ఈ కరోనా మహావిపత్తు వేళ అనేక చిన్న కంపెనీలు కుదేలైపోయాయి… లక్షలాది కొలువులు ఊడిపోయినయ్… పెద్ద కంపెనీలు సైతం కొలువుల్లో, జీతాల్లో కోతలు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నయ్… ఇక రోజువారీ కూలీలకు, చిన్న చిన్న వృత్తుల వారికి ఇదొక మహా సంక్షోభం… ఈ స్థితిలో ఎవరు కొంత ఔదార్యాన్ని కనబర్చినా ప్రశంసించకతప్పదు… పలు కంపెనీలు కరోనా సాయానికి సిద్దపడుతున్నయ్… ఆక్సిజన్ పడకల హాస్పిటల్స్ ఏర్పాటు దగ్గర్నుంచి అనేక రకాలుగా ‘సామాజిక బాధ్యత’ను మీద వేసుకుంటున్నయ్… అయితే అంతా బాగున్నప్పుడు తమ సంస్థల అభ్యున్నతికి కష్టపడిన తమ ఉద్యోగులను ఎలా కాపాడుకుంటున్నయ్..? వాళ్ల పట్ల ఎలా వ్యవహరిస్తున్నయ్..? సాధనసంపత్తి ఉండి, ఆర్థిక స్థోమత బలంగా ఉన్న పెద్ద కంపెనీల ధోరణి ఎలా ఉంది..? ఇదీ ప్రశ్నే… కీలకమే… మొన్న టాటా స్టీల్ ఎవరైనా తమ ఉద్యోగి కరోనా కారణంగా మరణిస్తే, తనకు 60 ఏళ్ల వయస్సొచ్చేవరకూ ఆ కుటుంబానికి అదే జీతాన్ని కొనసాగిస్తామని, వాళ్ల పిల్లల చదువు బాధ్యతను తీసుకుంటామని ప్రకటించింది… దేశమంతా ఆ కంపెనీ బాధ్యులను ఆశీర్వదించింది…
సహజంగానే ఈ కోణం చర్చకు వచ్చినప్పుడు అందరి దృష్టీ అంబానీ, ఆదానీలపై పడుతుంది… ఆసియాలోకెల్లా నంబర్ వన్ ధనికుడు అంబానీ… ప్రభుత్వాలనే శాసించగల సిద్ధహస్తుడు… తనతో పోటీపడేందుకు పరుగులు పెడుతున్న ఆదానీ… ఇంకా అనేక మంది వేల కోట్ల ఆస్తులున్న ధనికులు బోలెడు మంది ఉన్నారు… అయితే అంబానీ అనేసరికి, డబ్బు తప్ప ఇంకేమీ పట్టదనే ఓ అభిప్రాయం జనసామాన్యంలో ఉన్నదే… పలు చారిటీ కార్యక్రమాలు చేస్తున్నా సరే ఆ అభిప్రాయం అలాగే ఉండిపోతోంది… కానీ తొలిసారిగా ముఖేషుడిని ఉద్యోగుల కోణంలో అభినందించాల్సిన వార్త ఇది… ఆదానీలు గట్రా ఈ స్ఫూర్తిని అందిపుచ్చుకుంటారో లేదో తెలియదు కానీ…
Ads
రిలయెన్స్ ఇండస్ట్రీస్ ఉద్యోగులకు సంబంధించిన నిర్ణయం ఇది… ఇతర అనుబంధ సంస్థలకు వర్తిస్తుందో లేదో క్లారిటీ లేదు కానీ… రిల్ ఉద్యోగుల్లో ఎవరైనా కరోనాకు గురయితే వాళ్లు భౌతికంగా, మానసికంగా కోలుకునేదాకా సెలవు ఇస్తారు… ఒకవేళ మరణిస్తే ఆ కుటుంబానికి అయిదేళ్లపాటు జీతం నెలనెలా కొనసాగిస్తారు… రిల్ ఉద్యోగులకు ఓ పెద్ద ఊరట ఇది… ఆ కుటుంబాల్లోని పిల్లల గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేవరకు ట్యూషన్ ఫీజులు, ఇతరత్రా ఖర్చులను రిలయెన్స్ ఇండస్ట్రీస్ భరిస్తుంది… అంతేకాదు, ఆయా కుటుంబాల్లో ఇంకెవరికైనా కరోనా సోకితే వారి మొత్తం చికిత్స ఖర్చులను భరించడానికి ముందుకొచ్చింది… ఎంత విశేషమైన భరోసా ఇది..! పనిలోపనిగా లాభనష్టాలు, ఆర్థికభారాలను చూసుకుంటూనే రిలయెన్స్ ఇతర కంపెనీల ఉద్యోగులకూ ఇదే తరహా అండదండల్ని గనుక ముఖేష్ ప్రకటిస్తే, తన జీవితానికి, తన సంపాదనకు ఓ సార్థకత, ఓ విలువ… ఆదానీ సరే, దేశంలోని టాప్ 50 కంపెనీలైనా, వేల కోట్ల ఆస్తుల్ని వ్యక్తిగతంగా సంపాదించుకున్న టాప్ 50 ధనికులైనా తమ ఉద్యోగులకు ఇలా కొంత భరోసాను ఇవ్వగలరా..? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు..?! యజమానులు కాకపోతే ఇంకెవరు..?!
Share this Article