కోల్‌కతా పీజీ డాక్టర్ హత్యాచారం ఘటనపై బాలీవుడ్ అరిజీత్‌సింగ్ వీడియో చూసైనా టాలీవుడ్ ప్రముఖులు ‘పాన్ ఇండియన్లం’ అని నిరూపించుకోవచ్చు
……………………………………
తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ఎలాంటి అన్యాయం జరిగినా తెలుగు సినీరంగ (టాలీవుడ్) ప్రముఖులకు ఏమీ పట్టదని గతంలో అనేకసార్లు రుజువైంది. 2019 నవంబర్ 27 ఉదయం హైదరాబాద్‌కు 30 కిలోమీటర్ల దూరంలో డాక్టర్ ప్రియాంక రెడ్డి అనే 26 ఏళ్ల పశువైద్యురాలిని నలుగురు దుర్మార్గులు బలత్కరించాక, మంటల్లో పడేసి కాల్చిచంపారు.
అప్పుడు మహిళా, హక్కుల సంఘాలు సహా సామాన్య ప్రజానీకం ఈ దుర్మార్గాన్ని ఖండిస్తూ వీధుల్లోకి వచ్చారు. టాలీవుడ్ దర్శకులు, నటీనటులు, ప్లేబ్యాక్ సింగర్లు, నిర్మాతలు–ఈ జాతుల వారిలో ఎవరూ ప్రియాంక (దిశా) హత్యపై నిప్పులు చిమ్ముతూ గట్టిగా మాట్లాడలేదు. ఇలాంటి సందర్భాల్లో బాలీవుడ్ చాలా వరకు మేలని ఇది వరకు అనేకసార్లు మన అనుభవంలో తెలుసుకున్నాం.
Ads
ప్రియాంక హత్యాచారంతో పోల్చితే మరింత క్రూరమైన రీతిలో 31 ఏళ్ల కలకత్తా ట్రెయినీ డాక్టర్ ‘హత్యాచారం’ జరిగింది. బెంగాల్ పాత రాజధాని ముర్షీదాబాద్ జిల్లాలో, రాజధాని కలకత్తాలో మూలాలున్న పసిద్ధ బాలీవుడ్ (ప్రధానంగా హిందీ) గాయకుడు అరిజీత్ సింగ్ ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకైనా తన సొంత నగరం కలకత్తా పేరు మంట గలిపిన డాక్టర్ గ్యాంగ్‌రేపు–మర్డర్‌పై ప్రజలను మేల్కొలిపే రీతిలో తన మాతృభాష బెంగాలీ లేదా బాంగ్లాలో పాట రికార్డు చేసి తన యూట్యూబ్ చానల్‌లో విడుదల చేశాడు. ఈ పాట పేరు ‘‘ ఆర్ కొబే’’ (Aar Kobe).
2013 నాటి హిందీ రొమాంటిక్ సూపర్‌హిట్ మూవీ ‘ఆషికీ–2’ పాట ‘తుమ్ హీ హో’ పాటతో భారత ప్రజలను, 2015 నాటి హిందీ సినిమా ‘ఆల్ ఈజ్ వెల్’ లోని ‘‘బాతోంసె తేరీ హమ్ భులా నా సకె’’ అనే పాటతో నన్నూ అరిజీత్ సింగ్ ఎంతగానో ఆకట్టుకున్నాడు. కలకత్తా జూనియర్ డాక్డర్ హత్యాచారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దేశ ప్రజల గొంతుతో తన ఖరీదైన స్వరం కలుపుతూ పాడిన వీడియో సాంగ్ విడుదల జేస్తూ అరిజీత్ రాసిన మాటలు తోటి జనాన్ని కదలించేలా ఉన్నాయి.
అంతేకాదు, ఇండియాలో సామాజిక అన్యాయాలపై, రోగాలపై సాగే అన్ని పోరాటాల్లో ముందు వరుసలో ఉండే డాక్టర్లు, విద్యార్ధులతో జర్నలిస్టులను జతచేస్తూ 37 ఏళ్ల అరిజీత్ తన నోట్‌లో రాయడం ఒక జర్నలిస్టుగా నాకెందుకో ఎప్పుడే లేనంత ఆనందాన్ని, ఉత్సాహాన్నిచ్చింది.
పిడికిలి బిగించిన సగం పంజాబీ–సగం బెంగాలీ గాయకుడు
………………………………………………..
ఇటీవల కలకత్తా ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ–ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటన కు వ్యతిరేకంగా సాగుతున్న నిరసన పోరుకు అరిజిత్ తన మద్దతు ఇస్తూ ‘‘ ఆర్ కొబే ’’ పేరుతో విడుదల చేసిన బెంగాలీ వీడియా పాటపై కనిపించే బిగించిన పిడికిలి బొమ్మ మరింత స్ఫూర్తిదాయకంగా ఉంది. ఈ వీడియోసాంగ్‌తో పాటు చేసిన ప్రకటనలో, ‘‘ఇది కేవలం నిరసన గీతం మాత్రమే కాదు. కార్యాచరణకు పిలుపు ఇది.
మహిళల భద్రత, గౌరవమర్యాదల కోసం చేస్తున్న మన పోరాటం అసలేమాత్రం ఆగలేదని గుర్తు చేసే శబ్దం ఇది. ఈ పాటను మనం పాడుకుంటూ ముందుకు సాగితే యుద్ధభూమిలో శత్రువులకు చేతివాటు దూరంలో ఉన్న మన వైద్యులు, జర్నలిస్టులు, విద్యార్ధుల అవిశ్రాంత పోరాటం గుర్తుకొస్తుంది. ఈ మూడు వర్గాల యోధులూ కేవలం మన గౌరవానికి మాత్రమే అర్హులని భావించకూడదు. వారిని కాపాడాల్సిన బాధ్యత మనందరిదీ అని ఈ పాట చెబుతుంది,’’ అంటూ ఏ రాజకీయ నాయకుడు, హక్కుల పోరాట కార్యకర్తలకు తీసిపోని రీతిలో అరిజీత్ రాశారు.
అతని వాక్యాలు వలస పాలకుల కాలంలో జనచైతన్యానికి ప్రతిరూపాలుగా అవతరించిన మహానగరాలు ముంబై, కలకత్తాల విలువ ఏమిటో మనం తెలుసుకోవడానికి పురికొల్పుతున్నాయి. ఈ సుదీర్ఘ ప్రకటనను, ‘‘ 2024 ఆగస్టు 9న కోల్‌కతా నడిబొడ్డున చోటుచేసుకున్న విషాదం భారత జాతి గుండెకు తగిలేలా కుదిపివేసింది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ–హాస్పిటల్‌లో జరిగిన మారణకాండ దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు రగిల్చింది. ఇది (ఈ పాట) న్యాయం కోసం గొంతెత్తిన స్వరం. మౌనంగా బాధపడే అసంఖ్యాక ఆడబిడ్డల కోసం వ్యక్తమైన శోకం. మార్పు కోసం పిడికిలి బిగించి చేసే డిమాండ్,’’ అనే ఉద్వేగపూరిత వాక్యాలతో అరిజీత్ ప్రారంభించాడు.
ఎన్ కన్వెన్షన్ ఫేమ్ నాగార్జున అక్కినేని, మమతా మోహన్‌దాస్ నటించిన పదిహేళ్లనాటి ‘కేడీ’ అనే తెలుగు సినిమాలో ‘‘ నీవే నా నీవే నా’’ అనే పాటను నీహా కక్కఢ్ అనే గాయనితో కలిసి అరిజీత్ పాడాడనే విషయం ఈరోజే నాకు తెలిసింది. నీహా కక్కఢ్ నూరు శాతం పంజాబీ కుటుంబంలో పుడితే, ‘‘ఆషికీ 2’’అరిజీత్ సింగ్ సగం పంజాబీ. ఎందుకంటే ఆయన పంజాబీ సిక్కు తండ్రికి (కక్కఢ్ సింగ్, అదితీ) బెంగాలీ తల్లికి 1987 ఏప్రిల్‌లో ముర్షిదాబాద్‌లో పుట్టాడనే విషయం ఎప్పుడో చదివాను. అందుకే అరిజీత్ మాతృభాష (అతని తల్లి బెంగాలీ కాబట్టి) బెంగాలీ అని కావాలని పొరపాటుగా రాశాను.
అరిజీత్ తాజా వీడియో చూసి, విని అయినా తెలుగు సినీ రంగం అవసరమైనప్పుడు అన్యాయాలకు నిరసనగా పాడకపోయినా కనీసం ప్రకటన చేసినా తెలుగోళ్లను మనం గర్వంగా ‘మనోళ్లు’ అని చెప్పుకునే సాహసం చేయవచ్చు. ‘‘ఆర్ కొబే’’ను ఇప్పుడే యూట్యూబ్‌లో వినొచ్చు. మధ్యాహ్నం ఇండియా టుడే ఇంగ్లిష్ న్యూజ్ చానల్ వార్తల బులెటెన్ చూశాక అరిజిత్ పాట సంగతి తెలిసింది… (మెరుగుమాల నాంచారయ్య)
Share this Article