలో మాత్రం జనం ఇష్టపడరు అదేమిటో… వాళ్లకు టీవీ షోలలో వేరే ఎమోషన్ కావాలి… అందుకే ఆవకాయ్ బిర్యానీ వంటి ఫుడ్ సెంట్రిక్ సినిమాలు కూడా ఫ్లాప్… సరే, ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే… అచ్చం వంటల పోటీల మీద ఏకంగా నయనతార వంటి సూపర్ స్టార్ ఓ సినిమా తీయడం… దాని పేరు అన్నపూర్ణి… (అన్నపూర్ణ అన్నా ఫిమేల్ పేరే కదా, ఈ అన్నపూర్ణి ఏమిటో…)
నిజానికి అది తమిళంలో తీశారు… తెలుగు వెర్షన్ ఓటీటీలో (నెట్‌ఫ్లిక్స్) పెట్టారు… నిజంగా ఆశ్చర్యం, నయనతార వంటి హైలీ పెయిడ్ టాప్ స్టార్ తీసిన సినిమాయేనా ఇది..? హీరోయిన్ ప్రాధాన్యం సరే, కానీ జనం అభి‘రుచి’ మాటేమిటి..? పూర్ టేకింగ్, పెద్దగా ఉత్కంఠ కలిగించని ప్రజెంటేషన్… ఫ్లాట్ నెరేషన్… నిజం చెప్పాలంటే కథ, కథనం గట్రా అన్నీ అదేదో ఓటీటీలో వచ్చిన మాస్టర్ చెఫ్ షో చూస్తున్నట్టే ఉంటుంది… ఈమాత్రం దానికి అంతటి నయనతార అవసరమా..? ఏ స్త్రీముఖి అయినా, అనసూయాంటీ అయినా సరిపోతుంది కదా…
Ads
అది తమిళనాడు… రంగనాథుడికి సేవలు చేసే పూజారి రంగరాజన్, ఆయన చేసే నైవేద్యాలు బిడ్డకు ఇష్టం… తనకూ వంట నేర్చుకోవాలని అభిలాష… అదలాగే పెరిగీ పెరిగీ చెఫ్ అవుతానని పోరుతుంది ఇంట్లో… నథింగ్ డూయింగ్, మనం ఎక్కడో వంట మనుషులం కావడం ఏమిటని తండ్రి కోపగిస్తాడు… ఠాట్ వీల్లేదంటాడు… తమిళ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం స్పందన అలాగే ఉంటుంది కదా, సహజం… ఎంబీఏ చేయాలనీ, లేదంటే పెళ్లి చేసేస్తాననీ అంటాడు…
ఆమె ఎంబీఏ కమ్ చెఫ్ కోర్స్ కలిసి ఉన్నదేదో వెతుక్కుని కాలేజీలో జాయినవుతుంది… అది నాన్నకు తెలుస్తుంది… ఈ తలతిక్క చదువు చాలు, పెళ్లి చేస్తానంటూ ఓ సంబంధం తెస్తాడు… తరువాత ఈమె ఏం చేసింది..? అదీ కథ… ఒక్కటి మాత్రం మెచ్చుకోవచ్చు… ఓటీటీ సరుకు అనగానే మనకు అశ్లీలం, హింస, వెగటుతనం గుర్తొస్తాయి కదా, నో, ఈ సినిమా నీట్‌గా, పద్ధతిగా ఘుమఘుమ వాసనలతోనే సాగుతుంది… కాకపోతే ఇద్దరు చెఫ్ ల మధ్య జరిగే పోటీని మరీ రణరంగంలో ఇద్దరు శత్రువుల మధ్య జరిగే యుద్ధంలా చూపించాడు దర్శకుడు… ఆ సీన్లలో వచ్చే బీజిఎమ్ బాగుంది…
నవ్వొచ్చేది ఏమిటంటే… ఇలాంటి పోరాటాల్లో గెలుపు వైపు కథానాయకుడు లేదా కథానాయిక వెళ్లాలి, సహకరించే శక్తులు ఉంటాయి… కానీ అవకాశాలే నయనతారను వెతుక్కుంటూ వస్తాయి… దాంతో ఆ కాస్త థ్రిల్ కూడా పోతుంది… పైగా లాజిక్‌లెస్ కొన్ని… మరీ జోక్ ఏమిటంటే..? రుచి చూడకుండా గెస్ చేసి వంట రుచిని జడ్జ్ చేయడం… అసలు వంట నాణ్యతను కొలిచేదే లుక్కు, గార్నిషింగ్, ఫ్లేవర్, టేస్ట్, ప్రిపరేషన్ మెథడ్స్ ఆధారంగా…
నటీనటుల్లో చెఫ్‌గా సత్యరాజ్, అన్నపూర్ణిగా నయనతార… వాళ్ల నటనకు వంక పెట్టడానికి ఏముంటుంది..? ఈ అల్లాటప్పా పాత్రల్ని కాఫీ తాగినంత వీజీగా చేసిపడేశారు… ఇదేమైనా చికెన్ దమ్ బిర్యానీ చేయడమా..? అంత బలమైన పాత్రలేమీ కావు… ఐనాసరే, మాకు వంటల పోటీలు ఇష్టం, మేం మాస్టర్ చెఫ్ షోను కూడా రెగ్యులర్‌గా చూసేవాళ్లం అనేవాళ్లు ఎవరైనా ఉన్నారా..? ఎస్, ఈ సినిమా మీకోసమే… ఎంజాయ్… బ్రేవ్…!!
అవునూ, ముస్లిం వస్త్రధారణలో.., అదీ ముందుగా నమాజ్ చేసి, బిర్యానీ చేస్తే దాని రుచి అదిరిపోతుందా..? ఇదెక్కడి లాజిక్కు..? ఈ సినిమాలో హీరోయిన్‌ను గెలిపించేది సరిగ్గా ఈ సూత్రమే… హేమిటో… కనీసం సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడైనా ఈ సీన్లలోని అసంబద్ధత నయనతారకు తెలియలేదా..? అందుకే దీన్ని దిక్కుమాలిన సినిమా అంటూ సంప్రదాయవాదులు తెగతిట్టేస్తున్నారు సినిమాను… ఈలెక్కన దద్యోదనం, పులిహోర అదిరిపోవాలంటే అగ్రహారం ఆహార్యం ధరించాలా..?!
అవునూ, ఎప్పుడైనా యూట్యూబ్‌లో విస్మయ్ ఫుడ్స్ వీడియోలు చూశారా..? తనకు నాన్ వెజ్ వంటలు తెలియవు, కానీ ఆ డిషెస్ వీడియోలు మాత్రం అదిరిపోతాయి… అది ప్రొఫెషన్… వంటకు ఏం కావాలో తెలుసుకుని, వంట నేర్చుకుని, ప్రేక్షకుల కోసం పలువురి సాయంతో వండిస్తాడు, వండుతాడు… ఇక్కడేమో మతానికీ వంటలకూ ముడిపెట్టిన ఏకైక సినిమా ఇదే కావచ్చు బహుశా…
అవునూ, కూతురి వర్ణసంకరానికి తండ్రి నైవేద్యం నివేదిక కొలువు ఊడుతుందా..? ఐనా సరే, వంటల పోటీలో గెలవగానే తన జన్మధన్యం అయినట్టు ఫీలవుతాడు ఫాఫం ఆ పూర్ తండ్రి…!!
Share this Article