ఇప్పటికి ముప్ఫయ్ ఏళ్ల క్రితం నాటి ముచ్చట… ఇంకాస్త ఎక్కువే… అది 1988… విశ్వహిందూపరిషత్ నేత అశోక్ సింఘాల్ బడా పారిశ్రామికవేత్త, వ్యాపారి జీడీ బిర్లా దగ్గరకు వెళ్లాడు… అయోధ్యలో ఎలాగైనా సరే రామమందిరం నిర్మిస్తాం, మీ సాయం కావాలి అనడిగాడు… ఆయన సానుకూలంగా తలూపాడు… ఆ చిక్కులు తొలగనివ్వండి, ఏమైనా చేద్దాం అన్నాడు…
ఓ మాంచి ఆలయాల ఆర్కిటెక్ట్ కావాలి ముందుగా… భవ్యమైన ఓ గుడికి డిజైన్ గీయిద్దాం… జనంలోకి తీసుకుపోదాం అన్నాడు సింఘాల్… దేశంలో పలుచోట్ల బిర్లా మందిరాలు నిర్మించిన బిర్లాకు ఆలయాల ఆర్కిటెక్ట్ తెలియకపోవడం ఏముంది..? అదెంత పని, అలాగే గీయిద్దాం అన్నాడు… ఓ కుటుంబం బిర్లాలు చేపట్టే గుళ్లు, ఇతర నిర్మాణాల కోసం దశాబ్దాలుగా పనిచేస్తోంది…
బిర్లా నుంచి అప్పుడే ఓ ఫోన్ కాల్ వెళ్లింది… దాన్ని రిసీవ్ చేసుకున్నది చంద్రకాంత్ సోంపుర… ఆర్కిటెక్ట్… బిర్లా నుంచి కాల్ రాగానే వెంటనే ఢిల్లీకి చేరిపోయాడు… ‘చంద్రకాంత్ మనం ఒకసారి యూపీలోని అయోధ్యకు వెళ్లిరావాలి’ అన్నాడు బిర్లా… ఎందుకు, ఏమిటి అనడగలేదు చంద్రకాంత్, ఎస్ సర్, వెళ్దాం అన్నాడు… ఇద్దరూ ఢిల్లీ నుంచి అయోధ్యకు చేరారు…
Ads
అయోధ్య సైట్‌కు వెళ్లాక బిర్లా చెప్పాడు తాపీగా… ఇక్కడ ఓ పెద్ద గుడి కట్టాలి రాముడికి… నువ్వు దానికి డిజైన్ గీసి ఇవ్వాలి… అది ముందుగానే జనంలోకి వెళ్తుంది… నీకు పుణ్యం, నీ జన్మకు సార్థకత, అంతేకాదు, నీకు నేను ఇస్తున్న తక్షణ అసైన్‌మెంట్ అన్నాడు బిర్లా… చంద్రకాంత్ మొదట విస్తుపోయి, తరువాత పొంగిపోయి బిర్లాకు చేతులు జోడించాడు… కానీ..?
వెంటనే పని ప్రారంభించాలనుకున్నాడు… కానీ అక్కడ టేపులు, గొలుసులతో కొలతలు తీసుకునేందుకు వీల్లేదు, అనుమతుల్లేవు… మరి ఏదో ఓ కొలత కావాలి కదా… అసలే పెద్ద గుడి, పైగా యావత్ హిందూ జాతి ఆశగా చూస్తున్న గుడి… దాన్ని ఓ చాలెంజ్‌లాగా తీసుకున్నాడు… సంప్రదాయ నగర శైలిలో నిర్మాణం, వెడల్పు 250 అడుగులు, పొడవు 380 అడుగులు, 161 అడుగుల ఎత్తు ఉంటే ఓ సూపర్ టెంపుల్ అవుతుంది అనుకున్నాడు మనసులోనే…
మరి కొలతలు..? చుట్టూ ఓసారి చూడు, ఒక్కడివే చుట్టూ ఓ రౌండ్ వేయి, రఫ్‌గా ఎస్టిమేట్స్ వేసుకో… 2.5 నుంచి 3 ఎకరాల స్థలం అనుకో, నువ్వు గుర్తుంచుకునే లుక్కును బట్టి రఫ్‌గా ఓ డిజైన్ వేయి, దాన్ని చూశాక మళ్లీ ఆలోచిద్దాం అన్నాడు బిర్లా… తన మందిరాన్ని రాముడు తనే కట్టించుకుంటాడు, తనే గీయించుకుంటాడు అనుకుని మనసులో… వెంటనే చంద్రకాంత్ తన బాస్ బిర్లా అక్కడుండగానే పాదాల అడుగులతో కొలతలు తీసుకున్నాడు… అవును, ఆయనకు అది తప్పలేదు అప్పుడు… అడుగులు (ఫీట్లు) కావు, పాదాల అడుగులు… అవే కొలతలు…
ఆ కట్టడం లోపల ఓ పెద్ద హాల్, అందులోకి వెళ్లాక ఎవరూ చూడకుండా కొన్ని కొలతలు ఖచ్చితమైనవి గబగబా తీసుకున్నాడు, రాసుకునేది లేదు, అన్నీ మనసులోనే నిక్షిప్తం… అప్పటికే దాదాపు 200 గుళ్లకు డిజైన్లు గీసి ఎగ్జిక్యూట్ చేసిన కుటుంబం అది… తరువాత కొన్ని డిజైన్లు గీసి బిర్లాకు అప్పగించాడు… అందులో ఒక దాన్ని సంఘాల్ వోకే చేశాడు… అదే డిజైన్‌తో ఇప్పుడు అయోధ్య గుడి నిర్మాణం జరుగుతోంది, జరిగింది…
2.7 ఎకరాల్లో గుడి… మూడు అంతస్థులు… 392 స్థంభాలు… 44 ద్వారాలు… అయిదు మండపాలు… వాటి పేర్లు నృత్యమండపం, రంగమండపం, సభామండపం, ప్రార్థన మండపం, కీర్తన మండపం… తూర్పు నుంచి ప్రధాన ద్వారం గుండా లోపలకు ప్రవేశం… వాస్తుకు పర్‌ఫెక్ట్ ఎంట్రీ… భక్తులు 32 మెట్లు ఎక్కి వెళ్లాల్సి ఉంటుంది… లిఫ్టులు, ర్యాంపులు కూడా ఏర్పాటు చేస్తున్నారు దివ్యాంగులు, వృద్ధుల కోసం… తెలుసు కదా, ఎక్కడా ఇనుము వాడలేదు… ప్రధాని మోడీ ప్రధాన కర్త (యజమాని)… 22న ప్రాణప్రతిష్ట… వేలాది మంది దేశ హైప్రొఫైల్ సాక్షులు, సాధువుల సమక్షంలో…
ప్రస్తుతం 80 ఏళ్ల వయస్సులో ఉన్న చంద్రకాంత్ సోంపుర ఏమంటున్నాడంటే… ‘‘ధన్యోస్మి, జన్మ సార్థకం, ఇంతకుమించి ఏం కావాలి నాకు..? ఇదే కదా లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంట్..’’ 108 భక్తి విహార్, అక్షరధామ్, లండన్‌లోని అక్షర పురుషోత్తమ, సింగపూర్ టెంపుల్, పిట్స్‌బర్గ్ టెంపుల్ ప్లానింగ్, డిజైన్ల క్రెడిట్ కూడా ఈ కుటుంబానిదే..!!
Share this Article