.
తలవంచలేదు… తలెత్తుకుని తిరిగొచ్చింది! ‘అనోమీ’లో భావన ప్రయాణమే అసలు కథ! … ప్రైమ్‌లో ఉంది ఈ సినిమా… మామూలుగా క్రైమ్ థ్రిల్లర్ జానర్ అంటే మలయాళీ దర్శకులు రెచ్చిపోతారు కదా… దీన్ని చూస్తుంటే మరికొన్ని విశేషాలూ ఓసారి చెప్పుకోవాలి…
భావన గురించి…! కొన్ని గాయాలు శరీరంపై కనిపించవు… కానీ జీవితాన్ని మొత్తం మార్చేస్తాయి. 2017లో జరిగిన దారుణ ఘటన తర్వాత భావన కెరీర్ ముగిసిపోయిందని చాలామంది అనుకున్నారు. కానీ ఆమె ఓడిపోలేదు. కొంతకాలం వెనక్కి తగ్గినా, మళ్లీ అదే మలయాళ సినీ పరిశ్రమలో తలెత్తుకుని నిలబడింది.
Ads
ఆ ఘటన తర్వాత భావనకు బహిరంగంగా మద్దతుగా నిలిచిన మలయాళ సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు, ఆమె తిరిగి సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా ప్రోత్సాహం అందించారు. ‘అనోమీ’ ఆ ప్రయాణంలో మరో ముఖ్యమైన అడుగు… మరోసారి హీరోయిన్‌గా ఆదరించింది… (నిజంగా టాలీవుడ్ అయితే ఇలా ఆమెకు అండగా నిలబడేదా..? పే-ద్ద ప్రశ్న… మాలీవుడ్ ఇలాంటి విషయాల్లోనూ ఆదర్శమే…)
ఈ సినిమాలో మరో విశేషం… ఒకప్పుడు మలయాళంలో సూపర్ హిట్ కాంబినేషన్‌గా నిలిచిన భావన–రెహమాన్ జోడీ మళ్లీ కనిపించడం. రెహమాన్ పోషించిన ACP గిబ్రాన్ పాత్ర, భావన పోషించిన జారా పాత్రతో కలిసి కథను ముందుకు నడిపిస్తుంది. పాత ప్రేక్షకులకు ఇది ఒక మంచి నాస్టాల్జియా అనిపిస్తుంది కూడా.

సినిమా విషయానికి వస్తే… ఇది మాస్ ఎంటర్‌టైనర్ కాదు. ఒక యువకుడి అదృశ్యం చుట్టూ తిరిగే సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్. పోలీసులు ఒక వైపు విచారణ చేస్తుంటే, తన సోదరుడికి ఏమైందో తెలుసుకోవాలనే తపనతో జారా మరోవైపు నిజాన్ని వెతుకుతుంది. ఈ రెండు దారులు చివరికి ఒకే నిజం దగ్గర కలుస్తాయి.
కథలో కొన్ని ట్విస్టులు ఆసక్తికరంగా ఉన్నా, స్క్రీన్‌ప్లే మాత్రం ప్రతిచోటా అదే స్థాయిలో బిగుతుగా ఉండదు. అందుకే మలయాళ సినిమా సమీక్షకులు కూడా కథను, కథన ఆలోచనను మెచ్చుకుంటూనే, ఎగ్జిక్యూషన్‌పై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
అయితే ‘అనోమీ’ని కేవలం కథ కోసం మాత్రమే చూడాల్సిన సినిమా కాదు. భావన కోసం కూడా చూడొచ్చు. ఆమె నటనలో కనిపించే నిగ్రహం, ఆత్మవిశ్వాసం, కళ్లలో కనిపించే బాధ– బలం… ఇవన్నీ పాత్రకు అదనపు బలం తెచ్చాయి. అందుకే చాలా సమీక్షల్లో కూడా సినిమా కంటే భావన నటనకే ఎక్కువ ప్రశంసలు దక్కాయి.
‘అనోమీ’ పరిపూర్ణ క్రైమ్ థ్రిల్లర్ కాకపోవచ్చు. కానీ ఈ సినిమా చూస్తున్నంతసేపూ తెరపై కనిపించేది కేవలం జారా పాత్ర కాదు… ఎన్నో అవమానాలు, ఆరోపణలు, ఒత్తిళ్లను తట్టుకుని మళ్లీ కెమెరా ముందుకొచ్చిన భావన కూడా. అందుకే ‘అనోమీ’లో అసలు విజేత సినిమా కాదు… భావనే.
- కార్తీక మేనన్‌గా పుట్టి, ‘భావన’గా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిన ఈ నటి… జీవితంలో ఎదురైన అత్యంత భయంకరమైన సంఘటన తర్వాత కూడా తలవంచకుండా మళ్లీ కెమెరా ముందుకు రావడమే ఆమె అసలైన విజయం.
Share this Article