కనీసం జర్నలిస్టు సర్కిళ్లలోనైనా చిన్నపాటి డిబేట్ జరుగుతుందని ఆశిస్తే… అదీ నిరాశే అయ్యింది… జర్నలిస్టులకు సంబంధించిన అంశాలు తప్ప జర్నలిస్టుల గ్రూపుల్లో అన్నిరకాల చర్చలూ సాగుతున్నయ్… సోషల్ మీడియాలో, మీడియాలో సాగించే భజనలు జర్నలిస్టుల గ్రూపుల్లోనూ నడుస్తున్నయ్… అప్పుడప్పుడూ వృత్తికి సంబంధించి ఏమైనా మాట్లాడుతున్నారా, మంచీచెడూ ముచ్చటించుకుంటున్నారా అంటే అదీ లేదు… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన జీవిత సాఫల్య పురస్కారాన్ని సీనియర్ జర్నలిస్ట్ పాలగుమ్మి సాయినాథ్ తిరస్కరించాడు… అదీ వార్త… ఆయన ఎంచుకునే వార్తాంశాలు, రచనశైలి మీద కొన్ని సెక్షన్ల జర్నలిస్టులకు అసహనం ఉంటే ఉండవచ్చుగాక, నచ్చకపోవచ్చుగాక… తన పంథా తనది… సర్కారు భజన, పార్టీల కీర్తన ఎరుగని కలం అది… కొనసాగనివ్వాలి… అయితే అవార్డు తిరస్కరణ మీద కాస్త డిబేట్ జరిగితే బాగుండు… నిజంగా… సాయినాథ్ నిర్ణయం అభినందనీయం… అనుసరణీయం… మెజారిటీ జర్నలిస్టులకు నచ్చకపోయినా సరే…!!
ఎహె, మీడియా సంస్థలు, మీడియా యజమానులే పార్టీలు, బిజినెస్ కంపెనీలు, నాయకులు, పాలకుల కాళ్ల మీద పడిపోతుంటే… ఆఫ్టరాల్ జర్నలిస్టులు అవార్డులు తీసుకుంటే తప్పేమిటి..? తమ సర్వీస్‌కు గుర్తింపు కదా అని వాదించేవాళ్లు కోకొల్లలు… జర్నలిస్టు సర్వీసుకు సర్కారు గుర్తింపు ఇవ్వడం ఏమిటి..? ఒకసారి అవార్డులు, ప్రైజులు, జీవిత సాఫల్య పురస్కారాలకు లొంగడం అంటే, ఆబ్లిగేషన్‌లో పడిపోయి, తమలోని ప్రశ్నించే తత్వాన్ని తామే చంపేసుకున్నట్టు అనేవాళ్లూ ఉన్నారు… అసలు ప్రశ్నిస్తే ప్రచురించే పత్రిక ఏముంది, ప్రసారం చేసే టీవీ ఏముంది..? ఎంచక్కా సర్కారు ఇచ్చే ఇళ్లస్థలాలు, అక్రెడిటేషన్లు గట్రా తీసుకున్నట్టే… అవార్డులు కూడా తీసుకుంటే సరి అనేది ఒక వాదన… సాయినాథ్ ఏమంటాడంటే..? ‘‘కళాకారులు, క్రీడాకారులు వేరు… జర్నలిస్టులు వేరు… జర్నలిజం పాత్రే భిన్నమైంది… భిన్నంగానే చూడాలి… ప్రభుత్వ కార్యక్రమాల్ని గానీ, విధానాల్ని గానీ తప్పుపట్టే, ప్రశ్నించే బాధ్యత జర్నలిస్టులది, అందుకని అవార్డులకు దూరంగా ఉండాలి, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం’’ అంటున్నాడు…
Ads
ఒక ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన జీవిత సాఫల్య పురస్కారాన్ని ఒక ఆదర్శంగా, ఒక విధానంగా తాను మర్యాదగా తిరస్కరించడం ఖచ్చితంగా ఒక మంచి వార్త… అది ఆ అవార్డును అగౌరవపరచడం ఏమీ కాదు… తనకు ఇష్టం లేదు కాబట్టి స్వీకరించకపోవడం… అంతే… ఆదర్శాల్ని చెప్పడం వేరు, ఆచరణలో చూపించడం వేరు… అదే సాయినాథ్ చూపించింది… బాగుంది… ఇతర జర్నలిస్టులు భుజాలు తడుముకోవడమో, తప్పుపట్టడమో చేయాల్సిన పని కూడా లేదు… నిజానికి జర్నలిస్టు అంటే ఓ ప్రైవేటు కంపెనీ ఉద్యోగి… తనను ప్రభుత్వం ఎందుకు గుర్తించాలి..? బస్ పాస్ ఇవ్వకు, చేసిన పనికి సరిపడా జీతం ఇప్పించు చేతనైతే… వేజ్ బోర్డు వేతనాలు ఇప్పించు… అసలు చాలా సంస్థల్లో వేతనాలే లేవు కదా… వెట్టిచాకిరీ… ప్రభుత్వాలకు మీడియా జోలికి వెళ్లే ధైర్యం లేదు, ఇలా అవార్డులు, అక్రెడిటేషన్లు, బస్ పాసులు పారేసి చేతులు దులుపుకుంటుంది… అసలు అధికారంలో ఉన్న పార్టీలకే మీడియా సంస్థలు ఉండి, అవీ సరైన వేతనాల్ని ఇచ్చే స్థితి లేనప్పుడు… ఇక సర్కారు నుంచి ఆశించేది ఏముంటుంది..? నిజంగానే సాయినాథ్ వార్త మీద కాస్త డిబేట్ జరిగితే బాగుండు..!! ఫలితం లేకపోయినా సరే…!!
Share this Article