Va Sam వాల్ మీద కనిపించిన ఓ పోస్ట్ ఒకసారి పూర్తిగా చదవండి… జర్నలిస్టులకు వైఎస్ ఇచ్చిన ఇళ్లస్థలాల విధానంబెట్టిదనిన…
2009లో చివరిసారిగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. వైఎస్సార్ మొదటి విడత పాలన ముగింపు దశలో ఇది జరిగింది. ఇప్పుడు మళ్లీ ఆయన తనయుడు జగన్ పాలనలో ఇళ్లస్థలాల కోసం జీవో కేటాయించారు. కానీ ఆనాటి విధానంతో పోలిస్తే నేటి జీవోలో పేర్కొన్న నిబంధనలు అనేకం కనిపిస్తున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి జర్నలిస్టుల సంఘాలను భాగస్వామ్యం చేస్తూ, అందరి అభిప్రాయాలు తీసుకుని జీవోలు విడుదల చేయడం ఆనవాయితీ. అంతకుముందు అశోక్ గజపతిరాజు, దేవేందర్ గౌడ్, పి జగన్మోహన్ రావు వంటి వారు రెవెన్యూ మంత్రులుగా ఉన్న సమయంలోనూ ఇది జరిగింది. దర్మాన ప్రసాదరావు రెవెన్యూ, ఆనం రామనారాయణ రెడ్డి సమాచారశాఖ మంత్రులుగా ఉన్న వైఎస్ పాలనలోనూ అనుసరించారు. జగన్ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరించింది.
Ads
అన్ని జిల్లాల్లోనూ జర్నలిస్టులకు నేరుగా ప్రభుత్వమే జీవో ఇచ్చి, ఇళ్ల స్థలాలు కేటాయించిన ప్రతీ సందర్భంలోనూ లబ్దిదారుని వాటాగా ఒకటి లేదా రెండు శాతం మాత్రమే వసూలు చేశారు. ప్రస్తుతం 40 శాతం అన్నారు. అది మార్కెట్ విలువనా, లేక ప్రభుత్వం నిర్ణయించిన ధరనా అన్నది జీవోలో స్పష్టత లేదు. దాంతో ఇది సామాన్య జర్నలిస్టులకు భారంగా మారబోతోంది.
జర్నలిస్టు కోటాలో ఇళ్లస్థలాలు కేటాయించిన సమయంలో వారికి సొంత ఇల్లు ఉందా లేదా అన్నది ఇంతవరకూ పరిగణనలోకి తీసుకున్న దాఖలాలు లేవు. కేవలం జర్నలిస్టులకు మాత్రమే కాకుండా వివిధ తరగతులు అంటే ఉద్యోగులు, న్యాయమూర్తులు, ఎమ్మెల్యేలు ఇలా అన్ని తరగతులకు ఇళ్ళస్థలాలు కేటాయించిన సమయంలో ఈ నిబంధన పెట్టలేదు. వాస్తవానికి మార్కెట్ ధరలో కొంత రాయితీ మీద కొనుగోలు చేస్తున్నప్పుడు ఈ నిబంధన అర్థరహితం అన్నది జర్నలిస్టుల వాదన.
ఎవరైనా జర్నలిస్టు భార్య పేరు మీద పసుపు-కుంకుమ కింద వచ్చిన ఇల్లు ఉన్నప్పటికీ ప్రస్తుతం అనర్హుడిగానే చెబుతున్నారు. కానీ వైఎస్సార్ ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో ఇలాంటి నిబంధన లేదు.
ఇటీవల పేదలందరికీ ఇళ్ల స్థలాల కేటాయింపు సమయంలో బీపీఎల్ కోటా కిందకు వచ్చే జర్నలిస్టులకు సెంటు స్థలాలు ఇచ్చారు. ఇప్పుడు వారిని కూడా అనర్హులంటూ తాజా జీవో చెబుతోంది. ఇలా షరతులు విధించడం వల్ల ఇళ్ల స్థలాలు ఇచ్చామని ప్రభుత్వం చెప్పుకోవడానికే తప్ప ఆచరణలో వర్కింగ్ జర్నలస్టులకు లబ్ది ప్రశ్నార్థకమే అన్నది జర్నలిస్టులు గగ్గోలు పెడుతున్న అంశం.
అబ్బే, జగన్ జీవో కరెక్టు, అందరికీ ఇళ్లస్థలాలు ఎలా ఇస్తుంది ప్రభుత్వం అంటూ అడ్డంగా సమర్థించేవాళ్లకూ కొదువ లేదు… కానీ స్థూలంగా పరిశీలిస్తే జగన్, కేసీయార్ ఇద్దరూ ఇద్దరే… పైగా ఇద్దరికీ పత్రికలున్నయ్, టీవీలున్నయ్… కానీ జర్నలిస్ట్ ఫ్రెండుగా ఉండే తత్వం లేదు… పైగా జర్నలిస్టులంటే ఓ చులకనభావం… వైఎస్ ప్రతి విషయంలో జగన్‌కు ఆదర్శం, అన్ని పథకాలకూ అవే పేర్లు… వైఎస్ లెగసీ అనే ప్రచారం… కానీ వైఎస్ ధోరణులకు పూర్తి వ్యతిరేకం జర్నలిస్టులకు సంబంధించి… కేసీయార్ కూడా సేమ్ జగన్…
అప్పుడెప్పుడో…, వైఎస్ ప్రజాప్రతినిధులు, కేంద్ర సర్వీస్ ఉన్నతాధికారులకు తోడు జర్నలిస్టులకు కూడా భూమి కేటాయించాడు… జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ కోఆపరేటింగ్ హౌజింగ్ సొసైటీ ఏర్పడింది… వడబోత అనంతరం ఫైనల్ లిస్టు ఖరారైంది… తీరా ఓ కేసు పడింది… సుప్రీంలో ఏళ్లకేళ్లు కొట్లాడాక జస్టిస్ రమణ పుణ్యామాని మోక్షం కలిగింది… కానీ కేసీయార్ రూపంలో సైంధవపాత్ర… అడ్డుపడ్డాడు…
ఇవ్వడు, మాట్లాడడు… పేరుకు జర్నలిస్ట్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని గప్పాలు… చేసేదేమీ ఉండదు… 100 మంది సొసైటీ సభ్యులు మరణించారు, ఐనా కేసీయార్‌లో అసలు మానవీయ కోణం అంటూ ఉంటే కదా స్పందించేది… సాక్షాత్తూ మీడియా యాజమాన్యాలే తన పాదాల మీద పడి పాకుతుంటే ఆప్టరాల్, ఈ జర్నలిస్టులెంత అనే ‘దొరతనం’ భావన… చెబుతూ పోతే బోలెడంత… జర్నలిస్టుల ఉసురు తగులుతుందా అంటే అది కాలం చెప్పాల్సిందే…
మరి జగన్ కూడా ఇంత వైఖరి ప్రదర్శించడం ఏమిటి…? చేతికి అసలు ఎముకే లేనట్టు… ఖజానా దివాలా తీస్తున్నా సరే, ఎన్నో సెక్షన్లకు ఉదారంగా డబ్బు పంచిపెడుతున్నాడు కదా… అందరి మెప్పూ పొందాలనే తాపత్రయం చూపిస్తున్నాడు కదా… (ఆ ఒక్క కమ్యూనిటీ తప్ప తనకు అందరూ కావల్సిన వాళ్లే కదా…) మరి తన తండ్రి వైెఎస్ ధోరణులకు భిన్నంగా వెళ్లడం ఏమిటి..? కొంపదీసి ఈటీవీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ5ల మీద ఉన్న కోపమంతా ఈ జర్నలిస్టుల మీద చూపించడం లేదు కదా…!!
Share this Article