నిజానికి మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ఈ వార్త ప్రాధాన్యం అర్థం కాలేదేమో…. కానీ చాలా ప్రాధాన్యమున్న వార్త… హ్యూమన్ టచ్ ఉన్న వార్త… హైకోర్టు మీద గౌరవాన్ని పెంచిన వార్త… కొంతమందికి నచ్చకపోవచ్చు… కానీ కోర్టు చెప్పినట్టు తల్లి ప్రాణంకన్నా గొప్పదేమీ కాదు, ఒక గర్భం…! విషయం ఏమిటంటే… ఓ పదహారేళ్ల బాలిక… దారుణంగా అత్యాచారానికి గురైంది… కేసు ఏమైందనేది పక్కన పెట్టండి, అది వేరే సంగతి… కానీ ఆమెకు కడుపైంది… ఆమే ఓ బాలిక, ఆమెకు కడుపు… ఆ కడుపులో పెరిగేది కూడా ఓ నేరానికి, ఓ దారుణానికి చిహ్నం… దాన్ని మోసి, కని, రేప్పొద్దున రోజూ చూసి ఏడవాలా ఆ పిల్ల..? తన కడుపు పంటా..? అది కడుపు మంటా..? రోజూ కుమిలిపోవడానికా..?
ఎక్కడ తప్పు జరిగిందో తెలియదు.,. చాలా వారాలపాటు వదిలేశారు, ఎవరూ పట్టించుకోలేదు… తీరా 24 వారాల తరువాత, అంటే ఆరు నెలల తరువాత.. 27 వారాల అనంతరం అబార్షన్ కోసం వెళ్తే, డాక్టర్లు వీల్లేదన్నారు… తల్లి ప్రాణాలకు ముప్పు అని కాదు, 24 వారాల తరువాత అబార్షన్ చట్టవిరుద్ధం అట… ఇదీ హైకోర్టు విచారణకు వచ్చిన కేసు… ఇక్కడ రెండు మూడు అంశాల్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది… 1) ఆమె లైంగిక దాడికి గురైంది… 2) ఆమె వయస్సు మరీ పదహారేళ్లు… 3) ముప్పు ఉన్నప్పుడు ఏ వయస్సు గర్భమైనా తొలగించవచ్చు… 4) కేంద్రం కొత్తగా తీసుకొచ్చి మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ప్రకారం విపత్కర పరిస్థితిలో గర్భాన్ని తొలగించవచ్చు… 5) ఆ పదహారేళ్ల బాలిక మానసిక, శారీరక స్థితి… 6) గర్భాన్ని ఉంచుకోవాలా, తొలగించుకోవాలా అనేది వ్యక్తిగత స్వేచ్ఛ, ఇష్టం, హక్కు పరిధిలోకి వస్తుంది…
Ads
తల్లి జీవితంకన్నా పుట్టబోయే బిడ్డ జీవితానికి తాము ప్రాధాన్యం ఇవ్వడం లేదని కోర్టు విస్పష్టంగా పేర్కొంది… అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని, ఆమెకు గర్భస్రావం చేయాలని కూడా కోర్టు కోఠి ప్రసూతి హాస్పిటల్ సూపరింటిండెంట్‌ను ఆదేశించింది… మీమాంస లేదు, డైలమా లేదు… వేరే తర్కవితర్కాలేమీ లేవు… స్ట్రెయిట్ అవే అబార్షన్ చేయాలని చెప్పేసింది… అరుదైన తీర్పు… నిజమే కదా… ఆ పిల్ల వయస్సెంత..? ఆ కడుపు నేపథ్యమేమిటి..? అసలు ఇంకా పుట్టని బిడ్డకు హక్కులేముంటయ్… ఆఫ్టరాల్, అదొక అవాంఛిత పిండం… అఫ్ కోర్స్, అప్పటికే కడుపులోకి బిడ్డకు అవయవాలు గట్రా రూపుదిద్దుకుని ఉండవచ్చుగాక… కానీ అసలు లోకంలోకి రాని ప్రాణికి హక్కులేముంటయ్..? దానికోసం ఆ చిట్టి తల్లి హక్కుల్ని ఎందుకు కాలరాయాలి..? అయితే రేప్పొద్దున అత్యాచార కేసులో విచారణకు ఉపయోగపడే అవకాశముంది కాబట్టి పిండం నమూనాలను భద్రపరచాలని కూడా కోర్టు చెప్పింది… డీఎన్ఏ ఇతర పరీక్షల్ని నిర్వహించి, నివేదికల్ని సేవ్ చేసి పెట్టాలని ఆదేశించింది… మరీ సూక్ష్మాల్లోకి వెళ్లనవసరం లేదు కానీ స్థూలంగా హైకోర్టు తీర్పు సరైన దిశలోనే ఉంది… హ్యూమన్ యాంగిల్‌లోనే ఉంది… నిజానికి ఇలాంటి వార్తలు కదా, మీడియాలో ప్రయారిటీకి నోచుకోవాల్సింది… అదే జరగడం లేదు…! దిక్కుమాలిన టీవీల్ని వదిలేయండి, కనీసం పత్రికలకు ఏం పుట్టింది, ఇవి సరన ప్రియారిటీతో పబ్లిష్ చేయకుండా ఉండటానికి..?! (ఆంధ్రజ్యోతి నయం, ప్రియారిటీ గుర్తించింది, అభినందనలు…)
Share this Article