కరోనా ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన విషాదం అందరికీ తెలిసిందే… చైనా వాడి నిర్వాకానికి ప్రపంచం మొత్తం అన్నిరకాలుగా వేధించబడింది… ఇప్పటికీ కనుమరుగు కాలేదు… భస్మాసురుడిలా చైనా కూడా బాధపడుతోంది… అది వేరే సంగతి… ఇక అలాంటిదే మరో వైరస్ ప్రపంచాన్ని గడగడ వణికించడానికి, మరింత విలయం సృష్టించడానికి ఈ సంవత్సరమే పుట్టుకురానుందట… కాకపోతే ఈసారి రష్యా వంతు అట… ఓహ్, ఈ కమ్యూనిస్టు కాకపోతే ఆ కమ్యూనిస్టు అన్నమాట…
ఎహె, నాన్సెన్స్… అసలు ఆ వైరస్ మా చైనాలో పుట్టింది కాదు, మా చైనా శాంతిని, సర్వమానవ ఆరోగ్యాన్ని, సుఖాన్ని కోరుకునే అద్భుతదేశం అనే చైనా సమర్థక పిడివాదులు, రాపిడివాదులు, ఒరిపిడివాదులు ఎప్పుడూ ఉంటారు… వాళ్ల ఖర్మకు వాళ్లను కాసేపు వదిలేస్తే… మరి ఈ రష్యా వైరస్ కథేమిటి అంటారా..? బల్గేరియాకు చెందిన ఓ జ్యోతిష్కురాలు ఉండేది, 1911లో పుట్టింది… పేరు బాబా వాంగ… పన్నెండేళ్ల వయస్సులో కళ్లు పోయాయి… ప్రపంచవ్యాప్త పరిణామాలపై చాలా జోస్యాలు చెప్పింది… అందులో చాలా నిజమయ్యాయి అనే ప్రచారం ఉంది… (చైనాకు చెందిన జ్యోతిష్కుడు నోస్ట్రాడామస్, మన తెలుగు వీరబ్రహ్మేంద్రస్వామి జోస్యాలకున్నంత ప్రచారమే ఆమె జోస్యాలకూ ఉంది)…
నిజానికి ఆమె ఎక్కడా రాసిపెట్టలేదు… ఆమె అనుచరులకు చెప్పినవే… ఎన్ని ప్రక్షిప్తాలు చేరాయో, ఎలా ప్రచారంలో మారిపోయాయో… ఎవరికి తోచిన బాష్యాలు వాళ్లు చెప్పుకోవడమే… 2022 సంవత్సరానికి సంబంధించి ఆరు ప్రధాన పరిణామాలను ఆమె చెప్పిందట… అందులో రెండు నిజమయ్యాయట… మరో నాలుగు బాకీ ఉన్నాయట… ఎవడో ఇంగ్లిష్ వెబ్‌సైట్ వాడు రాశాడు… ఇక అందరూ టాంటాం చేస్తున్నారు… ఆసియా దేశాలు, ఆస్ట్రేలియాల్లో భారీ వరదలు ఒక జోస్యం… పలు దేశాల్లో తీవ్ర కరువు రెండో జోస్యం… పోర్చుగల్, ఇటలీ వంటి దేశాల్లో తీవ్ర దుర్భిక్షం నెలకొంది కదా…
Ads
నిజం కావాల్సిన నాలుగులో… ఒకటేమో గ్రహాంతరవాసుల దాడి… రెండోది వ్యవసాయంపై మిడతల దాడి… మూడోది వర్చువల్ రియాలిటీ విశ్వరూపం… నాలుగోది సైబీరియా నుంచి ఓ ప్రాణాంతక వైరస్ పుట్టుక, దాడి… (అసలు ఈమె కరోనా గురించి చెప్పిందా..? లేదు…!) గ్రహాంతరవాసుల దాడి అనేది ఓ అబ్సర్డ్ ప్రెడిక్షన్… వర్చువల్ రియాలిటీ అనేది కొత్త సాంకేతికతల్లో ఓ భాగం… ఈ ఆరు జోస్యాల్ని ఆమె చెప్పిందా అనేదే పెద్ద డౌట్… ఇక సైబీరియా వైరస్ గురించి చెప్పుకుందాం…
నిజమో కాదో నిగ్గు ఎప్పుడూ తేలదు, తేలనివ్వరు… కానీ కరోనా పుట్టుక చైనా, వుహాన్ లోని ప్రఖ్యాత వైరాలజీ ల్యాబ్ నుంచే అనే ప్రపంచం నమ్ముతోంది… బయాలాజికల్ వార్‌ఫేర్ కోసం సృష్టించిన వైరస్ పొరపాటున లీకైందనేది ప్రచారం… మరి రష్యాలో…? ఉంది… రష్యాలో కూడా ఓ వుహాన్ ల్యాబ్ ఉంది, దానికి తాత వంటి వైరాలజీ ల్యాబ్ ఉంది… దాని పేరు వెక్టార్… పైన చూపించింది అదే…
దానికీ ఇలాంటి బయాలాజికల్ వార్‌ఫేర్ చరిత్రే ఉంది… అప్పట్లో స్మాల్‌పాక్స్‌ను కలగజేసే వరియోలా వైరస్ నుంచి కొత్త ప్రాణాంతక జీవాయుధం వంటి వేరియెంట్‌ను డెవలప్ చేయడానికి ప్రయత్నించిందనే పెద్ద కథే ఉంది… దాని మీద రచ్చ కూడా సాగింది కొన్నాళ్లు… ఎబోలా పుట్టుక మీద కూడా బోలెడు సందేహాలు రష్యావైపే చూపిస్తుంటాయి… ఇదే ల్యాబ్‌లో ఎబోలాతో ఓ వైరాలజీ డాక్టర్ కూడా మరణించాడు… అంతెందుకు..? 2019లో… అంటే మొన్నమొన్ననే ఈ ల్యాబ్‌లో అకస్మాత్తుగా పేలుళ్లు సంభవించాయి… ప్రాణాంతక, ప్రయోగ వైరస్‌ల లీకేజీ మీద సందేహాలు ప్రబలాయి… WHO దాకా ఆరోపణలు… అదో నెత్తిమాశిన సంస్థ తెలుసు కదా… ఏదో తూతూమంత్రం దర్యాప్తు జరిపి, ఏ ప్రమాదకర వైరస్ లీక్ కాలేదని రిపోర్ట్ ఇచ్చింది… మరి ఆ ల్యాబ్‌లో ఏం జరిగింది..? ఇప్పటివరకూ రహస్యమే… ఈలోపు చైనా కరోనా విజృంభణ, ఇప్పుడు ఉక్రెయిన్… ప్రపంచానికి పాత అంశాల్ని నెమరేసుకునే టైం ఎక్కడ దొరుకుతోంది..? అవునూ, ఈ వెక్టార్ నుంచేనా కొత్త ప్రాణాంతక వైరస్ పుట్టుకొచ్చేది..?!
Share this Article