Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కొన్ని కథలు మలయాళ, బెంగాలీ ప్రేక్షకులకు మాత్రమే… మనకు ఎక్కవు..!!

October 1, 2024 by M S R

ఇరవయ్యో శతాబ్దం మొదటి రోజుల్లో దేశంలో సంచలనం కలిగించిన భవాల్ రాజా కేసు ఆధారంగా వచ్చిన సన్యాసి రాజా అనే బెంగాలీ సినిమాకు రీమేక్ 1977 లో వచ్చిన మన రాజా రమేష్ సినిమా . బెంగాలీలో ఉత్తమ కుమార్ , సుప్రియాదేవి నటించారు . బెంగాలీలో సూపర్ హిట్ మూవీ . 126 రోజులు ఆడింది . మన తెలుగు సినిమాలో అక్కినేని , వాణిశ్రీ , జగ్గయ్య ప్రధాన పాత్రల్లో నటించారు . అయితే మన తెలుగు సినిమా ప్రేక్షకులకు నచ్చలేదు . నచ్చకపోవటానికి కారణాలు ఉన్నాయి .

అసలు కధ : ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉన్న ఆనాటి జమీందారు స్త్రీలోలుడు , దుర్వ్యసనాలకు బానిస . సుఖవ్యాధులు వస్తే డార్జిలింగుకు చికిత్స కోసం తీసుకుని వెళతారు . అక్కడ చనిపోతాడు . దహన సంస్కారం సమయానికి పెద్ద తుఫాను రావడంతో , శవాన్ని మధ్యలో వదిలేసి వెళతారు . అనూహ్యంగా బతుకుతాడు . ఆ దారిన వెళుతున్న నాగ సాధువులు రక్షించి , వ్యాధులను నయం చేసాక , జమీందారు కూడా సన్యాసి అయిపోతాడు . దేశమంతా తిరుగుతూ తన జమీనుకే వస్తాడు . అక్కడ గత స్మృతి రావడం , ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం ఒక కమీషన్ వేయడం , ఆ కమీషన్ ముందు తాను జమీందారు అని రుజువు చేసుకుంటాడు .

ఇంక సినిమా కధ … రాజా రమేష్ సంగీత సాహిత్య ప్రియుడు . వాటి గోలలో భార్యను అశ్రధ్ధ చేస్తుంటాడు . ఈలోపు విలన్ జగ్గయ్య డాక్టరుగా అంతఃపురంలో పాగా వేస్తాడు . రాజు గారి ఆరోగ్యాన్ని పాడుచేస్తాడు . రాణీ గారిని లోబరచుకుని బ్లాక్ మెయిల్ చేస్తాడు . దివాణాన్ని , ప్రజలను హింసిస్తూ ఉంటాడు . రాజు గారి శవ దహనం కాకపోవడం , సాధువులు రక్షించడం , సన్యాసిగా మారిపోవడం , మళ్ళా తన జమీనుకే రావడం , ప్రభుత్వ కమీషన్ ముందు తానే రాజునని రుజువు చేసుకోవడం , విలన్ జగ్గయ్యని ప్రజలు చంపేయడం , రాణి గారు విలన్ చేతిలో చనిపోవడం , రాజా వారు తన జమీన్ని ప్రజలకే అప్పచెప్పి సన్యాసిగా కొనసాగడంతో సినిమా ముగుస్తుంది .

Ads

మనవారికి ఎందుకు నచ్చలేదు !? రాణిగా వాణిశ్రీ నటించింది . ఆమెను విలన్ లోబరుచుకొనడం జనానికి నచ్చలేదు . ఎంతయినా వాణిశ్రీ కదా ! ఒక ప్రేక్షకుడిగా ఇప్పటికీ నాకెందుకో నచ్చదు . బహుశా మన తెలుగు సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోవటానికి ఇదే కారణం అయిఉండాలి . అంతే కాదు . వాణిశ్రీ ఆహార్యం కూడా సరిగ్గా డిజైన్ చేసుకోలేదు . కర్ణుడి చావుకి ఎన్నో కారణాలు . అలాగే ఏదయినా .

కె వి మహదేవన్ సంగీత దర్శకత్వంలో పాటలు చాలా బాగుంటాయి . హిట్టయ్యాయి కూడా . పాటలూ మాటలూ ఆత్రేయే వ్రాసారు . బాలసుబ్రహ్మణ్యం , సుశీలమ్మలు పాడారు . నేల మీది జాబిలి నింగిలోని సిరిమల్లి , వాయించు ఆదితాళం , చంద్రుడు కనపడలేదని పాటలు బాగా హిట్టయ్యాయి .

నెల్లూరి నెరజాణ పాట అక్కినేని , జయమాలినిల మీద చాలా హుషారుగా ఉంటుంది . అలాగే చంద్రుడు కనపడలేదని పాట అక్కినేని , కాంచనల మీద కూడా హుషారుగా ఉంటుంది . దర్శకుడు వి మధుసూధనరావు కదా ! కాంచన లేకుండా ఎలా ?! అందుకే ఉన్నది . అందమైన నాట్యం కూడా చేస్తుంది .

సినిమాలో విజయలలిత అంతఃపురంలో పెద్ద చెలికత్తెగా జనం మతి పోగొడుతుంది . పాత్ర పేరు విలాసవతి . చాలా విలాసంగా నటించింది . ఇతర పాత్రల్లో మిక్కిలినేని , పి జే శర్మ , హలం , శ్రీధర్ , కె వి చలం , పి యల్ నారాయణలు నటించారు . ఇంత చక్కటి మ్యూజికల్ హిట్ ప్రేక్షకులకు నచ్చకపోవడం నిర్మాతల దురదృష్టం .

ఈ సినిమా కధ నాకు ముందే తెలుసు . 1971-72 లో బికాం ఫైనల్ విద్యార్ధిని . మాకు Mercantile Law అనే సబ్జెక్ట్ ఉండేది . K V L N ప్రసాద్ గారు అనే లెక్చరర్ బోధించేవారు . ఆయన ఈ సంచలనాత్మక వాస్తవ కధని మాకు క్లాసులో చెప్పారు . ఆ తర్వాత ఆరేళ్ళకు ఈ సినిమా వచ్చింది .

నిర్మాత బాపట్ల విద్యాసంస్థల వ్యవస్థాపకులలో ముఖ్యులు ముప్పలనేని శేషగిరిరావు గారు . బహుశా అందువలనే ఏమో మా గుంటూరు జిల్లాలోని బాపట్ల , పిట్టలవారి పాలెంలో ఔట్ డోర్ షూటింగ్ జరిపారు . మొత్తం మీద సినిమా చూడబులే . పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి . నృత్యాలు చాలా అందంగా ఉంటాయి . ముఖ్యంగా అక్కినేని అభిమానులకు బాగానే నచ్చుతుంది . యూట్యూబులో ఉంది . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు……. (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఓహ్… వెన్నుపోటుపై మాగంటి చంద్ర బాబు వ్యతిరేక సినిమా ప్లాన్ చేశాడా..?!
  • పాటలు బాగుంటాయి… కానీ అసలు కథే సైకో ప్రేమలకు గ్లోరిఫికేషన్…
  • బుల్‌డోజింగ్ పాలసీకి ఆద్యుడే కేసీయార్… కేటీయార్ మరిచినట్టున్నాడు…
  • ఎంతసేపూ బాహుబలి ప్రమోషనే… మహాశయా, ఇస్రో రాకెట్ పేరు అది కాదు…
  • బంగారు తల్లులు..! ప్రత్యర్థులనూ ఓదార్చి, కన్నీళ్లు తుడిచిన వైనం..!!
  • ఒక్కసారి లిటిగెంట్ ముద్ర పడితే… ఎంతటి ప్రశాంత్ వర్మకైనా దెబ్బే..!!
  • అయ్యో ఉషాపతి..! సంసారంలో మంటబెట్టి, ఎగదోస్తున్న మీడియా..!!
  • స్మృతి మంధాన..! కప్ గెలుపు ప్రచారంలో ఎందుకో దక్కని ప్రాధాన్యత ..!!
  • వరల్డ్ కప్ గెలుపు సంబురాల్లో… ఈ వీల్ చైర్ భాగస్వామి ఎవరో తెలుసా..?
  • జస్ట్,, టైమ్‌ పాస్ పల్లీ బఠానీ… చిరంజీవి కదా… పైసలొచ్చేసినయ్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions