Priyadarshini Krishna…… ఇది రాయాలని అనుకోలేదు…. కానీ చాలామంది సంప్రదాయవాదులు చేసే వాదోపవాదాలు చూసిన తరువాత రాయలని అనిపించింది. అవును …. ఆదిపురుష్ గురించే !
నాకు నచ్చింది !
మొదటినుండి “నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదులే…” అనే పాట టైపు నేను. కాని అప్పుడప్పుడు నలుగురికీ నచ్చినది నాక్కూడా నచ్చుతుంది….
Ads
రామయణం కాదని రామాయణం ఇన్‌స్పిరేషన్ అని రచయిత యేవేవో అంటున్నాడు.
కానీ, వాళ్ళు అలా పలాయన వాదపు మాటలు మాట్లాడకుండా “అవును, ఇది రామాయణమే… మాకు ఇలాగే వచ్చు” అంటే ఇంకా ఆనందించేదాన్ని.
చాంతాడంత డిస్‌క్లైమర్ చేసి కూడా ఇంకా భయంభయంగా ‘నాకేటీ తెల్దు, నన్నొగ్గేయండి బాబూ’ అనే ఇంటర్య్వూలెందుకిస్తున్నారో…
తీసినప్పుడున్న ధైర్యం జనాలకి షో వేసేటప్పుడెలా పోయిందో…
ఇక విషయానికి వస్తే….
రాముణ్ణి మీసాలతో చూపించారు!
అవును, ఐతే ఏంటి. అతను వనవాసిగా వున్నాడు, పైగా క్షత్రియుడు. మీసాలు ఉండరాదా. నిజానికి గడ్డాలు కూడా వుండాలి.
మీసాలు దేనికి అడ్డమో తెలియలేదు.
రాముడు నీలమేఘశ్యాముడు కదా మరి ప్రభాస్‌కు బులుగురంగు రాయలేదేమి అంటారా…? మనం చూడాలికదా అనుకున్నాడేమో డైరెక్టర్ !
సీత ఉల్లిపోరచీరకట్టింది!
అవును. ఐతే క్యా…?!
వనవాస శిక్ష కేవలం రామునికే !
సీతకి లక్ష్మణుడికి కాదు. రామునిపైన ఉన్న ప్రేమ గౌరవ ఆరాధన విధేయతల వల్ల వారు కూడా వెంట నడిచారు. భోగాలు త్యజించారు.
సీత నారచీర కట్టిన జరీచీర కట్టినా కథమారదు. ఆవిడ చూడామణి కదా హనుమకి ఇచ్చింది అంటారా… హిందీ వాళ్ళు చూడామణి పెట్టుకోరు, కనెక్టవరు అనుకున్నాడేమో డైరెక్టరు !
వాలి సుగ్రీవ జాంబవంతులను నిజమైన జంతువులుగా చూపించారు. హాలివుడ్ గోడ్జిల్లా ప్లానెట్ ఏప్స్ కాంగ్ తరహాలో !
అవును…ఐతే…?!
హాలివుడ్డోళ్ళే మన కథలు ఎత్తుకెళ్ళి అవి సృష్టించుకున్నారు. మన సూపర్ హీరోలను వాళ్ళు కొట్టేసారు !
శూర్పణఖ మరీ అంత అందమా…!
అవును… ఐతే…?!
రావణుని చెల్లెలు అందంగా వుండరాదా…? లంకవాసులు అందంగా ఉండరాదా…? ఆ అందంతోనే గా రాముణ్ణి వశం చేసుకోవాలనుకుంది….!
రావణున్ని ఘజనీ ఖాన్‌లాగా చూపించారు….!
అవును… ఐతే…?!
డైరెక్టర్ దృష్టిలో రావణుడు అప్రాచ్యుడు మరి !
మొదటి సీన్ లోనే బ్రహ్మ దగ్గర వరం పొంది, అదే బ్రహ్మని నిర్లక్ష్యం చేయడం, గర్వం పదితలలు వెయ్యడం చూపించాడుగా…. చతుర్వేదాలు అన్ని కళలను ఔపోసన పడితే ఆ మాత్రం ఉండదా..!
అదే రావణుడు ‘వీణ- రావణహఠ’తో శివుణ్ణి ఆరాధించడం ఎంత గొప్పగా చూపించాడు.
ఎటొచ్చీ రావణుడికి నల్లని బట్టేసి లంకను KGFలో లాగా నల్లగా మట్టి కొట్టుకుపోయినట్లుగా చూపించాడనా…
ఆగండాగండి…. లక్షణగ్రంధాల్లో, ముఖ్యంగా భరతుడు రాసిన ‘నాట్యశాస్త్రం’లో ప్రతి పాత్రకు ఆ పాత్ర ఔచిత్యాన్ని బట్టి కొన్ని రంగులను నిర్థేశించాడు. నాయకునికి ఒక రంగు; అదే నాయకుడు పాత్ర బట్టి, అంటే ధీరోదాత్త, ధీరలలిత, ధీరశాంత వంటి పాత్రలకు కొన్ని రంగులు నిర్థేశించారు.
ప్రతినాయకుడు (విలన్) కు నల్లని రంగుని allot చేసాడు భరతుడు.
దానిని ప్రామాణికంగా తీసుకునే డైరెక్టర్ ఇలా మొత్తం నల్లరంగు పులిమాడు…! అయుంటుంది !
ఇక అసలు విషయం-
ఆ గబ్బిలమేంటి అసలు అంత జుగుప్సగా..?!
అవును… కరెష్టే గానీ… క్రూరాతిక్రూరంగా చూపించాలనుకున్నాడు. పుష్పక విమానాన్ని విహారయాత్రలకు వాడుకోడానికి రిజర్వ్ చేసాడు.
అత్యంత మేథావి శాస్త్రప్రవీణుడు పదుల సంఖ్యల్లో తనదగ్గర విమానాలు హెలీపాడ్‌ల్ వున్న రావణుడు పిచ్చి గబ్బిలాన్ని వాహనంగా చేసుకోడమేంటో… అది చొంగకారుస్తూ భీకరంగా అరుస్తూ జుగుప్స పుటించడమేంటో…
హాలీవుడ్డోల్లకు ధీటుగా తియ్యాలనుకున్నాడు.
పాములతో మసాజ్ యేంటో…!
మన వెన్నులో వణుకు పుట్టించడానికి…! మరీ లంకిణులు మసాజ్ చేస్తున్నట్లు చూపలేరు. స్త్రీలోలుడు కాదు కదా… అలాగని చేపలు మసాజ్ చేస్తున్నట్లు చూపలేరు. మనకి భయం వెయ్యదు. కామెడీగా వుంటుంది. సో ఇలా ఫిక్సయ్యాడు డైరెక్టరు.
లంకిణులు రావణసైన్యం అంత కురూపులుగా ఉన్నారేంటో…?
మరే… మన పాత సినిమాల్లో కోరలు గోళ్ళతో విచిత్రంగా చూపించలేదా… ఇదీ అంతే…!
ఇక నటుల విషయానికొస్తే అందరూ బాగా చేసారు… ఆశ్చర్యకరంగా సైఫ్ కూడా నటించాడు. ప్రభాస్ కి తోడుగా మంచి నటశూన్య సన్నీని శేషు గా తెచ్చారు. లేకుంటే డామినేట్ చేసిపడేసేవాడు. జానకిగా కృతి బాగుంది, వంక పెట్టేందుకు లేదు. భజరంగీ భాయ్ జాన్ … సారీ హనుమగా దేవదత్త్ అదరగొట్టాడు. మిగతా వారు న్యాయం చేసారు.
అంతా స్టూడియోలో Green Matలో తియ్యడం వల్ల అందరు ఫ్రెష్ గా చక్కగా వున్నారు. ఫైటింగుల్లో పైనుంచి దూకినా శోభన్ బాబు గాగుల్స్ ఊడిపోని సినిమాల నుండి చొక్కాకి మట్టి కూడా అంటించుకోని చిరు సినిమాల వరకూ చూస్తూనే ఉన్నాం… యేం, ఇది చూడటానికేం నొప్పి !
యుద్ధం విచిత్రంగా చిత్రీకరించారు..!
రామరాణయుద్ధం వివరణ ప్రకారం తియ్యాలంటే ఇప్పటి ఆడియన్స్ కి ఆనదు. వందల సినిమాలు చూసిచూసి ఉన్నాం కదా, మనసు కొత్తదనం కోరుకుంటుంది. అదే చూపించాడు.
కొత్త ఆడియన్స్ కి పిల్లలకి అని చాలామంది తీర్మానిస్తున్నారు. అదేంలేదు… మనకి నచ్చుతుంది…
కొంచెం ఇగో పక్కనపెట్టాలి.
ఏదేమైన ‘శకుంతల’ చూసి గాయపడిన మనసుకి కొంత ఊరట కలిగించింది… కొంతకాలం శకుంతలని మర్చిపోవచ్చు…
Share this Article