బీజేపీ సున్నా… జనసేన సున్నా… లెఫ్ట్ సున్నా… గతంలో ఊళ్లేలిన, రాజ్యమేలిన కాంగ్రెస్ సహా ఊరూపేరూ గుర్తుకురాని చిన్నాచితకా పార్టీలు ఇంకా ఏమైనా ఉంటే అవీ సున్నా…. ఇది అసలు విశేషమే కాదు… వాటికి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద సీన్ లేదు… కానీ తెలుగుదేశం పరిస్థితి ఏమిటి..? దానికీ ప్రజలు సున్నాలేశారు…! పంచాయతీ ఎన్నికలంటే, రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగిన ఎన్నికలు కాబట్టి, గెలిచిన వాళ్లను మన ఖాతాలో వేసుకుని, మేం సగం గెలిచాం అని జబ్బలు చరుచుకోవచ్చు… లెక్కాపత్రం ఏదీ ఉండదు కాబట్టి, ఇవి వాళ్లవి, ఇవి వీళ్లవి అని ఎవరూ చెప్పలేరు… కానీ మున్సిపల్ పోల్స్ అలా కాదు కదా… టీడీపీ అనూహ్యంగా కొట్టుకుపోయింది… ఈ స్థాయి పరాజయం అసాధారణం ఆ పార్టీకి… కంచుకోటల్లా భావించే సీట్లను కూడా కోల్పోయి ‘‘పేకాటలో సర్వం ఓడిపోయి అడ్డబట్టతో మిగిలిపోయినట్టు’’ తయారైంది… చంద్రబాబు తలెత్తుకోలేని పరాజయం… ఓటమికి సాకులు ఎన్నయినా చెప్పుకోవచ్చుగాక… అవి మరింత తలవంపులు… నిజాయితీగా, వినమ్రంగా ఓటమిని అంగీకరించడం మేలు…
ఇక్కడ కొన్ని అంశాలు ప్రధానంగా చెప్పుకోవాలి… ఈ కథనం రాసే సమయానికి వైసీపీ 11 కార్పొరేషన్లకు గాను 10 గెలిచేసింది… కీలకమైన విజయవాడనూ గెలవబోతోంది… 75 మున్సిపాలిటీలకు గాను 73 గెలిచేసింది… అధికారంలో ఉన్న పార్టీకి స్థానిక ఎన్నికల్లో కొంత అడ్వాంటేజ్ ఉంటుందనేది నిజమే అయినా మరీ ప్రధాన ప్రతిపక్షానికి ఈ స్థాయి పరాజయం ఊహించలేనిదే… పైగా మునుపెన్నడూ లేనివిధంగా చంద్రబాబు చాలా మెట్లు దిగిపోయి… అంతటి సీనియర్ నాయకుడు ఊరూరూ తిరుగుతూ… దిక్కుమాలిన పీకుడు భాష మాట్లాడుతూ… వోటర్లను సిగ్గు లేదా, శరం లేదా, ఇంట్లో పడుకుంటారా, పౌరుషం లేదా అంటూ తెగ తిట్టిపోసి, ఎగదోసేందుకు విశ్వప్రయత్నం చేశాడు… అదేసమయంలో జగన్ మాత్రం ప్రచారానికే వెళ్లకుండా సైలెంటుగా ఉన్నాడు… వచ్చిన రిజల్టేమో తెలుగుదేశాన్ని ఈడ్చిపారేసింది… నిజమే… పార్టీలన్నాక ఒడిదొడుకులుంటయ్… రాజకీయాలన్నాక ఎగుడూదిగుళ్లుంటయ్… ఎన్నికలన్నాక గెలుపూఓటముంటయ్… కానీ ఇది మరీ సీరియస్ ఆత్మవిమర్శ చేసుకుని, దిద్దుబాటుకు శ్రీకారం చుట్టాల్సిన సందర్భమే… విస్మరిస్తే, లైట్ తీసుకుంటే… అసలే సగానికి విరిగిన టైటానిక్ ఇక మునిగిపోవడమే…
Ads
జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి ఈ ఎన్నికల్ని రెఫరెండమ్ అన్నట్టుగానే తెలుగుదేశం క్యాంపు చిత్రీకరించింది… మరి ఇప్పుడు వైజాగ్, కర్నూలు విజయాలు… పాలన రాజధాని, న్యాయరాజధాని అనే ప్రతిపాదనలకు ఆ ప్రజల ఆమోదం అనుకోవాల్సిందేనా..? అమరావతి మీద ఏడాదికి పైగా గాయిగత్తర లేపాలని ప్రయత్నిస్తున్నా పెద్దగా జనంలో స్పందన లేదు… ఇప్పుడు కీలకమైన విజయవాడ, గుంటూరు, వినుకొండ, చిలకలూరిపేట, తెనాలి… మొత్తం జగన్ పార్టీకే జైకొట్టాయి… అంటే అమరావతిని తరలించినా సరే బేఫికర్ అని ఆ ప్రాంత ప్రజలు స్పష్టంగా చెప్పేసినట్టేనా..? రెఫరెండమే కదా మరి..? నిజంగానే ప్రజలు ఆగ్రహంతో ఉంటే జగన్ అభ్యర్థులను ఛీకొట్టాలి కదా, చిత్తుగా ఓడించాలి కదా… అదేమీ జరగలేదు కదా… చివరగా… నిమ్మగడ్డ రమేష్‌కుమార్ గెలికీ గెలికీ, చివరకు ఎన్నికల దాకా జగన్ పార్టీని లాక్కొచ్చాడు… కానీ మంచే చేశాడు… ఎన్నికల కమిషనర్‌గా తన పంతం నెరవర్చుకోవచ్చుగాక… కానీ వైసీపీకి మంచే జరిగింది అంతిమంగా… ఆయన గెలిచినట్టా..? ఓడినట్టా..? అయితే ఈ ఫలితాలు జగన్ పాలన విధానాలకు సంపూర్ణ ఆమోదముద్ర ఏమీ కాకపోవచ్చు… ప్రజల్లో కొన్ని అంశాల్లో అసంతృప్తి ఉండవచ్చు… కానీ రాజకీయంగా అందిపుచ్చుకోవటానికి ఎవరూ లేరు… అదే ఈ పురపాలక ఎన్నికలు తేల్చేసిన స్పష్టమైన తీర్పు సారాంశం…!!
Share this Article