.
“పెళ్ళాం మాట వింటే ఎట్టుంటాదో ప్రపంచానికి చూపిస్తా”, “నా మొగుడు దేవుడు, ఎందరో నా మొగుడి పేరు చెప్పుకుని బతుకుతున్నారు, నా మొగుడిని ఒక్క మాటంటే ఊరుకోను”…ఇలా ఒకర్నొకరు బహిరంగంగా భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటే కుటుంబాలలో బంధాలు ఎంత బలంగా ఉంటాయి.
“ఎన్ని అనుకున్నా మనం ఒక కుటుంబం, ఒకరికి కష్టం వస్తే ఇంకొకరు ఆదుకోవాలి”, “అన్నయ్య పిలిస్తే వస్తాడు”, “ఇంట్లో పెళ్ళి పత్రిక కుటుంబంలో పెద్దావిడ పేరు మీద వేయించడం, అదీ రెండు కుటుంబాల మధ్య రాకపోకలు లేకపోయినా”….
Ads
ఇలాంటి డైలాగ్స్ ఏదో బీ నాగిరెడ్డి, విజయా వారి సినిమాలోనో, 60 లు, 70 ల కాలం ఆర్టిస్టులో పలికేవి కావు. బంధాలు పీలికలై, ప్రేమ పేరుతో చేసుకున్న పెళ్ళిళ్ళలో కూడా కొంత కాలానికే విడాకులు, చిన్న చిన్న గొడవలతో శాశ్వతంగా సంబంధాలు తెంచేసుకోవడం మామూలై పోయిన కాలంలో…అన్ని సంబంధాలూ ఆర్ధిక సంబంధాలే అని మార్క్స్ లేదా అయాన్ రాండ్ బోధలు పూర్తిగా పాటిస్తున్న కాలంలో వినడానికి వింతగా, ఈ జనరేషన్ ఇవి ఆమోదిస్తారా అని అనుమానపడే భావాలు ఒక సినిమాలో కనిపిస్తే ఆశ్చర్యపడాలి మరి. ఎంత ధైర్యం!
నిజమే. 2024 చివర్లో వచ్చిన పుష్ప- 2 లో కుటుంబ బంధాలు ఎంత బలంగా ఉండాలో, ఉంటే ఎంత బాగుంటుందో, పెళ్ళి అంటూ చేసుకున్నాక ఆ దంపతులు ఒకరి మనసు ఒకరు తెలుసుకుని మసులుకుంటే, అత్తింటి వారిని కోడలు ‘తన’ అనుకుంటే ఎంత బాగుంటుందో చూపించారు. ఇదంతా పుష్పలో ఉందా, జనం చూస్తున్నారా అంటే చూస్తున్నారు.
ముఖ్యంగా కుటుంబ బంధాల, దంపతుల మధ్య సన్నివేశాలు వచ్చినప్పుడు కళ్ళప్పగించి చూస్తున్నారు. యువత చూస్తున్నారు. బాక్సాఫీస్ వసూళ్లు డబ్బు సంగతెలా ఉన్నా, హాళ్లకు వచ్చి చూస్తున్న జనాన్ని లెక్క చూపిస్తున్నాయి. నమ్మాలి మరి. కమర్షియల్ ఫార్మాట్ లో వచ్చే సినిమాల వల్ల లాభం ఇది. అది – ఎక్కువ మందికి మెసేజ్ చేరడం. రీచ్ అంటారు ఇంగ్లీష్ లో.
అవార్డు సినిమాలు, క్లాస్ సినిమాలు, రియలిస్టిక్ సినిమాలు, వాస్తవాలకి దగ్గరగా ఉండే సినిమాలు తీస్తారని చెప్పుకునే తమిళ, మలయాళ, బెంగాలీ సినిమాలకి లేనిది – రీచ్. ఒక సందేశం ఎంత గొప్పదైనా అది సామాన్య జనానికి చేరకపోతే వృధాయే. నిస్సందేహంగా పుష్ప సాధించిన విజయం ఇది.
ఒక నేరస్థుడి కథని హైలైట్ చేశారన్నది ఈ సినిమా మీద విమర్శ. నిజమే. అయితే ఇందులో ఒక నేరస్తుడి జీవితమే కాదు, ప్రజలకి సేవ చేయాల్సిన బాధ్యతలో ఉండి, అవినీతికి తప్పుడు మార్గాలకి అలవాటు పడి ప్రజల సొమ్ముని దోచుకునే వ్యవస్థలకి ప్రతినిధులు – షెకావత్, సిద్దప్ప, ప్రతాప రెడ్డిలని కూడా చూపించారు.
ఒక దశలో “నా దగ్గర అడుక్కునే నీకు మర్యాద ఇచ్చేకన్నా, నిజాయితీగా ఉండే డీఎస్పీ గోవిందప్పకి సెల్యూట్ చేస్తా” అని పుష్ప ఐపీఎస్ షెకావత్ కి చెప్పడం ఎంత గొప్ప సన్నివేశం. నేరస్థుడు అని మొహమాటం లేకుండా చెప్పుకునే వాడు కూడా అసహ్యించుకునే లోతుకి మన అధికార యంత్రాంగం, నేతలు జారిపోయారు మరి. సర్వీస్ గ్యారంటీ, పెన్షన్ సౌకర్యాలు ఉన్నా కక్కుర్తిపడి ప్రజల సొమ్ము దోచుకుంటున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకి చెంప పెట్టు లాంటి మాటలు అవి.
“ఆడపిల్లకి రక్షణ కల్పించలేని తొక్కలో సీఎం… ఉంటే ఎంత పోతే ఎంత “ అని ఆ నేరస్థుడే అసహ్యించుకునే డైలాగ్స్ సుకుమార్ తప్ప ఈ దేశంలో ఎవరు రాయగలరు? రాసినా, ఎక్కువ మందికి (లక్షల మందికి, కొన్ని రోజుల్లో కోట్ల మందికి) చేర్చగలిగే నేర్పు ప్రస్తుతం ఎవరికి ఉంది?
భారీ బడ్జెట్ సినిమా అంటే కేవలం కంప్యూటర్ గ్రాఫిక్స్, యాక్షన్ సీన్స్ మాత్రమే అనే భావన ఉంది. ఈ సినిమా మొదటి సగంలో ఒక్కటే ఫైట్ ఉంది. మిగతా అంతా ఆర్టిస్టుల క్లోజ్ అప్ సీన్స్. పెర్ఫార్మన్స్ మాత్రమే. డైలాగ్స్ తో ఉత్కంఠ, పాత్రల మధ్య నడిచే సన్నివేశాలు తో కన్ను రెప్ప వేయకుండా చూసేలా ఉంది. పాటలు కూడా మంచి సాహిత్యం అని చెప్పవచ్చు.
ప్రేమ ప్రకటించడానికి అశ్లీలత లేకుండా పాటలు తీశారు. భర్త గొప్పతనాన్ని గురించి చెబుతూ భార్య పాడే పాట తక్కువ సంగీతంతో, చంద్రబోస్ చక్కటి సాహిత్యంతో ఎంత బాగుంది (చూసేకి…). ఇంత భారీ సినిమాలో ఇంత మెలోడీ పాటా, అదీ క్లీన్ సాంగ్?
ఇక ఈ సినిమాలో వివాదాస్పదమైన నేపథ్యం గురించి వద్దాం. శేషాచలంలో అరుదైన ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. మొదటి భాగం నించీ ఈ సినిమా మీద అదే విమర్శ. దాని గురించి చూద్దాం.
భారత దేశంలో వివిధ ప్రాంతాల్లో ఒక్కో సహజ వనరుని దోచుకునే వర్గాలు ఉంటాయి. తూర్పు ప్రాంతంలో బొగ్గు, ఇతర మైనింగ్, మహారాష్ట్రలో చక్కెర మాఫియా, తెలుగు ప్రాంతంలో ముఖ్యంగా రాయలసీమలో మైనింగ్, ఎర్ర చందనం స్మగ్లింగ్ మాఫియాలు రాజ్యమేలుతాయి. ఇవి కేవలం ఒక నేరస్తుల వల్ల మాత్రమే కాదు. నేరస్థులు, బ్యూరోక్రాట్స్, రాజకీయ నాయకులు – ఈ మూడు రంగాల మధ్య పెనవేసుకున్న గాఢమైన బంధాలు రాష్ట్ర ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి.
వీళ్ళ అరాచకాలని డాక్యుమెంటరీగా తీస్తే చూసేవాళ్ళు ఉండరు కాబట్టి, కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ తీసుకుని ఓపెన్ గా ఎండగట్టారు. సినిమాకి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇలాంటి అంశాలు చర్చకి తేవడం ఆషామాషీ కాదు, ఎంతో క్రియేటివిటీ, ధైర్యం అవసరం. సుకుమార్ ఆ విషయంలో తగ్గేదే లే అన్నట్టు తీసుకుంటూ వెళ్ళిపోయారు.
అల్లు అర్జున్ కి మొదటి పార్ట్ లో నేషనల్ అవార్డ్ ఎందుకు ఇచ్చారు అనే దాని మీద బానే చర్చ నడిచింది (ముఖ్యంగా మొదటి తెలుగు వాడు కావడం, నేరస్థుడి పాత్ర కావడం). ఈ సినిమా చూసాక, ముఖ్యంగా జాతర సన్నివేశం చూశాక, నేషనల్ అవార్డ్ ఎందుకు ఇవ్వరు అనిపించేలా చేశాడు.
ఇక ఈ సినిమాలో సర్ప్రయిజ్ రష్మిక. ఆమె పెర్ఫార్మన్స్ కి కూడా నేషనల్ అవార్డు ఇవ్వాల్సిందే. ఇక దర్శకుడు – ఒక కమర్షియల్ సినిమా, అదీ మేల్ ఓరియెంటెడ్, మాస్ మసాలా ఎంటర్టైనర్ తీస్తూ, హీరోయిన్ని హీరోతో సమానంగా, కొన్ని చోట్ల ఎక్కువగా ఎలివేట్ చేయడం గొప్ప విషయం.
హీరోయిన్స్ కి సినిమాల్లో విలువ ఉండట్లేదు, బొమ్మల్లాగే ఉంటారు అన్న విమర్శలకి ఇందులో వల్లి పాత్ర సమాధానం. మహిళలకి ఎంతో గౌరవం ఇచ్చిన సినిమా ఇది. ఆడపిల్లల బాధ్యత అందరి బాధ్యత అని సుకుమార్ బలంగా చెప్పడం ఇప్పటి యువతకి అవసరం. ఏ పబ్లిసిటీ లేకుండా ఆయన ఆ పని సుతిమెత్తగా చేసేశాడు.
సామాజిక అంశాలు చాలా సున్నితంగా వ్యాఖ్యానించాడు. మొదటి పార్ట్ లో – కూలోడు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండు అని కొండారెడ్డి పాత్రతో చెప్పించాడు. కింది స్థాయి వ్యక్తులు ఒక స్టేజి వరకే పరిమితం కావాలి. అలా కాకుండా పెద్ద స్థాయిలు ఆశిస్తే అప్పటికే ఉన్న వ్యవస్థ ఒప్పుకోదు. అది మొదటి పార్ట్ లో చూపించాడు.
రెండో పార్ట్ లో దాన్ని మరింత చిక్కగా ప్రదర్శించాడు. “ కాళ్ళు మోస్తున్నాయి కదాని, చెప్పుల్ని చేత్తో పట్టుకుంటామా” – ఈ డైలాగ్ సీఎం పాత్ర చెప్పడం గొప్ప సామాజిక వాస్తవం. ఇటీవల బాగా వైరల్ అయిన ఒక వీడియోలో బ్రహ్మానందం కృష్ణ వంశీతో చెప్పినట్టు- ఎవరైనా నువ్వు బాగుండాలని కోరుకుంటారు. కానీ నాకన్నా ఎక్కువ బాగుండాలని కోరుకోరు – అని చెప్పినట్టు – “నీకో చోటుంది. అక్కడే ఉండు. పైకి రావాలని ఆశలు పెట్టుకుంటే అంతే” – అనే మెసేజ్ ఎప్పుడూ ఉన్నత వర్గం బడుగు వర్గాలకి ఇస్తూనే ఉంటుంది.
అది ఛాలెంజ్ చేసిన వాడు చాలా కష్టపడాలి. లేదా అంతం అయిపోవాలి. అధికారులు, పోలీసులు, రాజకీయ నాయకులు, నేరపూరిత శక్తులు తమ అస్తిత్వానికి భంగం కలిగిస్తే ఎలా ప్రతిస్పందిస్తాయో చూడాల్సిందే.
ఇది సుకుమార్ సినిమా. రంగస్థలం తర్వాత మరో గొప్ప సామాజిక సినిమా.
సమాజపు పోకడల మీద లోతైన అవగాహన ఉన్న వ్యక్తి ఒక థీసిస్ రాసినట్టు, పెయింటింగ్ వేసినట్టు, శిల్పం చెక్కినట్టు ఈ సినిమా ని సుకుమార్ చెక్కాడు. మనల్ని నిత్యం ప్రభావితం చేస్తున్న వాళ్ళ వికృత రూపాన్ని ఆవిష్కరించాడు. దానితో పాటు కుటుంబ వ్యవస్థ, విలువలు, దాంపత్య సంబంధాల మీద చక్కని సందేశమూ ఇచ్చాడు. తీసుకున్న వాళ్ళకి తీసుకున్నంత.
కొసమెరుపు: ఈ సినిమా మీద ఆవేశంగా, లాజిక్ లతో చేస్తున్న కామెంట్స్, డిబేట్స్ చూశాను. అందులో సమాజంలో ప్రముఖులుగా, తెలివైన వాళ్లుగా ప్రచారం పొందుతున్న వాళ్ళూ ఉన్నారు. అందరూ చేసే ప్రధాన విమర్శ – ఒక స్మగ్లర్ ని హీరోగా చూపిస్తే యువత ఏమి నేర్చుకుంటుంది? తప్పకుండా పాడై పోతుంది అని.
పైపైన చూస్తే మంచి లాజిక్ . ఇది ఒక సినిమా. నచ్చితే చూస్తాం. లేకపోతే లేదు. కానీ నిజ జీవితంలో జరుగుతున్నదేమిటి? అక్రమ మైన్స్ తో స్వాతంత్రం వచ్చినప్పటి నించీ రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేస్తున్న నేరస్థులు, నేతల్ని మనం ఎందుకు గౌరవిస్తున్నాం? ఎర్ర చందనం స్మగ్లర్లు కొంతమంది టీటీడీ మెంబర్లు కూడా అయ్యారని వార్తలు వచ్చాయి. అప్పుడు ఏమయ్యారు ఈ మేధావులు?
లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా కుటుంబాలు రాజకీయాల్లో చక్రం తిప్పి సీఎంలు అవుతుంటే, అన్నీ తెలిసిన “మేధావులు”, టీచర్లు, అధికారులు,పోలీసులు పిల్లలకి గత కొన్ని దశాబ్దాలుగా ఆ నేతల గురించి ఏమి చెప్తున్నారు – గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, మహా నేత, రైతు బంధు, విజనరీ, సంక్షేమ ప్రదాత…ఇలాంటి మాటలు పిల్లలతో పాఠశాలల కార్యక్రమాల్లో చెప్పిస్తున్నారు. అది ఈ మేధావులకి కనపడడం లేదా?
భయమా? కల్పిత పాత్ర ఏదో ప్రభావితం చేస్తుంది అని బోలెడు బాధ పడుతున్నవారు – సీబీఐ కేసుల్లో బెయిలు మీద ఉన్న వారికి, హత్య కేసుల్లో నిందితులకు స్కూలు పిల్లలకి “నిజాలు” చెప్పకుండా ఉండడం ఏ రకం ఆత్మవంచన?……… ( సమీక్ష :: విన్నకోట రవికుమార్ )
Share this Article