Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రతి ఇండియన్ క్రికెట్ ప్రేమికుడూ తలుచుకోవాల్సిన పేరు… గైక్వాడ్..!!

August 1, 2024 by M S R

రక్తాలు కార్చుకుంటూ.. బ్యాటర్‌గా అయినా, కోచ్‌గా అయినా.. అదే పంతం

వెస్టిండీస్ క్రికెట్ టీమ్ అంటే ఇప్పుడు ఎవరూ భయపడటం లేదు. ఒకప్పటి వెస్టిండీస్ టీమ్‌తో పోలిస్తే.. అసలు ఇప్పుడున్న జట్టు క్రికెట్ ఓనమాలు అయినా తెలుసా అన్నట్లు కనపడుతుంది. అదే 70వ దశకంలో వెస్టిండీస్ జట్టును చూస్తే.. ప్రపంచంలోని మిగతా జట్లు గడగడలాడిపోయేవి. ఆ జట్టుతో సొంత గడ్డపై ఆడినా.. భయం మాత్రం పోయేది కాదు. వెసిండీస్ జట్టు ఏ దేశం వెళ్లినా.. ఏ జట్టు అయినా వెస్టిండీస్ వెళ్లినా.. భయం మాత్రం ఎదుటి జట్టుకే. బాహుబలి సినిమాల్లో కాలకేయుల్ని తలదన్నేలా ఉండేవి వారి చూపులు.. వాళ్లు బంతితో చేసే దాడులు.

గుండప్ప విశ్వనాథ్, ఫరూక్ ఇంజనీర్, టైగర్ పటౌడి, సునిల్ గవాస్కర్ వంటి హేమాహేమీలే విండీస్ జట్టు అంటే ఒళ్లు దగ్గర పెట్టుకొని ఆడేవాళ్లు. ఇక ఒక కొత్త క్రికెటర్ వెస్టిండీస్ మీదే అరంగేట్రం చేయాల్సి వస్తే.. అతని పరిస్థితి ఎలా ఉండేదో ఊహించండి.

Ads

అది 1974 డిసెంబర్ 27. కోల్‌కతా (అప్పట్లో కలకత్తా)లోని ఈడెన్ గార్డెన్. వెస్టిండీస్ జట్టు భారత పర్యటనలో భాగంగా టీమ్ ఇండియాతో 3వ టెస్టు ఆడుతోంది. ఆ టెస్టు మ్యాచ్‌తోనే ఒక క్రికెటర్ అరంగేట్రం చేశాడు. టాస్ గెలిచిన ఇండియా.. బ్యాటింగ్ ఎంచుకుంది. వెస్టిండీస్ జట్టులో ఆండీ రాబర్ట్స్, వాన్‌బర్న్ హోల్డర్, బెర్నార్డ్ జూలియన్ వంటి ఆరవీర భయంకరమైన బౌలర్లు ఉన్నారు. అసలు వాళ్లు బంతి విసిరితే బ్యాటర్‌కు కూడా కనిపించడం లేదు. వారి బౌలింగ్ ధాటికి ఓపెనర్ సుధీర్ నాయక్ తొలి బంతికే డకౌట్ అయ్యాడు. ఫస్ట్ డౌన్‌లో వచ్చిన పార్థసారథి శర్మ 6 పరుగులకే వెనుదిరిగాడు. ఫరూక్ ఇంజనీర్ కేవలం 24 పరుగులే చేశాడు. గుండప్ప విశ్వనాథ్ (52), మన్సూర్ అలీ ఖాన్ పటౌడి (36) మాత్రం క్రీజులో పాతుకొని పోయారు. కానీ అప్పటికీ విండీస్ బౌలర్ల దాటికి ఒంటిపై దెబ్బలు తగిలించుకున్నారు.

రాబర్ట్స్ వేసిన బంతి కెప్టెన్ పటౌడీ మొఖానికి తగిలి రక్తం కారుతోంది. అయినా బ్యాటింగ్ చేయాలని ప్రయత్నించాడు. కానీ ఔటై పోయాడు. రక్తం కారుకుంటూనే పెవీలియన్ వైపు నడిచాడు. అదే సమయంలో అరంగేట్రం కుర్రాడు బ్యాటుతో క్రీజులోకి వస్తున్నాడు. ఒక్క క్షణం పటౌడీ మొఖం చూశాడు. రక్తంతో ఎర్రగా మారిపోయింది. పటౌడీ కళ్లలో ఏదో ఆందోళన కనిపించింది. కానీ ఆ కుర్రాడు మాత్రం ఒక్క క్షణం పటౌడీ వంక చూసి.. అలాగే బ్యాట్ పట్టుకొని క్రీజులోకి వెళ్లాడు.

కొత్త కుర్రాడిని చూసి విండీస్ బౌలర్లు మరింత రెచ్చిపోయారు. బౌన్సర్లు, బీమర్లు విసురుతూ భయభ్రాంతులకు గురి చేశారు. అయినా సరే సహనం కోల్పోలేదు. భయపడలేదు. ఒక సీనియర్ బ్యాటర్‌లా విండీస్ బౌలర్లను ఎదుర్కున్నాడు. 95 బంతులు ఎదుర్కొని 36 పరుగులు చేశాడు. ఈ కాలంలో అయితే 36 పరుగులేగా అని తీసి పారేస్తారు. కానీ అప్పట్లో విండీస్ బౌలర్లను ఎదుర్కొని అంత సేపు క్రీజులో ఉండటమే కాకుండా.. అరంగేట్రం మ్యాచ్‌లో 36 కొట్టడం అంటే గ్రేట్. ఆ కుర్రాడి పేరు అంశుమన్ గైక్వాడ్. ఈ మ్యాచ్‌ను భారత జట్టు గెలిచింది.

బ్లడ్‌బాత్ ఆఫ్ కింగ్‌స్టన్..

కోల్‌కతాలో మ్యాచ్ అయిపోయిన తర్వాత 16 నెలలకు భారత జట్టు విండీస్ టూర్‌కు వెళ్లింది. అందులో కింగ్‌స్టన్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు ఒక రక్త చరిత్ర. భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్‌లో సునిల్ గావస్కర్‌తో కలిసి అంశుమన్ గైక్వాడ్ ఓపెనర్‌గా వచ్చాడు. విండీస్ బౌలర్లు సొంత గడ్డపై మరింతగా రెచ్చిపోయారు. మళ్లీ బౌన్సర్లు, బీమర్లతో విరుచుకపడ్డారు. గైక్వాడ్‌ను ప్రత్యేకంగా టార్గెట్ చేశారు. వాళ్లు వేసే బంతులు తగిలి అంశుమన్ గైక్వాడ్ ఒళ్లంతా పులిసిపోయింది. అయినా సరే మొక్కవోని దీక్షతో బ్యాటింగ్ చేశాడు.

ఒక బంతి వచ్చి గైక్వాడ్ గ్లవ్‌కు తగిలింది. మైఖెల్ హోల్డింగ్ వేసిన ఆ బంతి దెబ్బకు గైక్వాడ్ వేలు చిట్లి గ్లవ్‌లో నుంచి రక్తం బయటకు వస్తోంది. వీవియన్ రిచర్డ్స్ దగ్గరకు వచ్చి ఏదో చెప్పబోతే ‘గెట్ లాస్ట్’ అంటూ గట్టిగా అరిచాడు. ఆ దెబ్బ తర్వాత గైక్వాడ్ కాన్సట్రేషన్ చేయలేకపోయాడు. బంతులు చాలా వేగంగా వస్తున్నా.. అతడికి ఏమీ కనిపించడం లేదు. ఇక ఒక బంతి నేరుగా వచ్చి చెవికి తగిలింది. ఒక్క సారిగా ఏం జరిగిందో అర్థం కాలేదు. కళ్లు తిరిగాయి.. చెవుల్లోంచి రక్తం కారిపోతోంది. నిలబడలేక గైక్వాడ్ రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. అప్పటికి అతని స్కోర్ 81 పరుగులు. స్టేడియం నుంచి వెంటనే ఆసుపత్రికి వెళ్లాడు. ఇయర్ డ్రమ్‌కు సర్జరీ చేయాల్సి వచ్చింది.

అంశుమన్ గైక్వాడ్ క్రికెట్ కెరీర్ చూస్తే పెద్ద పెద్ద అంకెలు కనపడవు. కేవలం 40 టెస్టులు ఆడిన గైక్వాడ్ రెండు సెంచరీలు, 10 అర్థ సెంచరీలు చేశాడు. 15 వన్డేలు, 206 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో అతను చేసిన మొత్తం పరుగులు 1985. కానీ అవన్నీ కీలకమైన పరుగులే కావడం గమనార్హం.

Gaikwad

కొనసాగిన రక్త చరిత్ర..

అంశుమన్ గైక్వాడ్ చాలా పంతం గల మనిషి. ఒకటి అనుకున్నాడంటే చేసి తీరాల్సిందే. క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక భారత జట్టు కోచ్‌గా, సెలెక్టర్‌గా వ్యవహరించాడు. 1998లో షార్జాలో భారత జట్టు ఆస్ట్రేలియాతో కోకాకోలా కప్ ఫైనల్ ఆడింది. 272 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి 48.3 ఓవర్లలో ఛేదించింది. అప్పట్లో 240 పరుగుల లక్ష్యమే చాలా భారీదని భయపడే వాళ్లు. అలాంటిది 272 పరుగులను అలవోకగా ఛేజ్ చేశారు. ఆ మ్యాచ్‌లో సచిన్ 135 పరుగులు చేశాడు. అప్పుడు టీమ్ ఇండియా కోచ్ అంశుమన్ గైక్వాడ్.

1999లో ఢిల్లీ ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో అనిల్ కుంబ్లే పాకిస్తాన్‌పై ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీశాడు. తలకి దెబ్బతగిలి రక్తం కారుతున్నా..  బౌలింగ్ చేశాడు. అప్పుడు కూడా కోచ్ అంశుమన్ గైక్వాడే. దెబ్బతగిలి బాధపడుతున్న కుంబ్లేను ప్రోత్సహించి, ఉత్సాహం నింపింది గైక్వాడ్. ఎలాగైనా బౌలింగ్ చేయగలవు అంటూ ఎంకరేజ్ చేసి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయడానికి కారణమయ్యాడు.

ఇలా తన జీవితమంతా క్రికెట్ కోసం ప్రాణం పెట్టిన గైక్వాడ్.. గత రాత్రి (జూలై 31) కన్నుమూశాడు. దీర్ఘ కాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న గైక్వాడ్‌కు బీసీసీఐ రూ. కోటి ఆసుపత్రి ఖర్చుల కోసం ఇచ్చింది. 1983 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ సభ్యులు కూడా గైక్వాడ్‌కు సాయం చేశారు. లండన్‌లోని ఒక ఆసుపత్రిలో క్యాన్సర్‌కు చికిత్స తీసుకొని నెల క్రితమే ఇండియాకు తిరిగి వచ్చారు. కానీ ఆయన ఒంటిలోని క్యాన్సర్ ఆయనను బలి తీసుకుంది.

భారత జట్టు మాజీ క్రికెటర్, కోచ్, సెలెక్టర్ అంశుమన్ గైక్వాడ్‌కు నివాళి. Inputs : Hindustan Times, ESPN Cricinfo …. [ By John Kora ]

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వావ్ మద్రాస్..! అప్పట్లోనే ఆంధ్రాలీడర్లు ఇంకాస్త గట్టిగా పట్టుపట్టి ఉంటే..?!
  • అదే పాట, ప్రతీ నోటా..! ఈ ట్యూన్ రికార్డు మరే సినిమా పాటకూ లేదేమో..!!
  • ఓ ప్రధాని మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసినట్టు… రోడ్రిగో కథే వేరు…
  • కేసీయార్ లేదా బాబు అయిఉంటే… ఈ ఈవెంట్ దద్దరిల్లిపోయేది…
  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions