కోవై సరళ… తెలుగు ప్రేక్షకులకు ఎవరూ కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు… సూపర్ టైమింగుతో కామెడీని పండించే ఈమె హఠాత్తుగా ఓ సీరియస్ పాత్రలో… ఎమోషన్స్‌ను పండించి అందరి ప్రశంసలూ అందుకుంటున్న తీరు విశేషం… తెలుగు, తమిళ సినిమాల్లో దాదాపు ప్రతి సీనియర్ కమెడియన్‌తోనూ కలిసి నటించిందామె…
కోవై సరళ అనగానే ఆమె పోషించిన కామెడీ పాత్రలే మనకు మనోచిత్రంలో కదలాడతాయి… అలాంటిది సెంబి సినిమాలో పోషించిన బరువైన పాత్ర పూర్తిగా ఆమెలోని అసలైన నటన కోణాన్ని, ప్రతిభను చూపి… మనకు అలవాటైన సరళను గాకుండా మరో కొత్త సరళను ఆవిష్కరిస్తుంది… ఆడ, మగ అని వదిలేస్తే మన కమెడియన్లు ఎంతసేపూ హీరోలు అయిపోవాలనే తపనను, తాపత్రయాన్ని కనబరిచి, ఒళ్లు కాల్చుకుని, మళ్లీ పాత కామెడీ బాటనే ఎంచుకుంటున్నారు…
ఇలాంటి బరువైన పాత్రలు ఎవరైనా ఆఫర్ ఇస్తే చేస్తారా..? నెవ్వర్… అంతెందుకు..? సెంబి వంటి సినిమాలు మన తెలుగులోనే రావు, మనకన్నీ సూపర్ సుప్రీం ఫైట్లు, స్టెప్పులు, బిల్డప్పుల మాస్ యాక్షన్ సినిమాలు తప్ప ప్రయోగాలెక్కడివి..? జనజీవితాన్ని ఎంతోకొంత ప్రభావితం చేసే కథలు తీసేవారేరి..? నిన్న నాగబాబు ‘‘నిర్మాతగా చెబుతున్నాను, సినిమాలు చూసి ఎవరూ బాగుపడరు, చెడిపోరు, ఇది వ్యాపారం’’ అని సర్వజ్ఞుడిలా తేల్చేశాడు.., నాగబాబు కదా, తనకు తెలిసిందే అంత…
Ads
భిన్నమైన సినిమాలనే చర్చ వదిలేస్తే… మన యాక్టర్స్ ఇలాంటి పాత్రలు వస్తే చేయడానికి ఎంతమేరకు సిద్ధంగా ఉన్నారనేదే అసలైన ప్రశ్న… ఆమె ఓ కమెడియన్, ఆమెను ప్రేక్షకులు కూడా అలాగే రిసీవ్ చేసుకున్నారు, ఆమె కనిపించగానే మన మొహాలపై నవ్వు ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది… అలాంటిది ఆ ముద్రను బ్రేక్ చేసుకోవడానికి సిద్ధపడింది… తనలో దాగున్న మంచి నటిని ప్రభావవంతంగా బయటికి తీసి ప్రదర్శించింది… ఒక character ఆర్టిస్ట్ చేయటం వేరు, ఒక కమెడియన్ చేసి మెప్పించడం వేరు… ఒక ఆర్టిస్ట్ ను ప్రేక్షకులు చూసే కోణాన్ని 360 డిగ్రీలు తిప్పడం…
ఇలాంటి పాత్రలు మేం చేస్తే జనం చూడరు అనే ఓ రెడీ మేడ్ జవాబు మనవాళ్ల దగ్గర ఉంటుంది… కానీ ఒక నటుడిని బతికించేది ఇవే… కామెడీ హీరోగా ఎన్నో చిత్రాలు చేసిన అల్లరి నరేష్ కామెడీ మొనాటనీ అయిపోయి, జనం చూడటం మానేసేసరికి, కళ్లు తెరుచుకుని సీరియస్ పాత్రల వైపు దృష్టి సారించాడు తప్ప, అనివార్యంగా రూట్ మార్చాడు తప్ప… ఇలాంటి పాత్రల మీద ప్రేమతో కాదు… అసలు మన ఇండస్ట్రీలో భిన్న పాత్రల టేస్ట్ నటుల్లో లేదు, దర్శకుల్లోనూ లేదు…
దేశవ్యాప్తంగా పోక్సో కేసులు ఏటా వేలల్లో నమోదవుతున్నయ్… వేలల్లో అత్యాచార కేసులు నమోదవుతున్నాయి… ఒక చిన్న గిరిజన పిల్లను కామాంధులు చెరిస్తే, ఆమె అమ్మమ్మ ఎలా రియాక్టయింది, ఎలా పోరాడింది అనేది సెంబి సినిమా… పోక్సో చట్టం అంటే ఏమిటో ప్రాజెక్ట్ చేస్తుంది… పోలీసులు, సొసైటీ, లీడర్స్, బ్రోకర్స్ ఇలాంటి కేసుల్ని ఎలా మసిబూసి మారేడుకాయ చేస్తారో చూపిస్తుంది…
ఇప్పుడు ఒక్కసారి అలా అలా మదిలోనే తరచిచూడండి, మన ఇండస్ట్రీలో ఎవరైనా ఈ పాత్రలు చేయడానికి సై అంటారా..? అబ్బే, దర్శకుడు మనలోని నటిని వెలికితీసే మంచి పాత్రలు ఇస్తే మేమూ చేయగలం అంటారేమో మన ఫిమేల్ స్టార్స్… కానీ ఇలాంటి పాత్రలు వస్తే అసలు యాక్సెప్ట్ చేయడానికి ఎవరైనా రెడీగా ఉన్నారా..? కనీసం టీవీ సీరియళ్లలో నటించే తారలు కూడా ముందుకు రారు… అవసరమైతే ‘జిల్ జిల్ జిగేల్ రాణి’ వంటి చిల్లర పాత్రలు, స్టెప్పులు వేస్తారు తప్ప ఇలాంటి పాత్రలకు సిద్ధపడరు… పడరు…
కోవై గురించి చెప్పాలంటే… తమిళనాడు, కోయంబత్తూరులో పుట్టిన ఓ మలయాళీ… 9వ క్లాసు నుంచే సినిమాల్లో నటిస్తోంది… దాదాపు 300 సినిమాలను కన్నడ, మలయాళ, తెలుగు, తమిళ భాషల్లో చేసిన సరళ అసలు పెళ్లి చేసుకోలేదు… కారణం తెలియదు ఎవరికీ… ఇప్పుడు అరవై ఏళ్లు… బంధువుల పిల్లల్నే తన పిల్లలుగా భావించి సాయపడుతూ ఉంటుంది… ఇండస్ట్రీ, తన పాత్రలే తన సొంత పిల్లలు…!!
Share this Article