Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

శతాబ్దపు దోపిడీ..! ఇంగ్లండ్- అర్జెంటీనా వైరం మొదలైన వేళ !

July 16, 2026 by M S R

.

ఇది ఆరు దశాబ్దాల వైరం… ప్రపంచ కప్ మ్యాచ్ నుంచి పోలీసులతో బయటికి గెంటేయబడిన కెప్టెన్ ఎవరు..? అర్జెంటీనా ఆటగాళ్లను Animals అని ఎవరు సంబోధించారు..? అర్జెంటీనా దృష్టిలో, 20 వ శతాబ్దపు అతి పెద్ద దోపిడి ఏది..?

నిన్నటి ఫుట్‌బాల్ మ్యాచ్ చుట్టూ ఎంతటి వేడి అలుముకుందో చూశాం కదా… అర్జెంటీనా – ఇంగ్లండ్ నడుమ పోరు అంటే ప్రతిసారీ ఓ చరిత్ర… ఫుట్‌బాల్ ప్రపంచంలో కొన్ని మ్యాచ్‌లు కేవలం క్రీడగా మాత్రమే మిగిలిపోవు, అవి రెండు దేశాల మధ్య చిరకాల వైరానికి పునాదులు వేస్తాయి.

Ads

అలాంటి ఒక విచారకరమైన, వివాదాస్పదమైన మ్యాచ్ 1966 జూలై 23న లండన్‌లోని వెంబ్లీ స్టేడియంలో జరిగింది. 1966 ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్స్‌లో తలపడిన ఇంగ్లండ్, అర్జెంటీనాల పోరు చరిత్రలో “El Robo del Siglo” (శతాబ్దపు అతిపెద్ద దొంగతనం) గా ముద్రపడింది.

మైదానంలో నాటకీయ పరిణామాలు … ఆ మ్యాచ్ ఆరంభం నుంచే ఉద్రిక్తంగా సాగింది. జర్మన్ రిఫరీ రుడాల్ఫ్ క్రెట్లెన్ తీసుకున్న నిర్ణయాలపై అర్జెంటీనా కెప్టెన్ ఆంటోనియో రాటిన్ అభ్యంతరం తెలపడం, భాషా సమస్య కారణంగా అది ఘర్షణకు దారితీయడం చకచకా జరిగిపోయాయి. ‘Violence of the Tongue’ (నోటి దురుసు) అనే ఆరోపణతో రాటిన్‌ను రిఫరీ మైదానం నుండి బయటకు పంపడం మ్యాచ్ రూపురేఖలనే మార్చేసింది.

అర్జెంటీనా కెప్టెన్ ఆవేశంతో వెళ్లి రాయల్ రెడ్ కార్పెట్ (రాణి ఎలిజబెత్ కోసం వేసినది) మీద బైఠాయించడం అప్పట్లో ఇంగ్లాండ్ ప్రజలకు ఒక పెద్ద అవమానంగా కనిపించింది. పది మంది ఆటగాళ్లతోనే అర్జెంటీనా పోరాడాల్సి రావడం, చివరకు 78వ నిమిషంలో జెఫ్ హర్స్ట్ గోల్ చేయడంతో ఇంగ్లండ్ విజయం సాధించింది. ఆ గోల్ ‘ఆఫ్‌సైడ్’ అని అర్జెంటీనా ఆటగాళ్లు మొత్తుకున్నా ఫలితం లేకపోయింది.

“Animals” వ్యాఖ్య.. రగులుకున్న కక్ష … ఈ మ్యాచ్ జరిగిన తీరుపై, ఆ తర్వాత ఇంగ్లండ్ మేనేజర్ ఆల్ఫ్ రామ్సే అర్జెంటీనా ఆటగాళ్లను “Animals” (మృగాలు) అని వ్యాఖ్యానించడం ఆ దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీసింది. ఆ రోజు ఇంగ్లండ్ ఆడిన మొరటు ఆట, రిఫరీ పక్షపాత నిర్ణయాలు అర్జెంటీనా మనసులో చెరగని గాయాలను మిగిల్చాయి. ఆనాటి నుండే అర్జెంటీనా- ఇంగ్లండ్ అంటే అది కేవలం ఫుట్‌బాల్ మ్యాచ్ కాదు, అదొక యుద్ధం అనే భావన మొదలైంది.

మార్పుకు నాంది … ఈ “చెడ్డ మ్యాచ్” ప్రపంచ ఫుట్‌బాల్‌పై తీవ్ర ప్రభావం చూపింది. ఆటలో పారదర్శకత, స్పష్టత ఉండాలని భావించిన FIFA, వివాదాలకు తావులేకుండా ఉండేందుకు మ్యాచ్‌ మధ్యలో రిఫరీలకు సంకేతాలు ఇచ్చే ఎల్లో కార్డ్, రెడ్ కార్డ్ నిబంధనలను ప్రవేశపెట్టింది.

ఆంటోనియో రాటిన్ వంటి దిగ్గజ ఆటగాడు ఇటీవల 79 ఏళ్ల వయసులో కన్నుమూయడం ఆనాటి జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేసింది. ఇంగ్లండ్- అర్జెంటీనా మ్యాచ్ అనగానే నేటికీ ఫుట్‌బాల్ అభిమానులకు ఆ 1966 నాటి వివాదమే ముందుగా గుర్తొస్తుంది. క్రీడల్లో గెలుపోటములు సహజమే అయినా, ఆనాటి మ్యాచ్ చూపిన పాఠం మాత్రం నేటికీ నిలిచి ఉంది. క్రీడా స్ఫూర్తి లేని విజయం ఎంతటి వైరాన్ని సృష్టిస్తుందో చెప్పడానికి ఈ మ్యాచ్ ఒక నిదర్శనం.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • శతాబ్దపు దోపిడీ..! ఇంగ్లండ్- అర్జెంటీనా వైరం మొదలైన వేళ !
  • Destiny – మెస్సీ ముద్దాడే ఈ పసికందు..! ఈ ఫైనల్స్‌లో తనకే ‘పోటీదారు’ !!
  • శిశువులకు బంగారు ఉంగరాలు – విజయ్ వైఖరిపై సందేహాలు !
  • పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నయ్ ! అసలు గేమ్ షురూ !!
  • ఈసారి ‘ఆపరేషన్ సిందూర్’ఏమాత్రం సరిపోదు… అంతకుమించి..!!
  • మరీ గోకకు పవన్ !! నువ్వు వేళ్లు పెడితే… రేవంత్ కాళ్లు పెడతాడు !!
  • ఒక భూమనకూ- ఒక నాయుడికీ …. ఒక జగన్‌కూ ఒక బాబుకూ తేడా ఏమున్నట్టు..?!
  • ఏడుపుగొట్టు ట్రోలర్లు… చివరకు జానకమ్మ మనమరాలినీ వదల్లేదు !!
  • వనపర్తి ఆటో భరత్‌కు బండి సంజయ్ మాత్రమే ఎందుకు గుర్తొచ్చాడు..?!
  • మినిమం పీహెచ్‌డీ చేసినా… ఈ మార్పులు అర్థం కావడం కల్ల !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions