Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నిజమే… అసలు తెలుగు సినిమాలకు పాటలు అవసరమా..?

May 2, 2024 by M S R

నిజమే…
తెలుగు సినిమాకు పాట అవసరమా?

ఎంత కుర్రకారు హృదయాలైనా, ఎంత మోటు సరససులైనా…”నువ్విజిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డీ- అది వినపడుతుంటే జారుతోంది మిడ్డీ” అని సినిమాల్లోలా సింహాద్రి సివంగులై విజృభించి పాడుకోరు.

మరుపున పడ్డ తెలుగు అ ఆ ఇ ఈ వర్ణమాల మధ్య అమలిన శృంగారమో! మలిన శృంగారమో! తేల్చుకోలేని-
“అ అంటే అమలాపురం
ఆ అంటే ఆహాపురం
ఇ అంటే ఇచ్చాపురం
ఈల కొట్టి లాగుతారు ఆంధ్రా జనం…”
అని సినిమాల్లోలా పాలకొల్లు నడిబజారులో అయినా ఎవరూ ఈలకొట్టి పైట లాగి…పాట పాడరు.

Ads

ప్రేయసో లేక భార్యో కొండవాలు జలపాతంలో స్నానం చేస్తుంటే-
“నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే!” అని ప్రియుడో లేక భర్తో సినిమాల్లోలా పాకుడురాళ్లమీద నీళ్లల్లో జారకుండా జలకాల పాటలు పాడరు.

“మామా, కొడుకు రాతిరికొస్తే వదలకు రేచుక్కో !
మంచం చెప్పిన సంగతులన్నీ మరువకు ఎంచక్కో!”
అని మామకొడుకు ఒక్కడినే పిలువబోయిన మద్రాస్ టాకీస్ బాంబే ఖాట్మండు పిల్ల చేత తెలుగు తెలియక తలకట్టు దీర్ఘమై ఏ ఆర్ రెహ్మాన్ మామా, కొడుకు ఇద్దరినీ మంచం దగ్గరికి ఒకేసారి పిలిపించినట్లు బాంబే వీధుల్లో స్థిరపడ్డ తెలుగువారెవరూ నిజజీవితంలో పాటలు పాడుకోరు.

ప్రేమ విఫలమై ఎంతగా గుండె పగిలినా…”గుండె పగిలిపోవువరకు నన్ను పాడనీ- ముక్కలలో లెక్కలేని రూపాలలో మరల మరల నిన్ను చూసి రోదించనీ” అని భగ్న ప్రేమికులెవరూ సినిమాల్లోలా పరస్పరం అభినందించుకుని…గుండెలు బాదుకోరు.

ఎంతగా మూగహృదయాలు కలవలేక వియోగాన్ని భరిస్తున్నా…
“ఆ మురళి మూగైనా – ఆ పెదవి మోడైనా
ఆ గుండె గొంతులో – ఈ పాట నిండదా?
ఈ కడిమీ పూసేనా? ఆ కలిమి చూసేనా?”
అని సినిమాల్లోలా నిజజీవితంలో సప్తపదుల ఇష్టపదులు నేపథ్యగానంగా వినిపించవు.

“మల్లియలారా! మాలికలారా!
మౌనముగా ఉన్నారా?
మా కథయే విన్నారా?

జాబిలిలోనే జ్వాలలు రేగే
వెన్నెలలోనే చీకటి మూగే
పలుకగ లేక పదములు రాక
బ్రతుకే తానే బరువై సాగే…”

అని శోభనం రాత్రి పట్టె మంచం చుట్టూ మంచం కోళ్లు పట్టుకుని…మల్లె పూల కళ్ళల్లోకి కళ్లు పెట్టి సినిమాల్లోలా నిజజీవితంలో పాటలెవరూ పాడుకోరు.

“మమత నింపమన్నాను-
మనసు చంపుకొన్నావు;

మధువు తాగనన్నాను-
విషం తాగమన్నావు;

నీకు ప్రేమంటే నిజం కాదు-
నాకు చావంటే భయంలేదు;

నీ విరహంలో బ్రతికాను-
ఈ విషంతో మరణిస్తాను”

అని పాట చివరి చరణం పాడుతూ విషం తాగి సినిమాల్లోలా నిజజీవితంలో ఎవరూ పోరు.

“పూజలు చేయ పూలు తెచ్చాను
నీ గుడి ముందే నిలిచాను
తియ్యరా తలుపులను… రామా!
ఇయ్యరా దరిశనము…  రామా!”
అని సినిమాల్లోలా నిజజీవితంలో ఎవరూ పూలబుట్ట పట్టుకుని దేవుడి గుడి గుమ్మం ముందు పాటలు పాడరు.

“ఆకులో ఆకునై పూవులో పూవునై
కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై
ఈ అడవి దాగిపోనా! ఎటులైనా ఇచటనే ఆగిపోనా!”
అని ఎంత అందమైన అడవిలో వెళుతున్నా సినిమాల్లోలా ఎవరూ పాడుకోరు.

మాటలో, పాటలో మాటలే ఉన్నా మాట మాటే. పాట పాటే. మాటల్లో చెప్పలేనిదేదో పాటలో చెప్పాలి. మామూలు మాటలను పేర్చి పాటల కోటలు కట్టాలి. అది సినిమా సందర్భంలో ఎంతగా ఒదిగి ఉంటుందో…అంతగా సందర్భం దాటి ఎదిగి…బయట ప్రపంచాన్ని కూడా ప్రతిబింబించాలి. ఆ పాట విశ్వవ్యాప్తమై వినిపించాలి. అనంతమైన ఆ పాట ఎవరు పాడుకుంటే వారికి సొంతం కావాలి. ఆ పాట తోడు కావాలి. ధైర్యం చెప్పాలి. ఓదార్చాలి. తట్టి లేపాలి. జోకొట్టి లాలి పాడాలి. మెరుపులు పట్టి కనువిందు చేయాలి. కర్ణామృతమై చెవులకు విందు చేయాలి. మనసుకు హత్తుకోవాలి.

పాట నడిచి వచ్చిన బాట కావాలి.
పాట భావికి బాటలు వేయాలి.
పాటల బావిలో తేనెల తేటలు ఊరుతూనే ఉండాలి.
పాట బావుటాగా రెపరెపలాడుతూ ఉండాలి.
పాట పేరంటమవ్వాలి.
పాట పందిళ్లు వేయాలి.
పాట ముంగిట ముగ్గులు వేయాలి.
పాట మదిలో వీణలు మీటాలి.
పాట దానికదిగా ఒక ఉత్సవం కావాలి.

పాట అనగలరాగమై తొలుత వీనులలరించి…అనలేనిరాగమై మరలా వినిపించాలి. ఆబాలగోపాలం ఆబాలగోపాలుడి ముక్తపదగ్రస్తాలు వెతుక్కుని ఆరాధ ఆరాధనా గీతాలు పాడుకోవాలి. అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులతో ఆ పాటను చూడాలి. నెమలికి నేర్పిన నడకలివి అని పాట సవాలు విసరాగానే నెమళ్లు ఆ పాటల వెంట నాట్యం నేర్చుకోవడానికి పరుగులు తీయాలి. మురళికి అందని పలుకులివి అనగానే మురళులు చిన్నబోవాలి. కలహంసలకిచ్చిన పద జతులు, స్వర జతులు అనగానే హంసలు నడక నేర్చుకోవాలి.

ఏ కులము నీదని పాట అంటే గోకులం గొల్లున నవ్వి మాధవుడు యాదవుడు మా కులమేలెమ్మని బదులు చెప్పాలి. ఆది నుండి ఆకాశం మూగది, అది అనాదిగా తల్లి ధరణి మూగది అంటూ నడుమ వచ్చి ఉరిమే మబ్బుల నడమంత్రపు సిరిని ఉతికి ఆరేయాలి.

తెల్ల గోవు కడుపున పుట్టే ఎర్ర గోవు, కర్రి ఆవు కడుపున పుట్టే తెల్ల ఆవు కలిసి కూర్చుని తెల్లని, చల్లని ఒకే రంగు పాట పాడాలి. అన్ని వర్ణాలకు ఇహపరమైన వర్ణం ఒక్కటేనన్న పాలలాంటి స్వచ్ఛమైన పాట పాడాలి.

శివుడు సాయం సంధ్యవేళ తాండవం చేయడానికి నడుం బిగించగానే పాటలు మువ్వలై మోగాలి. గువ్వలై ఎగరాలి. పువ్వులై శివపూజకు చివురించాలి.

మావి చిగురు తినగానే కోయిల పాడుతుందో?
కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడుగుతుందో?
తెలియని అయోమయంలో పాట ఒళ్లో ఉయ్యాల కావాలి.

చరణ కింకిణులు ఘల్లు ఘల్లుమన…
పాటకు మయూరి ఆడలేక ఓడిపోయి…ఓటమిలో గెలుపును వెతుక్కోవాలి.

పాటకు కొత్తగా రెక్కలొచ్చి ఎగరాలి. మొగ్గ తొడిగిన పాట వికసిత శతదళ సువర్ణ కుసుమమై మన మనసుల్లో విచ్చుకోవాలి.

తెలిమంచు తొలగిన పాట ఇలగొంతు వినిపించాలి. కువకువల మెలకువల స్వాగతాలు పాడాలి.

కనులు లేని వేణువు కనువిప్పి సిరివెన్నెలలను చూడాలి.
మాటలేని సిరిసిరి మువ్వలు నోరువిప్పి నాట్యం చేయాలి.
స్వాతి కిరణాలై జాలిగా జాబిలమ్మను ఓదార్చాలి.

అలాంటి గొప్ప సినిమా పాటల రుతువుకు కాలం చెల్లిందేమో! ఇప్పుడు పాటలంటే ఒక ఆటవిడుపు. ఈగలపెంట నిరుపేద హీరోయిన్- దోమలపాడు కడుపేద హీరో ప్రేమించుకోగానే శ్రీశైలం బ్యాక్ వాటర్లో బ్యాగ్రౌండ్ వదిలి…స్విట్జర్లాండ్ ఆల్ఫ్స్ పర్వత శ్రేణుల్లో ఎగురుతూ జీన్స్ ప్యాంట్లు వేసుకుని…తెలుగు కోకమ్మా సిగ్గాయనే! వెలుగు చీరమ్మా చింతాయెనే! అని పాడుకుంటూ ఉంటారు. డెబ్బయ్యో పడిలో బాత్ రూమ్ లో కాలు జారిపడితే మునిమనవరాలు వాకర్ ఇస్తే తప్ప లేచి నిలుచోలేని ఆదికి అనాది హీరో- పది పరీక్షలు రాసి ఫలితాలకోసం నిరీక్షిస్తున్న హీరో ఇన్ తోనే ఎగరాల్సిన పాటల సందర్భాలు మనవి. ఇదివరకు పాటలు రాగానే బీడీలు, సిగరెట్లు తాగడానికి, గోళీ సోడాలు తాగడానికి బయటికైనా వెళ్లేవారు. ఇప్పుడు దారిదోపిడీ మల్టీప్లెక్స్ లలో బయటికెళితే నిలువుదోపిడీ ఖాయమన్న భయంతో పాటలకు బయటికెళ్లే అవకాశం కూడా లేకుండాపోయింది.

ఎగరలేని వృద్ధ హీరో శరీర అవయవాలను ఎగిరించడానికి నిర్మాత పెట్టే ఖర్చు; పడే కష్టం పగవాడికి కూడా వద్దు!

ఈ అసందర్భ, అర్థరహిత పాటలతో ప్రేక్షకులు పడుతున్న అష్టకష్టాలను సినీపరిశ్రమ గుర్తించినట్లుంది. పాటలే లేని సినిమాలవైపు పరిశ్రమ మొగ్గు చూపుతోంది. తాజాగా విజయ్ దేవరకొండ సినిమాలో పాటలే ఉండవట!

ఇంతకూ-
పాటను అవసరం లేనిదిగా మనమే ప్రయత్నపూర్వకంగా చేస్తున్నామా?
దానికదిగా అంతరించిపోతోందా? …కాలమే అన్నిటికీ సమాధానం! -పమిడికాల్వ మధుసూదన్   9989090018 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions