Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అపూర్వ చరణ్..! హాలివుడ్ పై ‘జెండా’ పాతిన తెలుగింటి అమ్మాయి..!

June 24, 2025 by M S R

.

Akula Amaraiah హాలివుడ్ పై ‘జెండా’ పాతిన తెలుగింటి అమ్మాయి!
Apoorva Charan’s journey inspires us to dream beyond geographies..

లాస్ ఏంజిల్స్… 2025 జూన్ 5..  AT&T and Tribeca Festival.. ఒకటా, రెండా.. 320 టీమ్స్.. ఫైనల్ లో 5 మిగిలాయి. మిలియన్ డాలర్ల అవార్డు, 2026లో Tribeca ఫిలిం ఫెస్టివల్ లో సినిమాను ప్రదర్శించే ‘అపూర్వ’ ఛాన్స్..

Ads

నరాల తెగే ఉత్కంఠ. వందలాది మంది సీట్లకు అతుక్కుపోయారు. జ్యూరీలోని ఆరుగురు పెన్నూ పేపర్లతో వేదికపై సిద్ధంగా ఉన్నారు. ఫైనలిస్టుల ప్రజంటేషన్లు పూర్తయ్యాయి. ఒకదాన్ని మించి మరొకటి.. జ్యూరీ తలలు పట్టుకుంది. హాలు హాలంతా మౌనం రాజ్యమేలుతోంది.. అలా కొన్ని క్షణాలు..

యాంకర్ మైకు తీసుకుంది… జ్యూరీ సభ్యులొక్కక్కరు లేచి పోడియం ముందున్న మైకు ముందుకు వచ్చారు.
న్యాయనిర్ణేతల్లో ఒకరు స్టేజీపై పెట్టిన బోర్డును కప్పి ఉంచిన తెరను తొలగిస్తుండగా జ్యూరీ సభ్యులందరూ ఏకకంఠంతో ఒక్కసారిగా.. AT&T Untold Stories-2025 విన్నర్ ఈజ్ Take Me Home అనడంతో ప్రేక్షకులు కరతాళ ధ్వనులు మిన్నంటాయి. ఆ చిత్ర బృందం కంట ఆనంద భాష్పాలు రాలాయి.

ఆ విజేతే ‘Apoorva Charan’… చిత్ర నిర్మాత… అమెరికాలో చిన్న చిత్రాల స్పెషలిస్ట్… తెలుగు మూలాలున్న మనమ్మాయి… పూర్తి పేరు అపూర్వ చరణ్… తల్లి తండ్రులు హరిచరణ్, సుకన్య. అనంతపురం జిల్లా… వాళ్లున్నది హైదరాబాద్… ఎస్.ఆర్.నగర్ లో వాళ్లకే ఓ స్కూలుండేది… అపూర్వ అక్కడే ఎల్.కేజీ చదివింది. ఆ తర్వాతే అమెరికా చేరారు…

కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్ సహా వివిధ ప్రాంతాల్లో అపూర్వ విద్యాభ్యాసం సాగింది. సింగపూర్ మేనేజ్మెంట్ యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్, న్యూయార్క్ కొలంబియా యూనివర్సిటీ నుంచి క్రియేటివ్ ప్రొడక్షన్, స్క్రిప్ట్ రైటింగ్ లో MFA (మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్) డిగ్రీ పొందారు. అమెరికన్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ (AFI) కన్సర్వేటరీలో ఫెలోగా ఉన్నారు.

తల్లిదండ్రులిద్దరికీ కళలన్నా, సినిమాలన్నా మక్కువ ఎక్కువే. సాహిత్యమంటే చెవి కోసుకునేంత ప్రేమ. ఒకట్రెండు తెలుగు సినిమాలూ తీసి చేతులు కాల్చుకున్న సందర్భాలు లేకపోలేదు. తండ్రి బాటలోనే నడిచిన అపూర్వ సినీరంగాన్నే ఎంచుకున్నారు. సృజనాత్మకతకు పెట్టింది పేరు. చలనచిత్ర నిర్మాతగా, దర్శకురాలిగా, నటిగా కూడా ఎదిగారు. సినీరంగంలో తన ప్రత్యేకతను చాటుకునేందుకు పాటుపడుతున్నారు.

కమర్షియల్ ఫార్మాట్ కు భిన్నంగా సామాజిక ఇతివృత్తాలు, సమగ్రతను ప్రోత్సహించే ప్రాజెక్ట్‌లపై దృష్టి సారించారు. స్త్రీలు, కుటుంబ డైనమిక్స్, ట్రాన్ జెండర్లు, ఇతర సామాజిక అంశాలే ఇతివృత్తాలుగా సినిమా నిర్మాణం చేపట్టారు.

తన ఆర్ధిక పునాదులు ఏమిటో బాగా తెలిసిన అపూర్వ తన తెలివితేటలతో విశ్వవ్యాప్తంగా ఉన్న patrons, Investors, Sponsors ను ఒప్పించి మెప్పించి సినిమాలు తీయడం మొదలుపెట్టారు. వైవిధ్య కళాకారులకు అవకాశాలను సృష్టించడంలో తనకు తానే సాటి అని నిరూపించుకుంటున్నారు. నమ్మకాన్ని వమ్ముచేయకుండా విజయపథంలో సాగుతున్నారు.

సింగపూర్‌లోని ఫ్రెమాంటిల్ మీడియాలో డిజిటల్ ప్రొడ్యూసర్‌గా కేరీయర్ ను ప్రారంభించారు. “ఆసియా’స్ గాట్ టాలెంట్”, “X ఫ్యాక్టర్ ఇండోనేషియా”, “థాయ్‌లాండ్’స్ గాట్ టాలెంట్” వంటి ప్రముఖ టెలివిజన్ షోలపై పని చేశారు.

ఫీచర్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ గా అపూర్వ 2022లో తీసిన తొలి సినిమా Joyland. ఈ చిత్రం విమర్శకుల మెప్పు పొందింది. 2022లో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి ఎంపికైంది. Un Certain Regard జ్యూరీ ప్రైజ్, Queer Palm, 2023లో ఇండిపెండెంట్ స్పిరిట్ అవార్డ్స్‌లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డులను గెలుచుకుంది. తెలుగు నుంచి RRR ఇండియా నుంచి వస్తే Joyland పాకిస్తాన్ నుంచి ఆస్కార్ షార్ట్‌లిస్ట్‌లోకి చేరిన తొలి చిత్రంగా నిలిచింది.

ప్రస్తుతం HBO Maxలో స్ట్రీమింగ్ లో ఉన్న Lonely Blue Night లఘు చిత్రం ఆమె తీసిందే. AFI ఫెస్ట్ 2020లో ఆడియన్స్ అవార్డ్ గెలుచుకుంది. Distance (2018) చిత్రాన్ని 29వ సింగపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. 2020లో ఫిల్మ్ పైప్‌లైన్ బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ గెలుచుకుంది. Interiors (2018) చిత్రం టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయింది.

అపూర్వ చరణ్ “Gulaab” అనే పాకిస్తాన్‌ ప్రాంతంలో సెటప్ చేసిన ఫీచర్ ఫిల్మ్‌ను ప్రొడ్యూస్ చేశారు. ఇది 2018లో లోకార్నో ఫిల్మ్ ఫెస్టివల్‌లో Open Doors Hub కోసం ఎంపికైంది. “Akra” అనే భారతీయ తీర ప్రాంతంలో సెటప్ చేసిన సిరీస్‌పై కూడా ఆమె పని చేశారు.

చిన్న వయసులోనే అపూర్వ అనేక అవార్డులు రివార్డులు గెలుచుకుంది. 2019లో Project Involve Creative Producing ఫెలో, 2020లో Film Independent Creative Producing Lab ఫెలో, 2021లో Women in Film Emerging Producers ఫెలో, 2022లో Sundance Creative Producing Lab ఫెలో, 2023లో BAFTA Breakthroughగా గుర్తింపు పొందారు.

ప్రస్తుతం లాస్ ఏంజెలెస్‌లో ఉంటున్న అపూర్వ “All Caps” అనే ఫిల్మ్, టీవీ ప్రొడక్షన్ కంపెనీ ద్వారా గ్లోబల్ ప్రేక్షకుల కోసం ప్రత్యేక కథనాలను రూపొందిస్తున్నారు.

Joyland చిత్రంతో ఆస్కార్ రేసులో నిలిచిన తెలుగింటి అమ్మాయి ఈసారి AT&T అన్‌టోల్డ్ స్టోరీస్ గ్రాంట్ గెలుచుకొని మరో గొప్ప విజయాన్ని సొంతం చేసుకుంది. వందలాది చిత్రాలను పక్కకు నెట్టి ఆమె ప్రొడ్యూస్ చేస్తున్న “Take Me Home” అనే చిత్రం ఎంపికైంది.

ఈ గ్రాంట్ గెలవడమంటే కేవలం డబ్బు గెలవడం కాదు అంతర్జాతీయ గుర్తింపు పొందడం. చిత్ర నిర్మాణంలో మద్దతు, విడుదలకు మార్గం సుగమం చేసుకోవడం ఒక ఎత్తయితే న్యాయనిర్ణేతలు ఆమె ఎంచుకున్న కథపై గొప్ప నమ్మకాన్ని ఉంచడం నెక్ట్స్ లెవెల్.

ఈ గ్రాంట్ గెల్చుకున్న తర్వాత అపూర్వ చరణ్ ఎంతో ఒద్దికతో మాట్లాడిన నాలుగు మాటలు సభికుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తాయ. ప్రపంచ జనాభాలో సుమారు 130 కోట్ల మందికి, అంటే దాదాపు 16 శాతం మందికి cognitive disability (మానసిక ఎదుగుదల లోపం) ఉంది.

ఇందులో బౌద్ధిక వైకల్యంతో (ఇంటెలెక్చువల్ డిసెబిలిటీ) పాటు మెదడు సంబంధిత సమస్యలతో బాధపడే వారూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1-3 శాతం మందిని అంటే దాదాపు 20 కోట్ల మందిని బౌద్ధిక వైకల్యం ప్రభావితం చేస్తోంది. అలాగే, డిమెన్షియా (మతిమరుపు) అనే మెదడు సంబంధిత సమస్య ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 4.7 కోట్ల మందిని ప్రభావితం చేస్తోంది.

ఇటువంటి కథాంశంతో వస్తున్న చిత్రం TAKE ME HOME. ఈ చిత్రానికి లిజ్ సార్జెంట్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కథ అన్నా అనే 38 ఏళ్ల కొరియన్ దత్తత కుమార్తె చుట్టూ తిరుగుతుంది. మెదడులో కణితి కారణంగా మామాలుగా ఎదగాల్సిన ఆమె మెదడు ఎదగదు. దాన్ని ఇంగ్లీషులో Childhood Disintegrative Disorder (CDD) అంటుంటారు.

దీనివల్ల జ్ఞాపకశక్తి తక్కువ ఉంటుంది. శరీర ఎదుగుదల మాత్రం సజావుగానే ఉంటుంది. దీనివల్ల వచ్చే సమస్యలు, కుటుంబం, వైకల్యం, దత్తత, సంరక్షణ వంటి వాటిని ఈ చిత్రం డీల్ చేస్తుంది. అన్నా జీవితం- కుటుంబ డైనమిక్స్‌ను ఎలా అస్తవ్యస్తం చేస్తుందో చూపే కన్నీటి కావ్యమే TAKE ME HOME. ఇద్దరు అప్పచెల్లెళ్ల మధ్య సాగే భావోద్వేగ యాత్ర ఈ కథ.

‘ఈ సినిమా కేవలం వైకల్యం గురించి కాదు. ఇది గుర్తింపు గురించి. కుటుంబం గురించి. ఒకరి భావాలు మరొకరికి అర్థమయ్యే క్షణాల గురించి..’’ అని అపూర్వ చెబుతోంది.

అన్‌టోల్డ్ స్టోరీస్ విజేతకు AT&T, ట్రైబెకా సంస్థల నుంచి ఏడాది పొడవునా మద్దతు ఉంటుంది. ట్రైబెకా ఫెస్టివల్‌లో ప్రీమియర్‌కు ముందు మాత్రమే కాకుండా, ప్రపంచ ప్రదర్శన అనంతరం కూడా విజేతకు పలు అంశాల్లో సూచనలు సలహాలు ఇస్తుంది.

2017లో ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు అన్‌టోల్డ్ స్టోరీస్ కి 2,750కిపైగా దరఖాస్తులు వచ్చాయి. విజేతల చిత్రాలు ప్రధాన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారాలన్నింటిపై ప్రసారం అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 120కిపైగా ఫిల్మ్ ఫెస్టివళ్లలో ప్రదర్శితమయ్యాయి. ఫిలింక్రిటిక్ సంస్థ- రాటెన్ టొమాటోస్ (Rotten Tomatoes) వీటికి ఇచ్చిన సగటు రేటింగ్ శాతం 94.

అటువంటి అత్యున్నత సంస్థ ఇచ్చే గ్రాంట్ కి మన తెలుగింటి అమ్మాయి ఎంపిక కావడం రియలిస్టిక్ సినిమాలకు దక్కిన ఖ్యాతిగానే భావించాలి. చిన్న చిన్న అవార్డులు, రివార్డులకే అత్యుత్సాహం చూపే మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ప్రత్యేకించి తెలుగు మీడియాకి ఈ వార్త పట్టకపోవడం నిజంగా బాధాకరమే.

ఈ అవార్డుతో అపూర్వ చరణ్ అమెరికన్ చిత్రసీమలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు. ఇది ఆమె వ్యక్తిగత విజయం మాత్రమే కాదు – ప్రాంతీయ మూలాలు వెతుకుంటున్న వారి సరికొత్త కల కూడా. అపూర్వ శక్తిసామర్థ్యాలపై ఓ పెద్ద సంస్థ ఉంచిన నమ్మకం, ఓ భావోద్వేగ నడక.

‘నేను చేయాలనుకున్నది సినిమా కాదు. నిజంగా చూడని జీవితాన్ని చూపించడమే’ అని అపూర్వ చరణ్ చెప్పిన మాట మానవసంబంధాలపై ఆమెకున్న మమకారాన్నీ, విచ్ఛిన్నమవుతున్న కుటుంబ బాంధవ్యాలను చాటుతుంది.

ఆల్ ది బెస్ట్ అపూర్వ. మరిన్ని విజయాలు సాధించాలని మా ఆకాంక్ష. AMARAIAH AKULA   +919347921291

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అపూర్వ చరణ్..! హాలివుడ్ పై ‘జెండా’ పాతిన తెలుగింటి అమ్మాయి..!
  • శుకపికముల కలరవముల స్వర లహరులలో… ఏదో రసాన్వేషణ..!!
  • ఎవరీ కొత్త రఘువరన్..? తెలుగు తెరకు కొత్త విలన్..! భలే పట్టుకొచ్చారు..!!
  • పాకిస్థాన్ వెళ్లడానికి మిల్కాసింగ్ ససేమిరా… నెహ్రూ ఒత్తిడి… ఎందుకు..?!
  • గానకోకిల… తెలుగు పాటను ఎందుకు ఇష్టపడలేదు..? ఎవరు కారణం..?
  • కడుపులా..? చెత్త కుండీలా..? వంటల వీడియోలతో బహుపరాక్..!!
  • కాజోల్ మీదొట్టు… రామోజీ ఫిలిమ్ సిటీ దెయ్యాలన్నీ పారిపోయాయ్..!!
  • ఇది శేఖర్ కమ్ముల సినిమా కానేకాదు… కుబేరపై ప్రశంసలకు మరో కోణం…
  • ఎదిగే దశలోనే ఒద్దిక, అణకువ అవసరం… ఫాఫం… తెలియనట్టుంది…
  • ఫాఫం రష్మిక…! స్టిల్ సొంతిట్లో నిరాదరణే…! కుబేర భారీ డిజాస్టర్…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions