రాజధర్మం అంటే…? కులానికి, ప్రాంతానికీ, వర్గానికీ అతీతంగా ప్రజల్ని ఆదుకోవడం… ఆదరించడం…! కానీ మనం ఎలా తయారయ్యాం..? వోటు బ్యాంకు కోసం రాజధర్మం కాదు, రాజకీయధర్మం మాత్రమే పాటిస్తున్నాం… రాజకీయం కోణంలో మాత్రమే సంక్షేమ పథకాలు, రాజకీయ లబ్ధి కోసం మాత్రమే పరిపాలన నిర్ణయాలు, స్వలాభం కోసమే అడుగులు… పైగా దాన్ని ఘనతగా వందిమాగధులతో కీర్తింపజేసుకుంటాం… పాలకుడికి మానవీయ కోణం ఉండాలి, అది కూడా మరిచిపోతున్న తీరు మరీ దారుణం… కరోనా కారణంగా వేల కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయి… పడకల్లేక, వైద్యం లేక, ఆక్సిజన్ లేక, ఆదుకునేవాడు లేక, ప్రైవేటు హాస్పిటళ్లలో లక్షలు ధారబోయలేక, అప్పులు తేలేక, ఆస్తులు అమ్మలేక… ఎందరో అశువులు బాశారు… మహావిపత్తు… ఈ విషాదంలో మరింత తీవ్రమైంది అనాథలైన పిల్లలది… తల్లీతండ్రీ మరణిస్తే రేప్పొద్దున వాళ్ల బతుకుల గతేమిటి..? చేయూతనిచ్చే బాధ్యత సమాజానిదే… కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని పథకాలు ప్రకటించాయి…
అరకొర నిర్ణయాలు తప్ప, మన ప్రభుత్వాలకు ఈ సమస్య పట్టలేదు… మొన్నటి కేబినెట్‌లో తెలంగాణ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది… బీసీల జాబితాలో అనాథల్ని చేర్చాలని..! ఓసీల్లో అనాథలుగా మారిన పిల్లలకు ఒకింత ఊరట తప్ప బీసీలు, ఎస్సీలు, ఎస్టీల పిల్లలకు దాంతో వచ్చే ఫాయిదా ఏముంది..? ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ యోగి ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం… అభినందనీయం అనిపించింది… మానవీయ స్పర్శ కనిపిస్తోంది… ఇందులో మతం లేదు, కులం లేదు, ఏ వివక్షా లేదు… అనాథలకు అండగా నిలవడం… దురదృష్టం కొద్దీ ఇలాంటి పథకాలు మన మీడియాకు పెద్దగా పట్టవు… ఎందుకంటే… ఇందులో విద్వేషాన్ని వ్యాప్తి చేసే విషం ఏమీ లేదు కాబట్టి… ఆ పథకం ఏమిటీ అంటే..?
Ads
ముఖ్యమంత్రి బాలసేవాసదన్ యోజన… ఇదీ కార్యక్రమం పేరు… కరోనాతో మాత్రమే కాదు, ఏ ఇతర కారణాలతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారినా సరే, ఆ పిల్లలకు నెలకు 2500 ఇస్తారు… వీళ్లే కాదు, 12వ తరగతి పూర్తి చేసి, 18 నుంచి 23 సంవత్సరాల వయస్సు ఉండి, కరోనా లేదా ఇతర కారణాలతో తల్లిదండ్రులను కోల్పోతే, అలాంటి పిల్లలకు కూడా ఈ సాయం వర్తింపజేస్తారు… డిగ్రీలు, డిప్లొమాలు, ప్రభుత్వ కాలేజీలు, జాతీయ కళాశాలల్లో చదివేవారికి కూడా వర్తింపజేస్తారు… అసలు అనాథ పిల్లల్ని ఆదుకోవడమే కాదు, ఈ పథకం పరిధిని మరింత పెంచి… భర్త నుంచి విడాకులు తీసుకుని, ఒంటరిగా ఉండి, పిల్లల్ని చదివిస్తున్న మహిళలకు… వ్యభిచారం నుంచి బయటపడిన వారికి… బాలకార్మికులుగా పనిచేసి, తరువాత చదువు కొనసాగిస్తున్నవారికి… భిక్షాటనతో బతికే కుటుంబాల వారికి కూడా నెలవారీ ‘‘సామాజిక పెన్షన్’’ ఇవ్వాలని నిర్ణయించారు… అంటే, ఫోకస్డ్ అనండి, టార్గెటెడ్ అనండి, నీడెడ్ అనండి, ఏ పేరైనా పెట్టండి… నిజంగా ప్రభుత్వ సాయం అవసరమైన వారికి అండగా నిలబడటం… ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రధానసూత్రం ఇదే కావాలి… కానీ మన తెలుగు రాష్ట్రాలు సహా అనేక ప్రభుత్వాలు ‘‘రాజకీయ కోణంలో’’ మాత్రమే సంక్షేమ పథకాల్ని…. చిప్ప చేతికొచ్చేలా అప్పులు చేస్తూ మరీ అమలు చేస్తున్నాయి… అది అసలైన విషాదం… విపత్తు…!! మరి మనల్ని పాలించేవి ఫక్తు రాజకీయ పార్టీలు కదా…!!
Share this Article