రజినీకాంత్ రాజకీయ వైరాగ్యం మీద రకరకాల విశ్లేషణలు వస్తూనే ఉంటయ్… జోకులు పేలుతూనే ఉంటయ్… కోట్ల మంది అభిమానులు నిరాశపడొచ్చు… ఈలోపు హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ మీద ఊహాగానాలు నడుస్తూ ఉంటయ్… కమల్‌హాసన్ ఫ్యాన్స్ లోలోపల ఆనందించవచ్చు… కానీ అనేక ఏళ్లుగా ఒకడుగు ముందుకు, పది అడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతున్న రజినీకాంత్ ‘‘రోబో’’ సినిమాలో చిట్టి తనంతటతానే డిస్మెంటల్ అయిపోయినట్టుగా…. ఓ భారీ సినిమాకు కొబ్బరికాయ కొట్టకముందే గుమ్మడికాయ ఎందుకు కొట్టాడు..?
( కార్టూనిస్ట్ మృత్యుంజయ్ వేసిన బొమ్మ సరిగ్గా ఆప్ట్…)
బీపీ ఫ్లక్చువేషన్స్తో అపోలోలో చేరాడు అనేది ఎవడూ నమ్మడు… తను ఇప్పటికే రెండుమూడుసార్లు తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు… కిడ్నీ సమస్యలున్నయ్… ఏజ్ బార్… రాష్ట్రమంతా తిరిగే సీన్ లేదు, అంత టైమూ లేదు… అసలు తను రాజకీయాలకు పనికొస్తాడా..? హఠాత్తుగా తను ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు..?
Ads
జనవరిలో పార్టీ పెడతాను, అద్భుతాన్ని మీరు చూస్తారు అంటూ శంకర్ సినిమాలోని పంచ్ డైలాగ్ ఒకటి విసిరాడు… అభిమాన సంఘాల్ని పిలిచి మీటింగులు పెట్టుకున్నాడు… మరి ఈ కసరత్తుకు ముందే అన్నీ ఆలోచించాలి కదా అంటారా..? కాదు… తనకు ఆసక్తి ఉంది… ఏదో అదృశ్యశక్తి పగ్గాలు వేసి, వెనక్కి పంపించేసింది… ఎవరు వాళ్లు..? అపోలోలో చేరాక తనను ఎవరెవరు కలిశారు..? ఆ ప్రతాపరెడ్డికి తప్ప ఇంకెవరికీ తెలియదు… ఆయన ఎవరికీ చెప్పడు… జయలలిత మరణం ఇప్పటికీ మిస్టరీయే కదా…
నిజానికి రజినీకాంత్‌కు మంచి స్కోప్ ఉండేది… ఎప్పుడు..? జయలలిత, కరుణానిధి వెళ్లిపోయాక… వెంటనే రాజకీయాల్లోకి వచ్చి, రాష్ట్రమంతా తిరుగుతూ, జనంలో ఉంటూ, ప్రజల సమస్యలకు స్పందిస్తుంటే బాగుండేది… ఇన్నేళ్లుగా ఇదే తంతు, ముందుకు రాడు, వెనక్కి పోడు… తీరా టైంకు వచ్చి, టికెట్లు ఇచ్చేసి, జనానికి అప్పీల్ చేసేస్తే… జనం వోట్లు విరివిగా గుద్దిపడేసి సీఎం కుర్చీలో కూర్చోబెడతారనుకునే రోజులు కావు ఇవి…
ఎన్టీయార్, ఎమ్జీయార్, జయలలిత, కరుణానిధిల కథ వేరు… వాళ్లకు అనుకూలించిన పరిస్థితులు వేరు… పోనీ, వాళ్లిద్దరూ వెళ్లిపోయాక ఏర్పడిన పొలిటికల్ స్పేసులోకి ఎంట్రీ ఇచ్చాడా..? ఆ టైమింగూ లేదు… పైగా ఇప్పుడు సినిమా నటులకు ప్రజలు వోట్ల నీరాజనాలు పలికే కాలం పోయింది… చిరంజీవి ప్రజారాజ్యం కథ చూశాం, పవన్ కల్యాణ్ అనుభవాలు చూశాం… కమల్ హాసన్ తంటాలు చూస్తున్నాం… వాళ్ల కృత్రిమ స్వర్గాల నుంచి వాళ్లు బయటపడని దేవుళ్లు…
పోనీ, ఆ అనుభవాలు చూసైనా, కిమ్మనకుండా ఉండాల్సింది… కానీ మనసులో ఆశ ఊరుకోనివ్వదు… నిజానికి బీజేపీకి రజినీకాంత్‌ను వాడుకోవాలని ఉండేది… తెర వెనుక దోస్తీ బాగానే ఉంది… కానీ తాము ఆశించినంత ఫైర్, స్పీడ్, డేర్ రజినీలో లేవని త్వరగానే ఢిల్లీ బీజేపీకి తెలిసొచ్చింది… ఆధ్యాత్మిక రాజకీయాలు అంటాడు, అసలు కదలడు…ఈరోజుకు షూటింగులే తప్ప పాలిటిక్స్ మీద కదలికల్లేవు మనిషిలో… రాజకీయాల్లో ఊగిసలాటలు పనికిరావు…
ఒకవైపు స్టాలిన్ బలోపేతమై ఉన్నాడు… ప్రజల యాక్సెప్టెన్సీ కూడా లభించింది తనకు… మొన్నటి ఎన్నికల్లో మంచి ఫలితాలే సాధించాడు… పళనిస్వామి, పన్నీర్ సెల్వం అన్నాడీఎంకేను ఏమీ ఉద్దరించేది లేదు… పరిస్థితులన్నీ స్టాలిన్‌కు అనుకూలంగా ఉన్నయ్… వాస్తవానికి స్టాలిన్ బీజేపీ వర్గాలతో కూడా మంచి సంబంధాలు మెయింటెయిన్ చేస్తున్నాడు… రేప్పొద్దున పరిస్థితులు డిమాండ్ చేస్తే తను యూపీయేను వదిలేసి, ఎన్డీఏతో దోస్తీ చేయగలడు… కరుణానిధి గతంలో చేసిన పనే…
యాంటీ స్టాలిన్ వోటు భీకరంగా చీలనుంది… అన్నాడీఎంకే, శశికళ, కమల్ హాసన్… రజినీ రంగప్రవేశం చేస్తే ఆ వోట్లు కూడా… ఈ స్థితిలో ఎవరేం చెప్పారో… ఎందుకు పగ్గాలు వేశారో ఇంకా వివరంగా తేలాల్సి ఉంది… కానీ తనిక రాజకీయాలు అనే మాట మాట్లాడినా జనం నమ్మరు… అయిపోయింది… రెండుమూడేళ్ల క్రితం సరైన నిర్ణయం తీసుకుని, వేగంగా అడుగులు వేసి ఉంటే, ఈరోజు స్టాలిన్‌కు దీటుగా నిలబడి ఉండేవాడు…
నిజానికి తన గ్రహపరిస్థితి కూడా తనకు ఏమంత ఆశాజనకం కాదు… అస్ట్రో గురు వేణుస్వామి ఓ వీడియోలో చెప్పింది కూడా ఇదే… venu swamy prediction on rajnikanth….. సో.., ఆరోగ్యం లేదు, జాతకసహకారం లేదు, తత్వం సరిపోదు, ఫలితాలపై నమ్మకమూ లేదు… వెనుక నిలబడాల్సిన అదృశ్య శక్తులు సమయానికి వదిలేశాయి… దాంతో తర్జనభర్జనలు పడి… ఇక ఓ పేద్ద దండం పెట్టేశాడు… శుభం… ప్యాకప్…!!
Share this Article