కొందరి బయోపిక్స్ ప్రాంతాలకతీతంగా ఆకర్షిస్తాయి. చర్చకు తెర లేపుతాయి. అలాంటి వారిలో పురిచ్చితలైవిగా తమిళనాడును శాసించిన జయలలిత ఒకరు. ఏ ఝాన్సీ లక్ష్మీనో, రుద్రమదేవి గురించో చరిత్ర కథలు మాత్రమే విన్నవారికి… ఆ సాహసం, ఆ తెగువ, ఆ మొండిధైర్యం, సవాళ్లను స్వీకరించి ముళ్లబాటల్లోంచి ప్రయాణించి… ఓ హీరోయిన్ గా, నటిగా… ఆ తర్వాత తమిళనాట ఆరుసార్లు ముఖ్యమంత్రిగా జయకేతనమెగురేసి కనిపించిన సజీవసాక్ష్యం జయలలిత.
ఇప్పటికే mx player లో క్వీన్ పేరుతో రమ్యకృష్ణ ప్రధానపాత్రలో గౌతమ్ వాసుదేవ మీనన్, ప్రసాద్ మురుగేశన్ సంయుక్తంగా తెరకెక్కించిన జయలలిత బయోపిక్ వెబ్ సీరిస్ రూపంలో హిట్ టాక్ సంపాదించగా… ఇప్పుడు తలైవి పేరుతో కంగనారనౌత్ తో వస్తున్న మరో సినిమా ఆసక్తి రేకెత్తిస్తోంది. అందులో ఎంజీఆర్ పాత్రలో నటించిన అరవింద్ స్వామి ఆ ఫస్ట్ లుక్ ఫోటోలను ఈరోజు ట్విట్టర్ లో షేర్ చేయడంతో ఇప్పుడా సినిమా ఎలా ఉండబోతోంది… సరిగ్గా తమిళనాడు ఎన్నికలకు ముందు విడుదల చేయాలనుకుంటున్న ఆ సినిమా రాజకీయాలను ఏవిధంగా ప్రభావం చేయనుందన్న చర్చకు తెరలేస్తోంది.
అనితా శివకుమారన్ రాసిన నవల నుంచి ప్రేరణ పొంది… రేష్మాఘటాలా రాసిన కథతో క్వీన్ వెబ్ సీరిస్ mx player ఓటీటి వేదికగా విడుదలై బుల్లితెర ప్రేక్షకుల మనసుల్ని దోచిన సంగతి తెలిసిందే. అసలే గౌతమ్ వాసుదేవన్. తన మెయిన్ స్ట్రీమ్ సినిమాలకు ఏమాత్రం రాజీపడకుండా ఆయన మరో దర్శకుడైన ప్రసాద్ మురుగేశన్ తో కలిసి చిత్రీకరించిన తీరు ఆకట్టుకుంటుంది. అయితే ఈ చిత్ర బృందం ఇదో కల్పిత కథగా ప్రచారం చేసినప్పటికీ… వందకు నూటాపదిశాతం జయలలిత క్యారెక్టర్ ను పోలి ఉండటం కనిపించడంతో పాటు… ఆ క్యారెక్టర్ కాబట్టే అంతగా బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షించిందనే కాదనలేని వాస్తవం. 14 ఏళ్ల జయలలిత నుంచి 40 ఏళ్ల జయలలిత వరకూ ఆమె జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లు… వాటిని అధిగమించిన తీరు ఈ సీరిస్ లో ప్రతిబింబించేలా చిత్రీకరించారు.
Ads
యుక్తవయస్సులో శక్తిశేషాద్రి పేరుతో పాత్ర పోషించిన అనికా.. ఆతర్వాత 18 నుంచి 30 ఏళ్ల మధ్య పాత్రలో అంజనా జయప్రకాష్.. ఆ తర్వాత ఎంటరయ్యే పవర్ ఫుల్ శక్తి పాత్రలో రమ్యకృష్ణ నటించిన తీరు… కళ్లల్లో పలికించిన భావాలు ఈ వెబ్ సీరిస్ లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. జయలలిత క్యారెక్టర్ ను పోలిన శక్తి క్యారెక్టరైజేషన్ తయారీలో రేష్మాఘటాలా రచన, దర్శకుల ప్రతిభ, కెమెరా పనితనం… ఆ క్యారక్టర్ లో నటించిన అనికా, అంజనా జయప్రకాష్, రమ్యకృష్ణల నటన, ప్రత్యేకించి కళ్లల్లో పలికిన భావాలు ఈ సీరిస్ కు హైలెట్స్ గా చెప్పుకోవచ్చు. పైగా సిమిగర్వాల్ ఇంటర్వ్యూతో ఈ వెబ్ సీరిస్ ప్రారంభమవ్వడం..!
అయితే ఇదే క్రమంలో ఏకంగా తలైవి పేరుతోనే దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోగ్రఫీని.. జీవితంలోనూ జయలలిత తరహా పాత్ర పోషించే ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ పోషించడం… మణిరత్నం వంటి దర్శక దిగ్గజం ఇండస్ట్రీకి పరిచయం చేసిన అరవిందుడు అందులోనూ ఎంజీఆర్ పాత్రను పోషించడంతో ఇప్పుడు తలైవి సినిమా.. mx playerలో విడుదలై ప్రేక్షకాదరణ పొందిన క్వీన్ వెబ్ సీరిస్ కు దీటుగా ఉంటుందా అన్న చర్చ కూడా మొదలైంది. ఏ. ఎల్. విజయ్ దర్శకత్వంలో నిర్మితమవుతున్న ఈ చిత్రం ఓ ప్రధాన ఓటీటీలో విడుదలవుతుందంటూ కొన్ని రోజులుగా సాగుతున్న ప్రచారాన్ని కూడా సినీ నిర్మాణ సిబ్బంది కొట్టిపారేశారు.
తలైవీని ఏకంగా సినిమా థియేటర్లలోనే విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు… ఆ రూమర్స్ ను నమ్మొద్దంటూ కూడా ఖండించిన పరిస్థితి. అయితే ఈ సినిమాను 2021 జూన్ లో విడుదల చేయనున్నట్టు ఇప్పటికే చిత్ర యూనిట్ వెల్లడించగా… చిత్రంలో ఎంజీఆర్ పాత్ర పోషిస్తున్న అరవింద్ స్వామితో పాటు… ఇతర చిత్ర నిర్మాణ సిబ్బంది కూడా ట్విట్టర్ లో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను షేర్ చేశారు. ఇంతకుముందే మణిరత్నం ఇద్దరు సినిమాలో అదే పాత్రలో అలరించిన ప్రకాష్ రాజ్… ఈ సినిమాలో కూడా కరుణానిధి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ కీలక షెడ్యూల్ ఈ మధ్యే హైదరాబాద్ లో ముగిసింది.
అయితే ఇప్పుడు తమిళనాడులో ఎన్నికల వేళ కావడం… ఇదే సమయంలో రజనీకాంత్ తన కొత్త పార్టీని ప్రకటించేందుకు సిద్ధమవ్వడం… ఎన్నికలకు ముందు ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించడం చూస్తుంటే… ఈ సినిమా ప్రభావం తమిళ రాజకీయాలపై… తద్వారా అక్కడ జరుగబోయే ఎన్నికలపై ఎలాంటి ప్రభావాన్ని చూపించనుందన్న ఆసక్తి కూడా మరోవైపు నెలకొంది. ఇంకోవైపు ఇప్పటికే mx playerలో విడుదలై విమర్శకుల ప్రశంసలందుకున్న క్వీన్ వెబ్ సీరీస్ ను మించి… జయలలితకు సంబంధించిన ఈ తలైవి చిత్రం మన్ననలందుకుంటుందా అన్నదీ మరో ఆసక్తికరమైన అంశం.
.
- రమణ కొంటికర్ల
Share this Article