Nàgaràju Munnuru….. ముఖేశ్ అంబానీ కొడుకు వివాహ వేడుకల్లో భాగంగా నిర్వహించిన అన్నసేవలో ముఖేశ్ అంబానీ, కాబోయే వధూవరులు అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ స్వయంగా భోజనాలు వడ్డించారు. నాకు నచ్చిన విషయం ఏమిటంటే బిలియనీర్లు ఆయినా వీళ్ళు స్వయంగా అతిథులకు వడ్డించడం ఒక్కటే కాదు, సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేయడం.
మనం ఏం చేస్తున్నాం? సాధారణ దిగువ మధ్యతరగతి మొదలు కోటీశ్వరుల దాకా పెళ్లి రిచ్ గా, ఫంక్షన్ హాల్ గ్రాండ్ గా ఉండేలా చూసుకుంటూ, అతిథులు తినడానికి ఇడ్లీ, వడ, దోశ, మొదలు పానీపూరి వరకు ఇండియన్, చైనీస్ వంటకాలు, పదుల సంఖ్యలో స్వీట్స్ ప్రూట్స్, ఐస్క్రీంలు ఇలా ఒక యాభై అరవై వెరైటీలు పెడుతున్నారు. మనిషన్నవాడెవడు ఇన్ని వెరైటీలు ఒక్కపూటలో తినలేడు అనేది ఒక వాస్తవమైతే, పెట్టిన ఆహార పదార్థాలలో తినేదానికన్నా వృధా అయ్యేదే ఎక్కువ.
కార్యక్రమానికి వచ్చిన అతిథులు ఒక ప్లేట్ పట్టుకుని ఆ గుంపులో టేబుల్ టేబుల్ తిరుగుతూ అన్ని ఐటమ్స్ వడ్డించుకుంటూ… ఒక చేత్తో ప్లేట్ పట్టుకుని తిరుగుతూ… ఎక్కడ నిలబడడానికి కొద్దిగా స్థలం ఉందో చూసుకుని వరద బాధితుల మాదిరి భోజనాలు చేయాల్సి వస్తుంది. మధ్యలో పొలమారి నీళ్ళు తాగాల్సి వస్తే, మళ్ళీ దానికోసం పరిగెత్తుకు వెళ్ళాలి. రెండు గుటకల నీళ్ళు తాగాక ఆ గ్లాసును ఎక్కడ పెట్టాలో తెలియదు…
Ads
వీటన్నింటి కన్నా దరిద్రం ఏమిటంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు డబ్బున్న వాళ్ళను చూసి దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి వర్గాల వాళ్ళలో చాలామంది తాహతుకు మించి అప్పులు చేసి మరీ పెళ్ళిళ్ళు గ్రాండ్ గా చేస్తున్నారు. ఆ తర్వాత ఆ అప్పులు కట్టలేక కొన్ని సంవత్సరాలు ఇబ్బంది పడుతున్నారు.
ఎవరికో చూపించుకోవడానికి మనం బతకాల్సిన అవసరం లేదు. మనకి ఉన్నంతలో 10-12 ఐటమ్స్ మించకుండా భోజనాలు ఏర్పాటు చేసుకుని, తక్కువమంది అతిథులను ఆహ్వానించి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసి, కొద్దిమంది అతిథులకైనా స్వయంగా వడ్డించి చూడండి. వచ్చిన అతిథులకి మీకు ఆ ఎక్స్పీరియన్స్ చాలా ఏళ్ళు గుర్తుండిపోతుంది.
మనం మనకోసం బతకాలి,
మందికి చూపించుకోవడానికి కాదు.
డబ్బున్న వాళ్ళను కాపీ కొట్టాల్సిన అవసరం అస్సలు లేదు. అంతగా వాళ్ళను కాపీ కొట్టాలి అంటే వాళ్లు డబ్బు సంపాదించే మార్గాలను, పెట్టుబడులు పెట్టే పద్దతులను కాపీ కొట్టండి.
ఇది ఎవరినో విమర్శించాలి అని కాదు మన శ్రేయస్సు కోసమే చెబుతున్నాను… ఎందుకంటే ఆడంబరంగా జరిపే వివాహ వేడుకల ఫోటోలు ఫేస్బుక్లో అప్లోడ్ అవుతాయి కానీ ఆ ఆడంబరాల కోసం చేసిన అప్పులు, వాటిని తీర్చడానికి పడే తిప్పలు సోషల్ మీడియాలో చెప్పుకోలేరు.
గొంగడి ఉన్నంత వరకే కాళ్ళు చాపుదాం,
అప్పుల బాధలు లేని జీవితం గడుపుదాం…. – నాగరాజు మున్నూరు
Share this Article