Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ గుడి మెట్లు… నాటి చంద్రమోహన్, రాజ్యలక్ష్మి సీన్లు… స్మృతులు…

January 29, 2025 by M S R

.

రెండు రోజులు శెలవులు కదా… ఎక్కడికైనా వెళ్దామా అని ఉదయం ఏడు గంటలైనా తగ్గని చిక్కటి పొగమంచులో వేడి వేడి టీ గ్లాసు పట్టుకొని మిద్దె మీద తోటలో ఏవో పాదులు సరిచేస్తున్న శ్రీమతితో అంటే… ఇక్కడే సిమ్లా, శ్రీనగర్ లా ఉంది ఇంకెక్కడికెళ్తాం అంటూ నవ్వింది…

సరే, ఈ రోజు వద్దులే రేపుదయాన్నే లేచి అన్నవరం వెళ్దామా చిన్నప్పుడెప్పుడో మా డాడీ మమ్మల్ని తీసుకెళ్ళారు.. ఆపై మళ్లీ వెళ్ళలేదు.. అయినా నీవూ వెళ్ళలేదు కదా ఎప్పుడూ అనగానే… ఒక్కసారిగా ఏదో ఉత్సాహం.. దగ్గరే ఉన్నా ఎన్నోసార్లు అనుకున్నా ఎందుకో ఎప్పుడూ వీలుకాలేదు.. దగ్గరే కదా ఎప్పుడైనా వెళ్ళచ్చు అన్న భావమేమో కూడా…

Ads

ఆ ఊరి మీదగా ఆ కొండ పక్కగా ఎన్నిసార్లు రైలులో బస్సులో ప్రయాణాలు చేశానో! ఎన్నిసార్లు కిటికీ అద్దాలు తెరిచి దండమెట్టుకుంటూ వెళ్ళిపోయానో!

అప్పుడెప్పుడో చిన్నపుడు తెలిసీ తెలియని వయసులో చూసిన శంకరాభరణం మెట్ల మీద మరచెంబు పట్టుకున్న చంద్రమోహన్ చేజారిన గ్లాసు రాజ్యలక్ష్మిని చేరిన శబ్దం- అతడి గుండెలో గజ్జెలా మోగినప్పుడు అక్కడికి వెళ్ళాలని తొలిసారి అనుకున్న పయనమది.

ఆపై నువ్వే నువ్వే అంటూ శ్రియను చూడ్డానికి తరుణ్ వెళ్లినప్పుడు త్రివిక్రమ్ రాసిన మాటలు విని ఇంతవరకూ వెళ్ళలేదే అనుకున్నప్పటి పయనమది… అనుకుంటుంటే మాటల్లో పక్కింటి వారు మేమూ వస్తామంటే.. సరే అన్నాం.

మర్నాడు ఉదయాన్నే నాలుగు గంటలకి విజయనగరం నుండి జన్మభూమి ఎక్స్‌ప్రెస్ లింక్ బస్సు పట్టుకొని వైజాగ్ వెళ్ళి ట్రైన్ లో కూర్చుంటే… మైదాన ప్రాంతంలో వెళ్తున్న రైలు ఏ ఉత్తర భారత కొండల్లోనో వెళ్తున్నట్లున్న పొగ మంచును చూసి మా పక్కింటి ఇద్దరు పిల్లలూ ఒకటే కేరింతలు.

వాళ్ళ అమ్మా నాన్నా కబుర్లు చెప్పుకుంటుంటే నా శ్రీమతి పిల్లలకు తెలుగులో ఉన్న ఊరి పేర్లు చదవమంటూ… కూడబలుక్కుని చదివిన ఆ ఒకటో తరగతి పిల్లని మెచ్చుకుంటోంది..

అనకాపల్లి దాటగానే వచ్చిన చిన్న నదిని ఇది తెలుసా అని ఆ పెద్దమ్మాయిని అడిగితే తెలియదంకుల్ అంది. పిల్లలకు ప్రయాణాలు ఆనంద హేతువులు, తరువాత విజ్ఞాన వేదికలు అవ్వాలంటే కిటికీ బయట అన్నీ చూపిస్తూ చెప్పాలన్న స్పృహ లేని వాళ్ళ అమ్మా నాన్న వైపు అలా చూస్తూ.. ఈ చిన్న నది పేరు శారద… అంటే ఓహో అందా అమ్మాయి.

శారదా నది. బాల్యంలో ఈ నీరు తాగే సీతారామశాస్త్రిలో కవితాత్మక భావాలు రూపుదిద్దుకొని ఉంటాయి. ఈ ఊరి గాలే ఆ తరువాతెప్పుడో… ఈ గాలీ ఈ నేలా, ఈ ఊరూ, సెలయేరూ అని రాయించి ఉంటుంది.

తను నడిచిన ఈ నేలే – నేల విడిచి సాము చేయకని వేవేల పాటల్లో జీవన గమనాన్ని , గమ్యాన్ని బతుకు సౌందర్యాన్ని మనందరికీ తెలియజేసుంటుంది అనుకుంటూ … నావైన ఆలోచనల్లో ఉంటే ఈ లోగా వరాహా నదిని దాటుతూ ఆ పేరూ పిల్లలకు చెప్తుంటే.. నీవు వీళ్ళకు గైడ్ వా అంటూ ఈమె నవ్వింది.

ఆపై పది నిముషాల్లో అన్నవరం స్టేషన్ లో దిగి కొండ మీదకు దేవస్థానం బస్సులో 20 నిముషాల్లో చేరుకుంటే ఏదో ఆహ్లాద భావం… టిఫిన్ తిని సంప్రదాయ దుస్తులు పంచెలు కట్టుకొని దర్శనానికి బయలుదేరామా….
ఏమాత్రం రద్దీ లేని వాతావరణం చూసి ఒకటే ఆనందం. అదేంటి ఇంత ఖాళీ అంటే ఓ షాపతను నవ్వుతూ, నిన్న రావాల్సింది దేవుడు మీకు గుడి బయటే కనిపించేవాడు అని అన్నాడు.

ముందు రోజు ఏదో పండగట. విపరీతమైన రద్దీ అట. హమ్మయ్య అనుకుని …. సరదాగా నడుచుకుంటూ దర్శనానికి వెళ్ళి.. గుడిలో సత్యదేవుడిని కళ్ళారా చూసి నలభై యేళ్ళ నాటి మాట ఏదో తనకు చెప్పి బయటకొచ్చి చుట్టుపక్కల తిరుగుతుంటే గుండె కలుక్కుమన్నట్లు ఎటు చూసినా రకరకాల రుసుము బోర్డులు.. ధరను బట్టి పుణ్యాన్ని నిర్ణయించే పట్టికలు.. వ్యయాన్ని బట్టి వివాహాలు దేవుడి సమక్షంలో కూడానా అనుకుంటుంటే ఏదో తెలియని వెత.

మన ధర్మాన్ని భక్తిని మనమే క్యాష్ చేసుకుంటున్నామా.. మన దైవభక్తికి మనమే ధర నిర్ణయిస్తున్నామా.. ఇదంతా రద్దీ నియంత్రణకో లేక ఇంకేదో కారణానికో అనుకుంటే… ఎంతకీ దొరకని లాజిక్ తో దూరంగా కనిపించే పంపా జలాశయాన్ని చూస్తూ కాసేపు ఆ చల్లని చెట్టుకింద కూర్చుంటే ఓ హాయైన భావన.

గోశాలలో భక్తులు పెట్టే పచ్చగడ్డి తింటున్న ఆవుల్ని, చెట్లపై కొమ్మ కొమ్మకీ గెంతుతున్న కోతుల్ని చూస్తూ పిల్లలు హాయిగా నవ్వుతుంటే ..
మనమెందుకబ్బా ఇంత వేగంగా పెద్దవారమైపోయామన్న ఓ సరదా ఆలోచన.
ఆపై ప్రసాదాలు తింటూ మెట్ల మార్గం వైపు నడుస్తుంటే… అలిసిపోయిన నిర్మలమ్మ,
నీరు పోసిన చంద్రమోహన్, సిగ్గుపడిన రాజ్యలక్ష్మిలతో పాటు..

విల్లంబులు చేతబట్టి… కాషాయపు పంచె చుట్టి ఓ వందేళ్ళ క్రితం బ్రిటిష్ వారిని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు దైవదర్శనానికి ఇక్కడికొచ్చినప్పుడు ఆనాటి ప్రజలు తననే దైవంగా కొలవడం, తను వారిలో, పోరాటస్పూర్తి నింపిన చిన్నప్పటి చదువుకున్న దృశ్యం కళ్ళ ముందు మెదలగానే- ఈ రత్నగిరి ఎంత మంది రత్నాలను చూసిందో…

ఎన్ని ఆశలకు, కలలకు ప్రాణాలు పోసిందో…
ఎందరి మనోభీష్టాలను నవ్వుతూ నెరవేర్చిందోననుకుంటూ…. చివరి మెట్టు దగ్గర మళ్ళీ బొట్టు పెట్టుకుంటూ… గుండె నిండా భక్తితో ఆ భక్తిభావ ప్రపంచం నుండి రోడ్డు మీద అడుగు పెట్టగానే… మళ్ళీ రణగొణ ధ్వనుల నా పాత ప్రపంచం నను పలకరించింది.

-కిలపర్తి త్రినాథ్
9440886844

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions