Sai Vamshi…. ఒక వివాదం.. అది శ్యామ్ బెనెగల్ ‘అనుగ్రహం’ … ఇది చాలా పాత వివాదం. కానీ దీని గురించి ఏమీ తెలియని నాబోటి వాళ్లకు కొత్తగానే ఉండొచ్చు.
… ప్రఖ్యాత దర్శకుడు శ్యామ్ బెనెగల్ 1978లో తెలుగులో ‘అనుగ్రహం’ అనే సినిమా తీశారు. అందులో స్మితాపాటిల్, వాణిశ్రీ, అనంత్‌నాగ్, అమ్రిష్‌పురి, సులబ్ దేశ్‌పాండే, నిర్మలమ్మ, రావుగోపాలరావు నటించారు. ఏకకాలంలో అదే ఆర్టిస్టులతో హిందీలో ‘కొందుర’ పేరిట ఆ సినిమా తెరకెక్కింది. అయితే తెలుగులో రావు గోపాలరావు చేసిన పాత్ర హిందీలో శేఖర్ చటర్జీ పోషించారు. మరాఠీ రచయిత చింతామణి త్రయంబక్ ఖోనోల్కర్ రాసిన ‘కొందుర’ నవల ఈ సినిమాకు ఆధారం.
… ఈ సినిమాకు శ్యామ్ బెనెగల్, గిరీష్ కర్నాడ్ కలిసి స్క్రీన్ ప్లే రాయగా, తెలుగు వెర్షన్‌కి ఆరుద్ర డైలాగులు రాశారు. ఇక్కడే ఓ వివాదం రేగిందని అంటారు. మొదట ఆ సినిమాకు మాటలు/ పాటలు రాసేందుకు శ్రీశ్రీ గారిని అడిగారని, ఆ తర్వాత ఆయన చైనాకు వెళ్లి వచ్చేసరికి దర్శకుడు ఆరుద్ర గారి చేత రాయించారని అంటారు. ఈ విషయంపై శ్రీశ్రీ కోపం తెచ్చుకుని, ‘నాకు అవకాశాలు రాకుండా ఆరుద్ర చేస్తున్నాడని’ ఆయనపై ఆరోపణలు చేసినట్టు సమాచారం. ఇందులో ఏది నిజం, ఏది అవాస్తవం అనేదానిపై స్పష్టత లేదు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కో రకమైన సమాచారం ఉంది.
Ads
… ఆరుద్ర అలా వేరే వారి అవకాశం లాక్కునే మనిషి కాదని, శ్రీశ్రీ అందుబాటులో లేకనే శ్యామ్ బెనెగల్ ఆరుద్ర దగ్గరికి వచ్చారని ఒక ఇంటర్వ్యూలో ఆరుద్ర సహచరి రామలక్ష్మి తెలిపారు. ఈ వివాదం అనంతరం శ్యామ్ బెనెగల్ తనతో మాట్లాడుతూ “I never thought that Man is such a Petty Fellow” అని శ్రీశ్రీ గురించి అన్నట్టు ఆమె వివరించారు.
… విభిన్న మార్గాల్లో వెళ్లిన వారి రచనా వ్యాసంగమే వారి మధ్య మనస్పర్థలకు కారణమని ఒకరంటే, రామలక్ష్మి ఆరుద్ర జీవితంలోకి వచ్చాకే ఆరుద్ర, శ్రీశ్రీల మధ్య దూరం పెరిగిందని మరొకరంటారు. ఇద్దరి మధ్యా అసలు గొడవలే లేవని, కొంతకాలం అలా వ్యవహరించారని ఇంకొందరి మాట. ఒకానొక దశలో వివాదం శ్రుతి మించి రామలక్ష్మి గారిని శ్రీశ్రీ ‘తాటకి’గా అభివర్ణించారని కూడా ఒక మాటుంది. ఏవేవి నిజాలో ఆనాటి ఆ కాలం వారికి తెలియాలి.
PS: శ్యామ్ బెనెగల్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన సందర్భంగా (2005లో) ఆయన సినిమాల గురించి వార్త పత్రికలో ఆదివారం కవర్ స్టోరీ వచ్చింది. అప్పటికి దినపత్రికలు ఇంకా పత్రికల్లాగే ఉన్నాయి. ఆ వ్యాసంలో ‘అనుగ్రహం’ సినిమా గురించి రాస్తూ, ‘అనుగ్రహం సినిమా అనుభవంతో మళ్లీ స్టార్స్ జోలికి వెళ్లి సినిమాలు తీయనని శ్యామ్ బెనెగల్ ఒట్టు పెట్టుకున్నారు’ అని రాశారు. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది సరే, కానీ మళ్లీ స్టార్స్‌తో సినిమా చేయను అని ఒట్టు పెట్టుకునేంత స్థాయిలో వాళ్లు ఆయనకు ఏం ఇబ్బంది కలిగించారో మరి?! అయినా ‘అనుగ్రహం’లో ఉన్న స్టార్స్ ఎవరని?…. – విశీ
(వాణిశ్రీ ఆఫ్ బీట్ పాత్రలు చాలా తక్కువ… వాటిల్లో ఇదొకటి… తను స్మితాపాటిల్‌తో కలిసి నటించడం ఓ విశేషం కాగా… ఇందులో నిర్మలమ్మ డిఫరెంటుగా కనిపిస్తుంది… ఈ శ్యామ్ బెనెగల్ సినిమాలో ఆమ్రిష్ పురి, అనంతనాగ్, రావుగోపాలరావు కూడా ఉన్నారు… కన్నడ, తెలుగు, హిందీల మేలు కలయిక…)
Share this Article