.
Nàgaràju Munnuru ….. == మహకుంభమేళాకి వెళ్తున్నారా? ==
ప్రయాగరాజ్ వెళ్ళాక ఏం చేయాలి, కుంభమేళాలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, భోజనం, వసతి సౌకర్యాలు ఇలాంటి విషయాల మీద ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి, ఇతరుల అనుభవాలను కూడా తెలుసుకుని కొంత సమాచారాన్ని సేకరించాను. కుంభమేళాకు వెళ్ళే తెలుగు వారికి కూడా ఉపయోగపడుతుందని ఆ సమాచారాన్ని ఇస్తున్నాను…
Ads
1. ప్రయాణం మరియు రవాణా
నడవడానికి సిద్ధం కండి: కుంభమేళాకి వెళ్ళేవారు సంగమం నది తీరానికి చేరడానికి కనీసం 4- 6 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. అది కూడా మీ లగేజీ మోసుకుంటూ. ఒకవేళ మీరు రైలులో గనుక వస్తే ఈ దూరం 10 కిలోమీటర్ల వరకు పెరుగుతుంది.
రైల్వే స్టేషన్లు: కుంభమేళా ప్రాంతానికి అతి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ ప్రయాగ్‌రాజ్ సంగం రైల్వే స్టేషన్. ఇది సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ రద్దీ నివారించడానికి అమృత్ స్నానం ఆచరించే తేదీలలో ఒకరోజు ముందు నుండి, తర్వాత రెండు మూడు రోజుల వరకు ఈ స్టేషన్లు మూసి వేస్తారు.
అమృత్ స్నానం ఆచరించే ముఖ్యమైన తేదీలు
మౌని అమావాస్య: జనవరి 29, 2025
బసంత్ పంచమి: ఫిబ్రవరి 3, 2025
మాఘ పూర్ణిమ: ఫిబ్రవరి 12, 2025
మహాశివరాత్రి: ఫిబ్రవరి 26, 2025
తరువాత సమీప రైల్వే స్టేషన్ ప్రయాగ్‌రాజ్ చౌకీ (Prayagraj Cheoki). అమృత్ స్నానం ఆచరించే తేదీలతో సంబంధం లేకుండా హైదరాబాదు నుండి నడిచే అన్ని రైళ్ళను ఈ స్టేషన్లోనే ఆపేస్తున్నారు. ఇది కుంభమేళా ప్రాంతానికి సుమారు 18 కిలోమీటర్ల దూరంలో ఉంది.
కుంభమేళా ట్రాఫిక్ రద్దీ కారణంగా ప్రయాగరాజ్ పట్టణంలో ఆటో, ఈ-రిక్షా, ఓలా, ఉబర్ వంటి రవాణా సౌకర్యాల మీద నియంత్రణలు విధించారు. కొందరు ఆటోవాలాలు అనధికారంగా నడిపిస్తున్నప్పటికి ఇలా తిరిగే ఆటో, ఈ-రిక్షాలను పోలీసులు ఎప్పుడైనా ఆపే అవకాశం ఉంది.
తప్పుడు, మోసపూరిత వాగ్దానాలను నమ్మకండి: ఎవరైనా ఆటోవాలాలు, క్యాబ్ డ్రైవర్లు మీరు అసలు నడవాల్సిన అవసరం లేకుండా త్రివేణీ సంగమం వద్దే దింపుతామని, అందుకోసం ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని చెబితే అస్సలు నమ్మకండి. ఎందుకంటే వారు చెప్పేది అబద్ధం. మహాకుంభమేళా జరుగుతున్న ప్రాంతంలోనే కనీసం 3- 4 కిలోమీటర్లు ఖచ్చితంగా నడవాల్సి ఉంటుంది.
2. వసతి సదుపాయాలు
మహకుంభ టెంట్ సిటి: కుంభమేళాలో యాత్రికుల వసతి కోసం తాత్కాలికంగా టెంట్ సిటి ఏర్పాటు చేశారు. వాటిలో అందించే సౌకర్యాలను బట్టి ఒకరికి ఒకరోజుకు ₹1500 నుండి ₹1.20 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నారు. నమ్మదగిన మిత్రుల నుండి సేకరించిన సమాచారం మేరకు ఈ కింది టెంట్ నిర్వాహకులను వసతి కోసం సంప్రదించవచ్చు.
లోకేషన్: అరలి/నైని టెంట్ సిటి, యమునా నది తీరం
వసతి: ₹25,000 రూపాయలకి 15 మందికి రెండు రోజుల కోసం (కేవలం వసతి మాత్రమే, భోజన సౌకర్యం లేదు)
కాంటాక్ట్ పర్సన్: పండిత్ రాహుల్ తివారీ (Pandit Rahul Tiwari)
ఫోన్: +91-7860031871 (హిందీ, ఇంగ్లీష్ మాట్లాడతారు)
లోకేషన్: శ్రీ పరకాల స్వామీ మఠం, లక్ష్మీనారాయణ మందిర్, దారగంజ్ (ఇది ప్రయాగ సంగం రైల్వే స్టేషన్ నుండి 300 మీటర్లు, గంగానది నుండి 500 మీటర్లు, త్రివేణీ సంగమం నుండి కిలోమీటరు దూరంలో ఉంది)
వసతి: ₹3000 ఒకరికి ఒక రోజుకి. (టీ కాఫీ, టిఫిన్, రెండుపూటలా భోజనంతో కలిపి)
సంప్రదించాల్సిన వ్యక్తులు
విజయ రాఘవన్: +91-9740442284
అనంత శయనం: +919448050526, +919347046230 (వీరు తెలుగు, తమిళ్, కన్నడ భాషలు మాట్లాడతారు)
ఆన్లైన్ బుకింగ్స్: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహాకుంభమేళా కోసం వచ్చే యాత్రికులు ఆన్లైన్ ద్వారా కూడా టెంట్ వసతి బుక్ చేసుకునే అవకాశం కల్పించింది.
దానికొరకు సంప్రదించాల్సిన వెబ్సైట్లు
https://kumbhcamp.org
https://kumbh.gov.in
https://upstdc.co.in
వాట్సప్ బుకింగ్: 8887847135 అనే నెంబర్‌కి వాట్సప్ లో Hai అని మేసేజ్ పంపితే చాట్ బాట్ ఇచ్చే సూచనలు అనుసరిస్తూ కూడా టెంట్ బుకింగ్స్ చేసుకోవచ్చు.
3. వెంట తీసుకెళ్లాల్సినవి (తీసుకెళ్ళకూడనివి)
అత్యంత రద్దీ జనంలో కిలోమీటర్ల కొద్దీ బ్యాగులను మోస్తూ నడిచి వెళ్ళాల్సి ఉండటం వలన వీలైనంత తక్కువ లగేజీ మాత్రమే తీసుకు వెళ్ళడం శ్రేయస్కరం.
ఉత్తర భారతదేశంలో ఈ సమయంలో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. చలిని తట్టుకునే దుస్తులైన స్వెట్టర్లు, చేతి గ్లోవ్స్, సాక్స్ వంటివి, కప్పుకోవడానికి దుప్పట్లు, చర్మం పగులకుండా కోల్డ్ క్రీమ్ వంటివి అవసరం. అలాగే ఎక్కువ దూరం నడవాల్సి ఉంటుంది కాబట్టి అందుకు అనువైన దుస్తులు, షూస్ ధరించడం మంచిది.
కుంభమేళాకి ఎట్టి పరిస్థితుల్లో పిల్లలను వెంట తీసుకురాకండి. అలాగే శారీరకంగా దృఢంగా లేని మహిళలు కూడా రాకపోవడం మంచిది.
లగేజీ పెట్టుకోవటానికి క్లోక్ రూమ్స్, లాకర్లు అందుబాటులో లేవు. విలువైన బంగారు ఆభరణాలు, ఎక్కువ మొత్తంలో నగదు తీసుకురాకండి. మీ వస్తువుల బాధ్యత మీదే అనే విషయాన్ని గుర్తుంచుకోండి.
4. మహాకుంభమేళాలో రద్దీ…
అమృత్ స్నానం రోజులలో విపరీతమైన రద్దీ ఉంటుంది. ఆ సమయంలో తరచుగా రూట్ డైవర్షన్స్ చేస్తుంటారు. అందువలన రద్దీలో నడవడం కూడా కష్టంగా ఉండవచ్చు. నాగ సాధువులు ఉదయం 5:30 నుండి 7:00 గంటల వరకు చేస్తారు. ఆ తర్వాత సాధారణ భక్తులకు స్నానం చేసే అవకాశం కల్పిస్తారు. ఆ సమయంలో జనం విపరీతంగా వస్తారు కాబట్టి అంత రద్దీని తట్టుకోలేని వారు అమృత్ స్నానం ఆచరించే రోజుల్లో వెళ్లకపోవడం మంచిది.
తప్పిపోతే ఏమీ చేయాలి?
మహాకుంభమేళాలో సుమారు 10 అనౌన్స్ మెంట్ టవర్స్ ఏర్పాటు చేశారు. ఒకవేళ మీరు మీ గ్రూపు సభ్యుల నుండి తప్పిపొతే అనౌన్స్ మెంట్ చేయడానికి ఏర్పాటు చేసిన టవర్స్ వద్దకు చేరుకొండి. ఉదాహరణకు సంగం వద్ద ఏర్పాటు చేసిన టవర్ నెం.1 ఇలాంటి అనౌన్స్ మెంట్ చేయడానికి వాడుతున్నారు.
గ్రూపు సభ్యులను సులభంగా గుర్తించడానికి ఒకే రంగు దుస్తులు లేదా టోపీ ధరించడం. ఒకవేళ తప్పిపోతే ఎవరు, ఎక్కడ కలుసుకోవాలి, ఏమీ చేయాలి అనేది ముందే నిర్ణయించుకోవడం మంచిది.
దారితప్పితే పోలీసుల సహాయం కోరండి. ఒక రాంగ్ మలుపు తీసుకుంటే 2- 3 కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
భోజన సౌకర్యాలు: మహాకుంభమేళాలో అనేక ఆధ్యాత్మిక సేవా సంస్థలు ఉచితంగా భోజనశాలలు (భండరాలు) ఏర్పాటు చేశారు. వాటిలో ఒకటి అమెరికా వాస్తవ్యులైన వుటుకూరి వెంకట్ గారి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న దానధర్మ ట్రస్టు. వీరు మహాకుంభమేళా భక్తులకి ఉచితంగా భోజనం అందిస్తున్నారు. భోజన సౌకర్యం కోసం ఆదినారాయణ స్వామీ గారిని ఈ కింది ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించండి. +91-8008933967.
వీలైతే మరికొందరికి అన్నదానం చేయడానికి మీకు తోచినంత ఆర్థిక సాయం చేయండి.
డబ్బులు చెల్లించి కొనుక్కునే భోజనం ధరలు సాధారణం కంటే అధికంగా ఉండే అవకాశం ఉంది.
వీఐపీ సర్వీస్: ఒకవేళ మీరు కుంభ మేళాలో వీఐపీ సర్వీస్ పొందాలి అనుకుంటే రోజుకి ₹45-50 వేల రూపాయల మొదలు వివిధ ప్యాకేజీ లు అందుబాటులో ఉన్నాయి. పైన ఇచ్చిన ప్రభుత్వ వెబ్సైటులలో బుకింగ్ చేసుకోవచ్చు.
ఎప్పుడు వెళ్ళడం మంచిది: జనం రద్దీ తక్కువగా ఉన్నప్పుడు వెళ్ళాలి అనుకునే వారు అమృత్ స్నానం తేదీలను మినహాయించి వెళ్ళడం మంచిది. ఫిబ్రవరి 5- 10, ఫిబ్రవరి 14- 22 మధ్య జనం తక్కువగా ఉండే అవకాశం ఉందని అక్కడి నుండి అందిన సమాచారం.
5. త్రివేణీ సంగమం ప్రాంతం
ఎక్కడ స్నానం చేయాలి: యమునా గంగా నదులు కలిసి ప్రాంతాన్ని త్రివేణీ సంగమం అంటారు. (సరస్వతి నది అంతర్వాహిని). ఇక్కడ ఒకవైపు యమునా మరోవైపు గంగ నది ప్రవహిస్తూ ఉంటుంది.
నీటి ఉష్ణోగ్రత: హిమాలయాల నుండి ప్రవహించే నదులు కావడం, చలికాలం వాతావరణం కారణంగా నదిలో నీరు అత్యంత చల్లగా ఉంటుంది. అందుకోసం మానసికంగా సిద్ధం కండి. అలాగే స్నానం చేసిన వెంటనే దుస్తులు మార్చుకునే ప్రయత్నం చెయ్యండి.
ఫైనల్ టిప్స్
1. మీ ప్రయాణ తేదీలను అమృత్ స్నానం ఆచరించే రోజులను మినహాయించండి
2. వీలైనంత తక్కువ లగేజీ మాత్రమే తీసుకెళ్ళండి. ఎక్కువ దూరం నడవడానికి సిద్దం కండి.
3. చలిని తట్టుకునే వెచ్చని దుస్తులు, బ్లాంకెట్ తీసుకువెళ్ళండి.
4. గ్రూపు సభ్యుల నుండి వేరు కాకుండా జాగ్రత్తగా ఉండండి, ఒకవేళ తప్పిపోతే ఏమీ చేయాలో ముందే నిర్ణయించుకొండి
5. రద్దీని అనుసరించి ఎక్కువ, తక్కువ దూరం నడవాల్సి రావచ్చు. పోలీసులు, అధికారులు, ఇతర సిబ్బంది ఇచ్చే సూచనలు అనుసరించండి.
పైన చెప్పిన సూచనలు, సమాచారం ద్వారా మీ మహాకుంభమేళాయాత్ర అనుభవం సుఖప్రదంగా, శుభప్రదంగా జరుగుతుందని ఆశిస్తున్నాను. – నాగరాజు మున్నూరు
#MahaKumbhMela2025 #MahaKumbh2025Prayagraj
Share this Article