.
కొత్త రకం సైబర్ మోసం: పెళ్లి ఆహ్వాన పత్రికల పేరుతో ఖాతాలు ఖాళీ...
ఏదో నంబర్ నుంచి వాట్సప్‌లో ఓ పెళ్లిపత్రిక వచ్చింది… పెళ్లి ఆహ్వానం వీడియో బిట్లు వస్తూనే ఉంటాయి కదా… ఎవరబ్బా నాకు వెడింగ్ ఇన్విటేషన్ పంపించింది అనుకుని ఆతృతగా వెనకా ముందూ చూడకుండా ఓపెన్ చేశారో, ఆరిపోతారు సుమా… అంటే మీ బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతాయి మరి…
Ads
మహారాష్ట్రలోని హింగోలి జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి, వాట్సాప్‌లో వచ్చిన పెళ్లి ఆహ్వాన పత్రిక వల్ల ఇలాగే దాదాపు రూ. 2 లక్షలు పోగొట్టుకున్నాడు… ఆగస్టు 30న జరగబోయే పెళ్లికి ఆహ్వానిస్తున్నట్టు, గుర్తుతెలియని నంబర్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది తనకు…
అందులో “వెల్‌కమ్, షాదీ మే జరూర్ ఆయే (పెళ్ళికి తప్పక రండి). 30/08/2025. లవ్ ఈజ్ ద మాస్టర్ కీ దట్ ఓపెన్స్ ద గేట్ ఆఫ్ హ్యాపీనెస్” అని ఉంది… దాని కింద పెళ్లి ఆహ్వాన పత్రిక పీడీఎఫ్ ఫైల్ లాంటిది ఒకటి కనిపించింది… అదే ట్రాప్…
ఎందుకంటే, అది పీడీఎఫ్ ఫైల్ కాదు, వీడియో బాపతు ఫార్మాట్ కూడా కాదు… ఒక APK (Android Application Package) ఫైల్… apk అని కనిపిస్తుంది కూడా… చాలామందికి ఇవి ట్రాపులని తెలియవు కదా… క్లిక్ చేస్తారు…
దీనిని పెళ్లి ఆహ్వాన పత్రిక పేరుతో ఫోన్‌లలోకి పంపి, వ్యక్తిగత సమాచారం దొంగిలించడానికి వాడతారు… పైన సంఘటనలో బాధితుడు ఆ ఫైల్‌ను క్లిక్ చేయగానే, సైబర్ నేరగాళ్లు వారి ఫోన్‌లోని వివరాలను యాక్సెస్ చేసి, దాదాపు రూ. 1,90,000 దొంగిలించారు…
ఈ ఘటనపై హింగోలి పోలీస్ స్టేషన్‌లో మరియు సైబర్ సెల్ డిపార్ట్‌మెంట్‌లో గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు…
గత సంవత్సరం కూడా ఈ తరహా మోసం వెలుగులోకి వచ్చింది. గుర్తుతెలియని నంబర్ల నుంచి వాట్సాప్‌లో పెళ్లి పత్రికలు పంపి, ఆ ఫైల్స్‌ను క్లిక్ చేయగానే ఫోన్‌లో APK ఫైల్స్ డౌన్‌లోడ్ అయ్యేలా చేస్తారు… ఈ ఫైల్స్ ద్వారా సైబర్ నేరగాళ్లు బాధితుల ఫోన్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు.
అంతేకాదు, ఫోన్‌లో దొరికిన సమాచారాన్ని ఉపయోగించి, తామే ఆ ఫోన్ యజమానిగా నటిస్తూ ఇతరులను కూడా మోసం చేయవచ్చు… అందుకే, సైబర్ పోలీసులు గతంలోనే ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేయవద్దని హెచ్చరించారు… రిస్తూనే ఉన్నారు కూడా… జరిగేవి జరుగుతూనే ఉన్నాయి, మరింత జోరుగా… రకరకాల రూపాల్లో..!! మీరు కూడా ఇలాంటి మెసేజ్‌లు అందుకున్నారా? జాగ్రత్తగా ఉండండి!
Share this Article