పేరు, ఊరు ఎందుకు లెండి గానీ… ఓ సర్కిల్ ఇన్‌స్పెక్టర్… తన పేరు వినగానే బాదుడు గుర్తొచ్చేది… దొంగల నుంచి సమాచారం రాబట్టడంలో రోకలిబండను విపరీతంగా వాడేవాడు… హత్య కేసు, దొమ్మీ కేసు, హత్యాయత్నం కేసు, చోరీ కేసు… ఏదైనా సరే, అనుమానితుల్ని పట్టుకొచ్చేవారు… లాకప్పే ఇంటరాగేషన్ సెల్ అయ్యేది… ఆ దెబ్బలకు తాళలేక నేరాన్ని అంగీకరించేవాళ్లు లేదా నేర సమాచారం మొత్తం చెప్పేవాళ్లు… ఆయన దంచుడు మీద కథలుకథలు ఉండేవి…
అఫ్‌కోర్స్, మన ఇండియాలోనే కాదు, ప్రపంచంలోని పలు భాషల్లో పోలీసులు అవలంబించే ‘దర్యాప్తు పద్ధతి’ దాదాపు ఇదే… నిజానికి నేరదర్యాప్తు అనేది ఓ కళ… కాదు, సారీ… అదొక సంక్లిష్ట శాస్త్రం… ప్రపంచంలో శాస్త్రీయంగా దర్యాప్తులు చేసి, అనేక కొత్త పద్ధతులు కనిపెట్టిన పేరు స్కాట్లండ్ యార్డ్ పోలీసులదే అనుకుంటా…
వేలిముద్రలు, ఊహాచిత్రాలు, మోటివ్స్, లాజిక్స్, డీఎన్ఏ పరీక్షలు మొదలుకొని ఫోన్ కాల్స్, నిఘా, జీపీఎస్ హిస్టరీ, థంబ్ నెయిల్ డేటా, ఐరిస్ ఎట్సెట్రా దాకా ఫోరెన్సిక్ సైన్స్ ఈమధ్యకాలంలో నేరదర్యాప్తు బాగా డెవలపైంది… ఐనా సరే, మనవాళ్లకు రోకలిబండే ప్రాథమిక ఆధారం… సరే, మన సినిమాలే తీసుకొండి… సేమ్… కథలో ఎంత మిస్టరీ హత్యలైనా సరే… పోలీస్ అంటే సూపర్ కాప్… వీళ్లకు కూడా దంచుడే తెలుసు…
Ads
హీరో సారు వాడు ఓ సాంగ్‌తో ఎంట్రీ ఇస్తాడు, యూనిఫామ్ అంటే లెక్కలేదు, తూటాలకు లెక్కలుంటాయనీ తెలియదు, ఉన్నతాధికారులంటే గౌరవమూ లేదు… అసలు ఈ ఫోరెన్సిక్ మన్నూమశానం, సీన్ రిక్రియేషన్ తొక్కాతోలూ ఏమిట్రా భయ్ అంటాడు… ఓ ఐటమ్ సాంగ్ కూడా వేసుకుని, నేరుగా క్రిమినల్స్ డెన్‌లోకి వెళ్లిపోతాడు… వాళ్ల చేతుల్లో మెషిన్ గన్నులున్నా సరే, హీరో బండలు కొట్టే గన్ను తీసుకుని ఇరగదీస్తాడు… ఒక్కో దెబ్బకు వంద మంది రౌడీలు సఫా… కొందరు అంతరిక్షంలోకి, కొందరు అంగారక గ్రహంలోకి వెళ్లిపడతారు… థియేటరంతా నెత్తుటి వాసన…
ఇప్పుడు ఒక హీరోయిన్ సరిపోవడం లేదు కదా… ముగ్గురు, తలా ఓ పాట… పిచ్చి గెంతులు… లాజిక్కులు గట్రా ఏమీ ఉండవ్… కాకపోతే తోడుగా వెకిలి కామెడీ చేసే బ్యాచ్ ఉంటుంది… వాళ్లు పోలీస్ స్టేషన్‌లోనే ‘నా పెట్టే తాళం’ అంటూ లేడీ కానిస్టేబుళ్లతో బూతు పాటలు పాడుకుంటారు… అసలు సూపర్ కాప్ సినిమా ఇలా ఉండాలి కదా… మన వాళ్లు ఓ బెంచ్ మార్క్ సెట్ చేసి పెట్టారు కదా… కానీ ఈ మలయాళం వాళ్లకు ఏమైనా పిచ్చా..?
తాజాగా Anweshippin Kandethum అని ఓ సినిమా తీశారు లెండి… ఆ కేరళ వాళ్లకు బొత్తిగా టేస్ట్ లేదు… 10 కోట్ల సినిమాకు 50 కోట్ల వసూళ్లు ఇచ్చారు… అదిప్పుడు తెలుగులోకి ఓటీటీ ద్వారా వచ్చింది… ఛఛ, మనవాళ్ల పరువు తీశారు… సగటు ఇండియన్ సినిమా సూపర్ కాప్ లక్షణాలే లేవు… హీరో ఇమేజీ బిల్డప్పులు ఉండవ్… తన టీం పోలీసులు కమెడియన్లుగా బిహేవ్ చేయరు, ఒక్క కుర్చీ మడత పాట లేదు… బూతుల్లేవు… ఏదో పోస్టల్ స్టాంపు మీద ముద్రను పట్టుకుని, తీగ లాగడం మొదలుపెడతాడు… ఏవేవో డొంకలు కదులుతాయి… టీం అంతా ప్రొఫెషనల్స్‌లా కనిపిస్తుంటారు…
మొదట ఓ మర్డర్ కేసు… బదనాం అయిపోయి, సస్పెండ్ కూడా అవుతారు… అనధికారికంగా మరో మర్డర్ కేసు ఇస్తారు ఉన్నతాధికారులు, గ్రామస్థులు ఎవరూ సహకరించరు… దర్యాప్తు స్టార్ట్ చేశాక కథలో ట్విస్టులు… అవేమో మన ఊహకు అందవు… సెకండాఫ్ కాస్త స్లో అనిపించినా సరే, లాజిక్కు లేకుండా సీన్లు కనిపించవు… స్ట్రెయిన్ నెరేషన్… ఎక్కడా కథ పక్కదోవ పట్టదు… ఆ నటీనటులు, ఆ 24 క్రాఫ్ట్స్ మనకు బొత్తిగా పరిచయం లేదు… ఐనా ఓటీటీలోనూ ఇరగదీస్తోందట… ఏమో మనవాళ్ల టేస్టు కూడా మలయాళ ప్రేక్షకులకు మల్లే చెడిపోతున్నట్టుంది సుమీ…!!
Share this Article