.
పొద్దున్నే సాక్షిలో ఓ వార్త చూడగానే… వైరాగ్యంతో కూడిన ఓ నవ్వు వచ్చింది అర్జెంటుగా..! అయితే ఆ వార్త రాసుకోకతప్పదు సాక్షికి… ఇంతకీ ఆ వార్త ఏమిటంటే..?
మీడియాపైనా కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని రుద్దుతోందనీ… మీడియా స్వేచ్ఛను తొక్కేస్తోందనీ… జర్నలిస్టు సంఘాలు విరుచుకుపడ్డాయనీ… ఎన్టీవీ, టెన్‌టీవీ, టీవీ9, సాక్షి మీడియా సంస్థలను అసెంబ్లీ కవరేజీ నుంచి నిషేధించారనీ వార్త సారాంశం…
Ads
అవును… ఆ ఊరు నుంచి ఈ ఊరు ఎంత దూరమో… ఈ ఊరు నుంచి ఆ ఊరు కూడా అంతే దూరం కాదా…? జగన్ అధికారంలో ఉన్నప్పుడు చేసిందేమిటి మరి..? టీవీ5, ఏబీఎన్, ఈటీవీలను నిషేధించింది ఎవరు..? అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వనిది ఎవరు..?
ఆ స్పూర్తినే కూటమి ప్రభుత్వం అందిపుచ్చుకుని, వెంటనే అమల్లోకి పెట్టింది… ఇక నిందించడానికి ఏముంది ఇక్కడ..? దొందూ దొందే కదా… జగన్ టీడీపీ నాయకుల వెంట పడ్డాడు అప్పట్లో… ఇప్పుడు చంద్రబాబు వైసీపీ నేతల వెంట పడుతున్నాడు… అంతా సేమ్ సేమ్… జగన్ అయితే ప్రధానంగా ఓ కులాన్ని టార్గెట్ చేశాడు…
అసలు ఏపీ పాలిటిక్స్ అంటేనే… పార్టీల నడుమ పోరాటం మాత్రమే కాదు… అది కులాల మధ్య పోరాటం… అన్నింటికీ మించి మీడియా సంస్థల నడుమ పోరాటం… బయటికి ఏం ముసుగులతో కనిపించినా సరే.., జర్నలిస్టు సర్కిళ్లు, పొలిటికల్ సర్కిళ్లు మీడియాపై ముద్రలు వేసేశాయి… సాక్షి, సాక్షి టీవీ, ఎన్టీవీ, టీవీ9, టెన్ టీవీ ఎట్సెట్రా జగన్ వైపు అట… ఏబీఎన్, ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఈటీవీ, టీవీ5, మహాన్యూస్ ఎట్సెట్రా చంద్రబాబు వైపు అట…
వాళ్లు అధికారంలో ఉంటే వీళ్ల చానెళ్లు చూడనివ్వరు… వీళ్లు అధికారంలో ఉంటే వాళ్ల చానెళ్లు చూడనివ్వరు… జగన్ అధికారంలో ఉన్నప్పుడు నా ప్రత్యర్థులు చంద్రబాబు కాదు, కేవలం ఆంధ్రజ్యోతి, ఈనాడు అని బహిరంగంగానే ప్రకటించాడు కదా… చంద్రబాబు గతంలో అధికారంలో ఉన్నప్పుడు సాక్షిని మూసేయించాలని ప్రయత్నించాడు, కానీ కుదర్లేదు… జగన్ వచ్చాక ఏకంగా ఈనాడు ఆర్థికమూలాల్ని దెబ్బకొట్టడానికి ప్రయత్నించాడు… (గతంలో వైఎస్ చేసినట్టుగానే…)
ఇప్పుడు సీన్ రివర్స్… మొన్నమొన్నటిదాకా జగన్‌కు లోలోపల మద్దతుదారుగా ఉన్న బీజేపీ ఇప్పుడు బాబు కూటమిలో భాగస్వామి… పొత్తు… గతంలో సాక్షిని మూత వేయించడంలో విఫలమైనా సరే… ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా తనతోనే ఉన్నందున, తన మీద ఆధారపడి ఉన్నందున ఇక సాక్షి సంస్థపై అంకుశం ప్రయోగిస్తున్నాడు… ఐతే పార్టీపరంగానో, ప్రభుత్వపరంగానో కాదు… ఆంధ్రజ్యోతిని ముందు పెట్టి కథ నడిపిస్తున్నాడు… ఇలా…
మొదట సైబర్ క్రైమ్‌లో ఓ కేసు… ఎవరు తమ న్యూస్ సైట్‌ను ఓపెన్ చేసినా, అది సాక్షి సైట్‌కు మళ్లేలా, తనకు ఆర్థికనష్టం ప్లస్ రీడర్‌షిప్ నష్టం కలిగించే కుట్రకు సాక్షి పాల్పడిందనేది కేసు… ఇది నిలబడటం కాస్త కష్టమే… ట్యాగింగ్‌ను నేరంగా నిరూపించడం కష్టమేనని డిజిటల్ ఫీల్డులో ఉన్నవాళ్లు చెబుతున్నారు..,
ఆల్రెడీ ఆ ట్యాగులన్నీ సాక్షి తొలగించిందని ఆంధ్రజ్యోతే చెబుతోంది, కానీ తనకు జరిగిన ఆర్థికనష్టం మాటేమిటనేది కొత్త వాదన… ఆ కుట్రకు శిక్ష పడాలని ప్రయత్నం… అందుకే కేసు నమోదు… సాక్షి ఎడిటర్ మీద ఏదో స్టోరీకి సంబంధించి ఇప్పటికే కేసు నమోదు చేశారు… ఇవి ఆగకపోవచ్చు… మురళి ఎడిటర్ కుర్చీ దిగిపోయాడు కాబట్టి ఇక టార్గెట్ కొత్త ఎడిటర్ ధనుంజయరెడ్డి అవుతాడేమో…
మరొకటి… తమ ఓబీ వ్యాన్ శాటిలైట్ ఫ్రీక్వెన్సీని సాక్షి హ్యాక్ చేయించిందనేది మరో ఆరోపణ… దీనిపై ఇస్రోకు ఫిర్యాదు చేసినట్టు ఆంధ్రజ్యోతి చెబుతోంది… దీని మీదే విజయవాడ పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు… ఇంకొకటి… సాక్షి టీవీ మీద న్యూస్ బ్రాడ్‌కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీకి ఫిర్యాదు చేయడం… అసలు సాక్షి టీవీకి సెక్యూరిటీ క్లియరెన్సే లేదని ఆ ఫిర్యాదులో ఒక అంశం…
ఐతే దీని మీద హైకోర్టులో స్టే ఉంది… కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదులు చేసి, మోడీ ప్రభుత్వంతోనే సాక్షి మీద అంకుశం ప్రయోగించాలనేది కూటమి ప్రభుత్వ ప్రయత్నం… పేరుకు పైకి ఇది సాక్షి వర్సెస్ ఆంధ్రజ్యోతిలాగే కనిపిస్తుంది… కానీ సాక్షిని మూసేయించాలనే సంకల్పమే బలంగా కనిపిస్తోంది…
ఆల్రెడీ సాక్షి పత్రికల్ని కొనేందుకు వాలంటీర్లు డబ్బులు ఇచ్చే జగన్ జీవోను చంద్రబాబు రద్దు చేసిన సంగతి తెలిసిందే… ఐదేళ్ల కాలంలో సాక్షికి ఇచ్చిన యాడ్స్‌పై విచారణ ఫైల్ రెడీగానే ఉంది… ఆల్రెడీ యాడ్స్ ఆపేశారు… ప్రస్తుత ఫిర్యాదులు, కేసులు ఫలించకపోతే మరో సీరియస్ ఎఫర్ట్ కూటమి ప్రభుత్వం నుంచి లేదా యెల్లో కూటమి నుంచి తప్పదు..!!
ఈ నేపథ్యంలో నాలుగు చానెళ్లపై కూటమి ప్రభుత్వ తాజా నిషేధం పెద్ద ఆశ్చర్యం ఏమీ అనిపించడం లేదు… ఐతే ఈ నిషేధం కేవలం అసెంబ్లీ వార్తల ప్రసారం వరకే… ఇదిక్కడ ఆగిపోతుందని అనుకోలేం..!! అప్పట్లో జగన్ ప్రభుత్వ నిర్ణయం మీద గగ్గోలు పెట్టిన ఈనాడు, ఆంధ్రజ్యోతి తాజా నిషేధంపై సైలెన్స్… సహజమే కదా..!!
Share this Article