.
గానా, సారేగామ, జియో సావన్ ఇలా రకరకాల మ్యూజికల్ యాప్స్ ఇవాళ మోబైల్స్ లో కనిపిస్తుంటాయి. ఆ యాప్స్ లోకి ఎంటరైతే చాలు.. మనకు కావల్సిన సంగీత ప్రపంచాన్ని చుట్టేయొచ్చు. చెవుల్లో బ్లూటూతో, హెడ్ ఫోన్సో కనిపించేవార్నెవర్నైనా కదిపితే ఎక్కువలో ఎక్కువ మ్యూజిక్ వినేవారే కనిపిస్తారు.
ఇవాళ్టి యాంత్రిక ప్రపంచంలో మ్యూజిక్ ఓ హీలింగ్ థెరపీలా మారిపోయింది. అలాంటి యాప్స్ లో స్పాటిఫైది ఇప్పుడు అగ్రస్థానం. అయితే, ఆ స్పాటిఫైలో మన ఆర్జిత్ సింగ్ ది అగ్రస్థానమవ్వడమే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఇక్కడి విశేషం.
Ads
అవును, స్పాటిఫై యాప్ లో ఇప్పుడు మన ఆర్జిత్ సింగ్ దుమ్ము రేపుతున్నాడు.
అత్యధిక ఫాలోవర్స్ ఉన్న సంగీతకారుడిగా ఆర్జిత్ సింగ్ పేరు మార్మోగుతోంది. ఏకంగా ప్రాశ్చాత్య గాయకులైన టేలర్ స్విఫ్ట్, ఎడ్ షీరన్ వంటివారిని అధిగమించి స్పాటిఫైలో ఆర్జిత్ ఫాలోవర్స్ సంఖ్య పెరిగినట్టు ఇప్పుడు సర్వేలు చెబుతున్నాయి.
మహ్మద్ రఫీ, కిషోర్ కుమార్, హేమంత్ కుమార్, ముఖేష్ వంటి శకాన్ని దాటి.. 90ల్లో కుమార్ సాను, ఉదిత్ నారాయణ్, సోనూనిగమ్ వంటివారి తర్వాత ఇప్పుడు భారతీయ ప్లేబ్యాక్ సంచలనంగా మారిన గాయకుల్లో ఆర్జిత్ సింగ్ పేరు టాప్ వన్ లో ఉంటుంది. స్పాటిఫైలో ఆర్జిత్ సింగ్ ఫాలోవర్స్ సంఖ్య ఇప్పుడు 151 మిలియన్స్.. అంటే, 15 కోట్లు.
ఈ వారం అనలిటిక్స్ వెబ్సైట్స్ చార్ట్ మాస్టర్స్ తో పాటు, వోల్ట్ ఎఫ్ఎం విడుదల చేసిన డాటా ప్రకారం అమెరికన్ గాయని టేలర్ స్విఫ్ట్ 139.6 మిలినయ్ల మంది ఫాలోవర్స్ తో సెకండ్ ప్లేస్ కు పరిమితం కావల్సివచ్చింది. ఇక బ్రిటీష్ గాయకుడు ఎడ్ షీరన్ 121 మిలియన్స్ తో మూడోస్థానానికి పరిమితమైపోయాడు. షీరన్ ఈ మధ్యే భారత్ నుంచి ప్రేరణ పొంది సఫైర్ అనే ఒక ట్రాక్ ను కూడా విడుదల చేశాడు.
ఇక 114 మిలియన్లతో బిల్లీ ఎలిష్ నాల్గో స్థానానికి పరిమితం కాగా.. జస్టిన్ బీబర్ వంటివారు కూడా పది స్థానాల్లో చివరి స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఆర్జిత్ సింగ్ సాధించిన ఈ క్రేజ్ కేవలం భారతీయ సింగర్ గా తన వ్యక్తిగత విజయంగానే చూడలేం. ఇది ఇప్పుడు ప్రపంచ వేదికపై భారతీయ సంగీతానికి దక్కుతున్న ఆదరణగా కూడా చూడాల్సి ఉంటుంది. ఇక ఈ స్పాటిఫై లో ర్యాకింగ్స్ లో ఉన్న ఇతర భారతీయ కళాకారులు, సంగీతకారుల్లో ఏ.ఆర్. రెహమాన్ 65. 6 మిలియన్స్ మంది అనుచరగణంతో 14వ స్థానంలోనూ, ప్రీతమ్ 53.4 మిలియన్స్ తో 21వ స్థానంలోనూ, నేహాకక్కర్ 48.5 మిలియన్స్ తో 25వ స్థానంలోనూ కనిపిస్తున్నారు. ఐకానిక్ లెజెండ్సై లతా మంగేష్కర్, కిషోర్ కుమార్ కూడా వరుసగా వరుసగా 22 మిలియన్స్, 16 మిలియన్స్ అనుచరులతో 100, 144వ స్థానాల్లో ఉన్నారు.
అయితే, ఈ డాటా నెల రోజుల్లో ఒక గాయకుడి పాట వినే క్రమంలో మరో విధంగా కనిపిస్తోంది. ఒక నెలలో ఆర్జిత్ సింగ్ ఫాలోవర్స్ సంఖ్య 47.4 మిలియన్స్ గా అంటే.. 4 కోట్ల 70 లక్షలకు పైగా కనిపిస్తుండగా.. షీరన్ ను అత్యధికంగా 98.4 మంది ఫాలోవర్స్ ఒక నెలలో ఫాలో అవుతూ ఆయన పాటలు వింటున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో ఐలిష్ 95.1 మిలియన్స్ మందితోనూ.. అలాగే, టేలర్ స్విఫ్ట్ 82.3 మిలియన్స్ మంది అనుచరగణంతోనూ కనిపిస్తున్నట్టు సర్వేలు పేర్కొంటున్నాయి.
ఒక కళాకారుణ్ని ఫాలో అవుతున్నారంటే ఆ ఫాలోవర్స్ కచ్చితంగా కళాకారుడికి సంబంధించిన భవిష్యత్ మ్యూజిక్ ఆల్బమ్స్ పైన ఒక అబ్జర్వేషన్ తో ఉంటారు. ఇది సదరు సంగీతకారులతో యంగేజ్ అయిన ఆయా ఫాలోవర్స్ అభిమానాన్నీ, క్రేజును పట్టి చూపిస్తుంది. ఇక ప్రతీ నెల నెలా పెరుగుతున్న ఆదరణను కూడా ఆయా ఆర్టిస్టులకు సంబంధించి నెలవారీ సర్వేలు కీన్ ట్రాకింగ్ చేస్తున్నాయి. అది వారికుండే ప్రజాదరణకు చిహ్నంగా చెబుతున్నాయి.
38 ఏళ్ల ఆర్జిత్ సింగ్ 2005లో ఒక రియాలిటీ షో తో పరిచయమయ్యాడు. ఫేమ్ గురుకుల్ లో పోటీదారుడిగా తన సంగీత ప్రయాణాన్ని మొదలుపెట్టియ.. 2013లో ఆషికీ 2లో తుమ్ హి హో పాటతో బాలీవుడ్ క్రేజీ సింగర్ గా మారాడు. అప్పటివరకూ ఉన్న టాప్ మోస్ట్ సింగర్స్ కు కొరకరాని కొయ్యగా మారాడు. అవకాశాలన్నీ ఆర్జిత్ నే వెతుక్కూంటూ రావడం.. ఆషికీ ఆర్జిత్ కు ఆధార్ కార్డుల మారిపోవడంతో.. సింగ్ ఈ తరానికి చెందిన గాయకుడిగా దుమ్ము రేపుతున్నాడు. చన్నా మేరేయా, రాబ్తా, కేసరియా, ఫిర్ లే ఆయా దిల్, ఏ దిల్ హై ముష్కిల్ వంటి టాప్ హిట్స్ తో ఆర్జిత్ ది ఇప్పుడు బాలీవుడ్ లో నంబర్ వన్ స్థానం.
ఇక స్పాటిఫై గ్లోబల్ ర్యాంక్స్ లోనూ అగ్రస్థానంలో నిలవడం ఆర్జిత్ సింగ్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆకర్షణను తెలియజెప్పేది. అలాగే, భారతీయ సంగీతానికి దక్కుతున్న ఆదరణనూ పట్టిచూపేది.
స్పాటిఫై అనేది సరిగ్గా 19 ఏళ్ల క్రితం, 2006, ఏప్రిల్ 23లో లక్సెంబర్గ్ లో రిజిస్టరైన స్వీడిష్ ఆడియో స్ట్రీమింగ్ మీడియా. సంగీత రంగంలో ఒక స్టార్టప్ గా అవతరించి ఇప్పుడు గ్లోబల్ లెవల్ లో స్పాటిఫై విశేష ఆదరణ కల్గిన మ్యూజిక్ యాప్ గా దూసుకుపోతోంది…… ( రమణ కొంటికర్ల )
Share this Article