.
జ్వరంగా ఉందా..? ఓ డోలో వేసుకో… తగ్గడం లేదా..? వైరల్ ఫీవర్ అనిపిస్తోందా..? ఏదైనా యాంటీ బయోటిక్ తీసుకో… షాపు వాడే ఓవర్ ది కౌంటర్ ఇస్తాడు… ఒళ్లు నొప్పులు కూడా ఉంటే ఐబుప్రొఫెన్ ఇవ్వమనండి…
ఇండియాలోనే కాదు, ప్రతిచోటా ఇదే తీరు… అయితే పారాసెటమాల్, ఐబుప్రొఫెన్ ఇష్టారాజ్యం వాడకం యాంటీబయోటిక్ నిరోధకతను పెంచుతుందా? అంటే, యాంటీబయోటిక్ పనిచేయకుండా పోతుందా..? కొత్త అధ్యయనం ఆసక్తికర విషయాలను వెల్లడిస్తుంది…
Ads
సాధారణంగా మనం జ్వరం, నొప్పులు లేదా తలనొప్పి వచ్చినప్పుడు పారాసెటమాల్ (అసెటమినోఫెన్) లేదా ఐబుప్రొఫెన్ వంటి ఓవర్-ది-కౌంటర్ (OTC) మందులను వాడుతాం. ఇవి సురక్షితమైనవని, ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన మందులని భావిస్తాం…
కానీ, యూనివర్శిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా నిర్వహించిన ఒక కొత్త అధ్యయనం ఈ మందులు యాంటీబయోటిక్ నిరోధకతను (Antibiotic Resistance) పెంచే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. ఈ అధ్యయనం ప్రపంచంలోనే మొదటిసారిగా ఈ అంశంపై కీలక సమాచారాన్ని వెల్లడించింది…
అధ్యయనం ఏం చెబుతోంది?
పారాసెటమాల్ అధిక వాడకం మూత్రపిండాలకు చేటు అని ఇన్నాళ్లూ చెప్పుకుంటున్నాం కదా… ఇప్పుడు పరిశోధకులు పారాసెటమాల్, ఐబుప్రొఫెన్ వంటి మందులు ఒక్కొక్కటిగా వాడినప్పుడు కూడా యాంటీబయోటిక్ నిరోధకతను పెంచుతాయని, ఈ రెండు మందులను కలిపి వాడినప్పుడు ఈ ప్రభావం మరింత తీవ్రమవుతుందని కనుగొన్నారు. వీరు సిప్రోఫ్లాక్సాసిన్ అనే విస్తృత-స్పెక్ట్రం యాంటీబయోటిక్‌తో పాటు ఈ.కోలై (Escherichia coli) అనే బ్యాక్టీరియాపై ఈ మందుల ప్రభావాన్ని పరిశీలించారు.
ఈ.కోలై సాధారణంగా కడుపు, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. అధ్యయనంలో, ఈ మందులు బ్యాక్టీరియాలో జన్యు మార్పులను (మ్యూటేషన్లు) పెంచి, యాంటీబయోటిక్‌కు వ్యతిరేకంగా అధిక నిరోధకతను కలిగించాయని తేలింది.
యాంటీబయోటిక్ నిరోధకత అంటే ఏమిటి?
యాంటీబయోటిక్ నిరోధకత అనేది బ్యాక్టీరియా మార్పులకు లోనై, యాంటీబయోటిక్ మందులు పనిచేయకపోవడం లేదా పూర్తిగా విఫలమవడం… దీని వల్ల సాధారణ ఇన్ఫెక్షన్లు—మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు, న్యుమోనియా, గాయాలు—చికిత్స చేయడం కష్టమవుతుంది లేదా అసాధ్యమవుతుంది. “ఇది ప్రపంచ ఆరోగ్యానికి అతిపెద్ద సవాలు,” అని ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్‌లో సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సురంజిత్ చటర్జీ అన్నారు.
ఎందుకు ఆందోళన కలిగిస్తోంది?
పారాసెటమాల్, ఐబుప్రొఫెన్ ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వాడే మందులు. ఇవి నొప్పి, జ్వరం, వాపు, తలనొప్పులకు సురక్షితమైనవిగా పరిగణించబడతాయి. కానీ, ఈ అధ్యయనం ప్రకారం, ఈ మందులు మన శరీరంలోని బ్యాక్టీరియాపై ఒత్తిడి కలిగిస్తాయి.
ఈ ఒత్తిడి వల్ల బ్యాక్టీరియా తమ జన్యు నిర్మాణాన్ని మార్చుకొని, యాంటీబయోటిక్‌లకు నిరోధకతను పెంచుకుంటాయి. ముఖ్యంగా ఈ రెండు మందులను కలిపి వాడినప్పుడు ఈ ప్రక్రియ వేగవంతమవుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా వృద్ధులకు ఎందుకు జాగ్రత్త?
వృద్ధ శుశ్రూష కేంద్రాలలో (ఏజ్డ్ కేర్) రోగులు తరచూ బహుళ మందులను దీర్ఘకాలం వాడుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఈ మందుల వాడకం యాంటీబయోటిక్ నిరోధకతను మరింత పెంచే ప్రమాదం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) యాంటీమైక్రోబయల్ నిరోధకతను ప్రపంచ ఆరోగ్య బెదిరింపుగా ప్రకటించింది. 2019లో ఈ నిరోధకత వల్ల 12.7 లక్షల మరణాలు సంభవించాయని WHO తెలిపింది… సో, బీకేర్‌ఫుెల్…
Share this Article